ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్ల బిగింపు నిర్ణయాన్ని తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకుంది. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రైతులకు శరాఘాతంలా తగిలింది. దీంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. ఉచిత విద్యుత్ కు మంగళం పాడడానికే జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అధికార ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టడం విపక్షాలు చేస్తుండటం సర్వ సాధారణమే. కానీ ప్రజల భయాందోళనలను తొలగించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎస్, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మీడియా ముందుకు వచ్చి ప్రజల భయాందోళనలను తొలగించే ప్రయత్నం చేస్తూ వివరణ ఇచ్చారు. కానీ వారి మాటలలో స్పష్టత లేకపోవడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 2004లో అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ ఫైల్ పై సంతకం పెట్టారు. ఆర్థిక పరిమితుల దృష్ట్యా ఈ పథకం అమలు కష్టమని ఆర్థిక నిపుణులు చెప్పినా వైఎస్ వెనుకకు అడుగువేయకుండా ముందుకు సాగారు. తాజాగా సబ్సిడీలను తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్రం సంస్కరణలను తీసుకువచ్చింది. కేంద్రం డీబీటీని అమలు లోకి తీసుకు వచ్చింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ ద్వారా రైతుల అకౌంట్ లో డబ్బులు వేయాలని కేంద్రం చెబుతోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించినా ఏపీ ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్దపడింది. రైతులు వాడుకున్న కరెంటుకు బిల్లులు వస్తాయి. ఆ బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం వారి అకౌంట్ లో వేసే డబ్బులు ద్వారా చెల్లించాలి. అప్పుడే ‘ఉచిత విద్యుత్’ పథకానికి ఆన్సరబిలిటీ వస్తోందని కేంద్రం ఈ ప్రతిపాదన చేసింది.
ప్రభుత్వ వివరణ
నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టి రైతుల చేత కొత్త అకౌంట్లు ఓపెన్ చేయించి అందులో అమౌంట్ వేస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. కనెక్షన్లకు బిగించిన మీటర్ల ద్వారా బిల్లులు వస్తాయని అందుకు తగ్గట్టుగానే వారి అకౌంట్ లో డబ్బులు పడతాయని వారు భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. అకౌంట్ నుంచి డిస్కం డబ్బులను కట్ చేసే విధానాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ ప్రక్రియలో రైతులకు ఇబ్బంది ఉండదని… మీటర్లు కూడా ఉచితం గానే తాము బిగిస్తామని ప్రభుత్వం తెలిపింది. మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా రైతులపై రూపాయి కూడా భారం పడకుండా చూస్తామని వివరణ ఇచ్చారు. వైఎస్ఆర్ పథకాన్ని మరో 30 ఏళ్ళ పాటు కొనసాగిస్తామని ధీమాను వ్యక్తం చేశారు. రైతులపై రూపాయి భారం పడ్డా తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన ఛాలెంజ్ చేశారు.
రైతుల అనుమానాలు
ఉచిత్ విద్యుత్ పథకాన్ని కేంద్రం సంస్కరణలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్న ఏపీ సర్కారు ఈ దిశగా రైతుల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఓ విషయంలో మాత్రం స్పష్టత కరువైంది. వైఎస్ఆర్ తీసుకువచ్చిన ఉచిత విద్యుత్ పథకం వ్యవసాయం పండగ అని నిరూపించడమే గాక వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఉపయోగపడింది. ఈ పథకం ద్వారా వ్యవసాయ భూమి ఉన్న ప్రతి ఒక్కరూ లబ్ది పొందారు. కుల, జాతీ, ఆదాయ వర్గాలతో సంబందం లేకుండా అందరూ ఉచిత విద్యుత్ పథకం ద్వారా లబ్ది చేకూరింది. కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణల ద్వారా వీరందరూ తిరిగి ఉచిత కనెక్షన్ కు అర్హులు అవుతారా? లేదా? అనే సందేహం అందరిలోనూ నెలకొంది.
కేంద్రం, తెలంగాణ విధానాలను అమలు చేస్తారా?
తెలంగాణ ప్రభుత్వం ‘రైతు బంధు’ పథకం లాగా ఈ పథకాన్ని అమలు చేయాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. రైతు బంధు పథకం ద్వారా సామాన్య రైతుల నుంచి జమీందార్ల వరకు భూములు ఉన్న ప్రతి రైతుకు వారి అకౌంట్లలో వ్యవసాయ ఖర్చులు తెలంగాణ ప్రభుత్వం జమ చేసింది. డీజీపీ, ఐఏఎస్, ఎమ్మెల్యే, ఎంపీల అకౌంట్లలో కూడా డబ్బులు పడ్డాయి. సామాన్యులకు ఇది అవసరమని తమ లాంటి వారికి ఈ డబ్బులు అవసరం లేదని వారు డబ్బులు ప్రభుత్వానికి వాపసు చేశారు. అలాగే గ్యాస్ సబ్సిడీ విషయాన్నే తీసుకుంటే సబ్సిడీని కొనసాగించిన వారు ఉన్నారు. సబ్సిడీని వదులుకున్న వారు ఉన్నారు. ఈ పథకాలలాగే ఏపీ ప్రభుత్వం రైతులకు ఎటువంటి నష్టం జరగదని స్పష్టం చెయాలి.
ఇప్పటి వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని పొందుతున్న రైతులందరూ తరువాత కూడా అర్హులు అవుతారని ఒక్కరూ కూడా నష్టపోరని ప్రభుత్వం స్పష్టత ఇవ్వవలసి ఉంది. ఇదే సమయంలో అగ్రవర్గాలు, ధనికులు, ఉద్యోగస్తులకు ఉన్న భూముల విషయంలో ఉచిత విద్యుత్ ను కట్ చేయకుండా ఆప్షన్ ఇవ్వాలని డిమాండ్ వినబడుతోంది. దీని ద్వారా వైఎస్ తీసుకువచ్చిన ఉచిత విద్యుత్ స్ఫూర్తి కొనసాగుతోంది. లేదంటే ఉచిత విద్యుత్ కు జగన్ ప్రభుత్వం మంగళం పాడినట్లే అంటూ నిపుణులు చెబుతున్నారు. ఈ ఒక్క మాట చెబితే చాలు. అదే పదివేలని రైతులు జగన్ సర్కార్ ను కోరుకుంటున్నారు!











