‘అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అలవైకుంఠపురములో’ సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసేకుంది కన్నడ బ్యూటీ పూజా హెగ్డే. ఆ క్రెడిట్ తోనే టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ లీగ్ లో ఉన్న భామలకు గట్టిపోటీనిస్తూ.. పూజా దూసుకుపోతోంది. 2014 లో ఒకలైలా కోసం మూవీతో టాలీవుడ్ లో కథానాయికగా అడుగుపెట్టిన ఈ భామ.. సరిగ్గా ఆరు సంవత్సరాల్లోనే టాప్ చెయిర్ ఆక్రమించింది. అయితే ఇప్పటి వరకూ ఆమె నటించిన తొమ్మిది తెలుగు సినిమాల్ని పరిశీలిస్తే.. ఒక విషయం క్లియర్ గా అర్ధమవుతుంది. పూజా హెగ్డే ఎక్కుగా కనిపించింది మెగా హీరోల చిత్రాల్లోనే.
వరుణ్ తేజ డెబ్యూ మూవీ ‘ముకుంద’ తో కథానాయిక గా మొదటిసారిగా మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టిన పూజా హెగ్డే.. ఆ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండానే.. అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. బన్నీకి, పూజాకి మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అవడంతో .. ఇందులోని సాంగ్స్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక దీని తర్వాత రామ్ చరణ్ , సుకుమార్ సూపర్ హిట్ సినిమా ‘రంగస్థలం’లో పూజా హెగ్డే ఒక ఐటెమ్ సాంగ్ లో జిగేల్ రాణిగా మెరిసి అభిమానుల్ని భలేగా మెప్పించింది. అసలు ఈ సినిమా కోసం పూజా హెగ్డే ఐటెమ్ గాళ్ గా మారడం కూడా చర్చకు దారితీసింది.
రామ్ చరణ్ లాంటి మెగా హీరో, సుక్కూ లాంటి స్టార్ డైరెక్టర్ కలయికలోని సినిమా కాబట్టి.. తన కెరీర్ కు మంచి మైలేజ్ వస్తుందని పూజా తాను ఐటెమ్ సాంగ్ కు అంగీకరించినట్టు చెప్పింది. ఇక లాస్టియర్ వరుణ్ తేజ సరసన ‘గద్దలకొండ గణేష్’ లోనూ, ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘అల వైకుంఠపురములో’ అల్లు అర్జున్ సరసన నటించి మెగాభిమానుల్ని అలరించింది. ఇక త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా రొమాన్స్ చేయడానికి పూజా రెడీ అవుతుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.
ఇంకా పేరు పెట్టని ఈ సినిమా .. ‘గబ్బర్ సింగ్’ మాదిరి కాకుండా.. సోషల్ ఇష్యూస్ నేపథ్యంలో తెరకెక్కబోతోంది. ఈ సినిమా కోసం హరీశ్ పూజాహెగ్డే ను కథానాయికగా ఎంపికచేశాడని ఫిల్మ్ నగర్ టాక్. హరీశ్ శంకర్ ఎర్లియర్ మూవీస్ .. ‘దువ్వాడ జగన్నాథం’లోనూ, ‘గద్దల కొండ గణేశ్’ లోనూ పూజా హెగ్డేని కథానాయికగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల్లోనూ పూజా పెర్ఫార్మెన్స్, గ్లామర్ ఓ రేంజ్ లో ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొనే హరీశ్ శంకర్ పూజా హెగ్డేని మరోసారి కథానాయికగా రిపీట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమాకి పూజా గ్లామర్ అపీరెన్స్ ఏ మేరకు హైలైట్ అవుతుందో చూడాలి.