రాజకీయాల కారణంగా సినిమాలకు మూడేళ్ళు గ్యాపిచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇన్నాళ్ళూ ఆయన ట్రేడ్ మార్క్ స్టైల్ ను, మేనరిజమ్స్ ను అభిమానులు బాగా మిస్సయ్యారు. ఆ లోటును భర్తీచేస్తూ.. పవన్ మళ్ళీ ‘వకీల్ సాబ్’ తో కమ్ బ్యాక్ అవుతున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆ సినిమా బాలీవుడ్ మూవీ పింక్ రీమేక్ వెర్షన్ అన్న సంగతి తెలిసిందే. ఒక పక్క రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తునే .. మరో పక్క సినిమాల కోసం పలు కొత్త ప్రాజెక్ట్స్ ను టేకప్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన సినిమాల లైనప్ చూస్తే మతిపోతుంది. అభిమానులు పండగ చేసుకొనే స్థాయిలో పవన్ కోసం కొత్త కాంబోలు పుట్టుకొస్తున్నాయి.
‘వకీల్ సాబ్’ మూవీ అనౌన్స్ మెంట్ జరిగిన రెండు రోజులకే దర్శకుడు క్రిష్ పవర్ స్టార్ తో కొత్త ప్రాజెక్ట్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా కేటగిరిలో .. చారిత్రక నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. దీనికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేసినట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. అలాగే పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ తో బిగ్గెస్ట్ హిట్టిచ్చిన హరీశ్ శంకర్ .. దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ కూడా ఇటీవల అనౌన్స్ మెంట్ జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే పవన్ – హరీష్ ప్రాజెక్ట్ పవర్ స్టార్ కెరీర్లో 28వ చిత్రమని అధికారికంగా ప్రకటించారు.
అయితే ఇప్పుడు రామ్ తాళ్లూరి నిర్మించే సినిమా ‘వకీల్ సాబ్’ పూర్తయిన వెంటనే సెట్స్ మీదకు వెళ్లనుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో క్రిష్ సినిమాని హోల్డ్ లో పెడతారా లేదా హరీష్ శంకర్ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెడతారా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా పవన్ – సురేందర్ రెడ్డి కాంబోలో సినిమా అనౌన్స్ చేశారు. పవర్ స్టార్ కి బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు.
ఈ చిత్రానికి వక్కంతం వంశీ స్టోరీ అందిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఇవే కాకుండా.. మరో రెండు కొత్త ప్రాజెక్టులు త్వరలోనే అనౌన్స్ కానున్నాయని తెలుస్తోంది. అలాగే… డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా పవర్ స్టార్ కోసం ఒక పవర్ ఫుల్ సబ్జెక్ట్ ను లాక్ చేశారని.. త్వరలోనే పవన్ కళ్యాణ్ కు కథ వినిపించబోతున్నాడనే వార్తలొస్తున్నాయి. అలాగే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పవర్ స్టార్ తో నాలుగో సినిమాకి కూడా స్ర్కిప్ట్ సమకూర్చే పనిలో ఉన్నాడట. మొత్తం మీద పవర్ స్టార్ లైనప్ చూస్తుంటే.. అభిమానుల కోసం ఆయన వరుసగా విజువల్ ఫీస్ట్ ఇచ్చే పనిలో ఉన్నారని అర్ధమవుతోంది. మరి ఈ సినిమాలన్నీ అభిమానుల్ని ఏ రేంజ్ లో అలరిస్తాయో చూడాలి.











