భారతీయ జనతా పార్టీ వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈసారి 400ల ఎంపీ సీట్లు దాటాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గత ఎన్నికల్లో కాషాయదళానికి పట్టున్న రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేసినా బీజేపీ స్కోరు 303 దగ్గరే ఆగిపోయింది. పదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కూటమి ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. మరి ఇలాంటి పరిస్ధితుల్లో బీజేపీ తన రికార్డును మెరుగు పరుచుకోగలదా.. సొంతంగా మెజారిటీ రాకపోతే మిత్రపక్షాల మద్దతు తీసుకోక తప్పదు. ఎన్డీయే కూటమిలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి.. ఢిల్లీ స్టీరింగ్ ఎవరి చేతికి అందుతుందో చూద్దాం..
ప్రధాని నరేంద్ర మోదీ హ్యాట్రిక్ విజయంపై ధీమాగా ఉన్నారు. అయోధ్య రామాలయం ప్రారంభంతో ఉత్తరాదిలో బీజేపీకి తిరుగులేదని భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఢిల్లీ పెద్దలు చెబుతున్నంత సానుకూలంగా లేవని తెలుస్తోంది. దక్షిణ భారతదేశంలో బీజేపీ బలం ఏమాత్రం పెరగలేదు. గతంలో కాషాయ దళం చేతిలో ఉన్న కర్ణాటక కూడా హస్తం చేతికి చిక్కింది. ప్రస్తుతం ఆ రాష్ట్రం నుంచి 25 మంది ఎంపీలున్నా.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ బలం సగానికి సగం తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కరువు పరిస్థితులు, సాగు-తాగు నీటి కష్టాలు బీజేపీకి అనుకూలంగా పని చేయవచ్చు. ఇక తెలంగాణలోనూ 2019లో సాధించిన సీట్లు వస్తే గొప్పే అని విశ్లేషకుల అభిప్రాయం. ఏపీలో టీడీపీ, జనసేన కూటమిలో చేరడంతో అక్కడ రెండు, మూడు స్థానాలు దక్కొచ్చు. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈసారి కూడా బోణి కొట్టడం కష్టమే.
బీజేపీ బాగా పట్టున్న గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ప్రాంతాల్లో కమలనాథులు కనీసం 20 నుంచి 30 సీట్లు కోల్పోతారనే అంచనాలున్నాయి. దేశంలోని మొత్తం ఎంపీ స్థానాల్లో సగం సీట్లు ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రతో పాటు ఒడిశా, పంజాబ్, ఝార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లోనే ఉన్నాయి. గత ఎన్నికల్లో సొంతగా, ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాలతో కలిసి ఈ రాష్ట్రాల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకొంది. యూపీలో అఖిలేష్‌యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాద్ పార్టీ కాంగ్రెస్ కూటమిగా ఏర్పటడం బీజేపీ మైనస్‌గా భావిస్తున్నారు. మాయావతి పార్టీ బహుజన్ సమాజ్‌వాది పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుండటంతో ముక్కోణపు పోటీ మరోసారి లాభపడవచ్చని బీజేపీ నాయకులు ఆశిస్తున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ ఓట్లు చీల్చి బీజేపీకి మేలు చేస్తున్నారనే కారణంగో కుమారస్వామి జేడీఎస్‌ను, అసదుద్దీన్ ఒవైసీ ఎంఐఎంను చిత్తుగా ఓడించారు. వచ్చే ఎన్నికల్లో మాయావతి పార్టీకి జేడీఎస్, ఎంఐఎం పరిస్థితి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ వ్యతిరేక వర్గాలన్నీ ఎస్పీ, కాంగ్రెస్ కూటమి కింద ఏకమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఒక్క యూపీలోనే బీజేపీ ఖాతాలో 30 సీట్లు కోత పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకు అభిప్రాయం.
బీహార్‌లో బీజేపీ పాత మిత్రుడు జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ మారోసారి ఎన్డీయేలో చేరారు. అవకాశాన్ని బట్టి అటు ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలపడం, గాలి మళ్లగానే ఎన్డీయే గూటికి చేరడం నీతీశ్‌కుమార్‌కు అలవాటైపోయింది. కానీ ఆయన జంపింగ్ జపాంగ్‌లు బీహార్ ప్రజలకు ఏమాత్రం నచ్చలేదని ఆదే రాష్ట్రానికి చెందిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేస్తున్నారు. ప్రధాని మోదీ ప్రచారం చేస్తున్నట్లు ఆ పార్టీ భారీ మెజారిటీ సాధించలేదని కూడా అంటున్నారు పీకే. ఈసారి బీహార్ బీజేపీ కనీసం పది స్థానాలు, ఎన్డీయే కూటమి 20కి పైగా సీట్లు కోల్పోతుందట. బెంగాల్‌లో మమతా బెనర్జీని ఢీకొట్టి నిలబడే సత్తా కమలనాథులకు లేదని అక్కడ పరిస్థితిలు సూచిస్తున్నాయి. దీదీ పార్టీ టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుండగా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కోసం బీజేపీ నాయకులు కాంగ్రెస్, కమ్యూనిస్టులతో పోటీ పడాల్సి ఉంటుంది. గతం కంటే ఎక్కువ సీట్లు వస్తాయని కమలనాథులు ఆశలు పెట్టుకున్నా.. వాస్తవంలో ఆ లెక్కలు రివర్స్ అవుతాయని టీఎంసీ నాయకులు అంటున్నారు.
ఒడిశాలో బీజేడీతో పొత్తు బీజేపీకి ఎంత వరకూ కలిసి వస్తుందనే చెప్పలేని పరిస్థితి. ఆ రాష్ట్రంలో ఎంత మంచి ఫలితాలు వచ్చినా బీజేపీ స్కోరు ఒకటి రెండు సీట్ల కంటే ఎక్కువ పెరిగే ఛాన్స్ లేదు. ఇక రైతు ఉద్యమాలు, మహిళా రెజర్ల పోరాటాలో పంజాబ్, హర్యానా, ఢిల్లీలో కమలనాథులకు భారీ ఎదురుదెబ్బ ఖాయని విశ్లేషకుల అభిప్రాయం. మహారాష్ట్రలో బీజేపీపై మరాఠాలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మరాఠా రిజర్వేషన్ అంశంతో పాటు శివసేన, ఎన్సీపీ పార్టీలను నిలువునా చీల్చి మరాఠా అస్థిత్వాన్ని దెబ్బతీశారని ఆ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. రెబెల్ వర్గాల మధ్య విభేదాలు ఎన్డీయే కష్టాలను పెంచుతున్నాయి. ఈ సమీకరణాల ప్రకారం ఈసారి బీజేపీకి గతం కంటే 70 నుంచి 80 సీట్లు తగ్గుతాయి. కానీ ప్రధాని మోదీ రివర్స్‌లో 70 సీట్లు పెరుగుతాయని చెబుతూ.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు.
సొంతగా పూర్తి మెజారిటీ రాని పక్షంలో బీజేపీ మిత్రపక్షాలపై ఆధారపడక తప్పదు. ఎన్నికల తర్వాత పొత్తుల కోసం ప్రయత్నిస్తే.. ఎవరు కలుస్తారో, ఎవరు హ్యాండిస్తారో ఎవరికీ తెలియదు. అందుకే ఎలక్షన్స్‌కి ముందే జేడీయూ, బీజేడీ, తెలుగుదేశం పార్టీలతో పొత్తులు ఖరారు చేసుకున్నారు బీజేపీ పెద్దలు. ముఖ్యమైన పార్టీలను ముందే లాక్ చేయడం ద్వారా.. బీజేపీ ఫుల్ మెజారిటీ రాకపోయినా కూటమిలోని పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. అదే జరిగితే ఏపీలో పదిహేను ఎంపీ సీట్లు సాధించే అవకాశం ఉన్న తెలుగుదేశం పార్టీ ఢిల్లీ పోలిటిక్స్‌లో కీలకంగా మారుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి జాతీయ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేస్తారని పొలిటికల్ ఎనలిస్టుల అభిప్రాయం