ఏపీలో మూడు పండుగలు ఒకేరోజు వచ్చాయి. క్రిస్మస్, ముక్కోటి ఏకాదశితోపాటు జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ ఏపీ ప్రజలు ఈ మూడు పండుగలను ఒకే రోజు జరుపుకుంటున్నారు. ఆరుసార్లు వాయిదా పడినా, ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పేదలకు సెంటు భూమి పథకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా కొమరిగిరి నుంచి ప్రారంభించారు. ఈ పండగ పది రోజుల పాటు జరగనుందని సీఎం స్పష్టం చేశారు. 175 నియోజకవర్గాల్లో 30 లక్షలకుపైగా ఇళ్ల పట్టాలతోపాటు మొదటి దశలో 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి కూడా సీఎం శ్రీకారం చుట్టారు. కొమరిగిరిలో లే అవుట్ చూస్తుంటే మేము నిర్మించేది కాలనీలు కాదు ఊర్లేనని సీఎం ఆనందం వ్యక్తం చేశారు.
గృహమే కదా స్వర్గసీమ
పాదయాత్రలో ఎంతోమంది పేదలు సొంత ఇళ్లు లేకపోవడం చూశానని అందుకే ఎంత ఖర్చయినా లెక్కచేయకుండా ఇవాళ 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించినట్టు సీఎం స్పష్టం చేశారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వారు దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో ఇంటి స్థలం ఇస్తామని సీఎం చెప్పారు. పేదలకు ఇచ్చిన సెంటు భూమి విలువ ప్రస్తుతం రూ.4 లక్షలు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రకారం పేదలందరికీ ఇళ్లు ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం మొక్కుబడిగా ఇళ్లు నిర్మించి, వాటిని కూడా సరిగా పూర్తి చేయలేదని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
నవ సమాజం కోసం…
కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాలు చూడకుండా పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించే కార్యక్రమం చేస్తున్నట్టు సీఎం కొమరగిరి సభలో ప్రకటించారు. అన్ని కులాలు, మతాలు కలసిమెలసి ఉండటం వల్ల నవ సమాజానికి బాటలు పడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. 175 నియోజకవర్గాల్లో 17500 కాలనీలు వస్తున్నాయని, ఏపీ జనాభాలో నాలుగోవంతు మంది రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ కాలనీల్లో నివసిస్తారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఒక్కరూపాయి ఖర్చు లేకుండా ఇళ్లు నిర్మించి ఇస్తాం…
పేదలకు ఇళ్ల స్థలంతోపాటు, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంటిని నిర్మించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటోందని సీఎం జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. పేదల ఇళ్ల నిర్మాణానికి ముడి సరకు, కూలీ ఖర్చులు ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం ప్రకటించారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన డబ్బును దశలవారీగా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం పది రోజులతో అయిపోదని, ఇది సుదీర్ఘ కాలం కొనసాగుతుందన్నారు.
స్వార్థపరుల వల్లే డి పట్టా
కొందరు స్వార్థపరుల వల్లే పేదలకు డి పట్టా ఇవ్వాల్సి వస్తోందని సీఎం ప్రతిపక్షాలను తప్పుపట్టారు. ఇళ్ల స్థలాలపై పేదలకు పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాడుతోందని సీఎం కొమరగిరి సభలో వెల్లడించారు. ప్రభుత్వం చేస్తున్న ఈ మహత్తర కార్యక్రమం చూసి పసుపురంగు నేతల కళ్లు ఎరుపెక్కుతున్నాయని టీడీపీ నేతలపై సెటైర్లు వేశారు. అమరావతిలో పేదలకు 54 వేల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నించిందని, ప్రతిపక్షాలు కోర్టులో స్టేలు తెచ్చారని విమర్శించారు.
కోర్టు స్టేల వల్ల పది శాతం ఇళ్ల స్థలాల పంపిణీ ఆగిపోయిందని సీఎం గుర్తుచేశారు. ఇవాళ పంపిణీ చేస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీ ఆపాలని కొందరు స్వార్ధపరులు కోర్టులో పిల్ వేశారని సీఎం చెప్పారు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లకు రూ.3 వేల కోట్లు చెల్లించకుండా వెళ్లిపోయిందని, అయినా ఈ ప్రభుత్వం ఒక్క రూపాయికే పేదలకు ఉచితంగా ఇళ్లు ఇస్తున్నామని సీఎం ప్రకటించారు.
ఇచ్చింది పట్టాలు కాదు పొజిషన్ సర్టిఫికెట్లు మాత్రమే
ఏపీలో 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని ఊదరగొడుతున్న సీఎం, పేదలను మోసం చేసి వారికి పట్టాలు ఇవ్వకుండా పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. పేదలకు సెంటు భూమి పేరుతో భూముల కొనుగోళ్లలో రూ.4 వేల కోట్లు, మెరకవేసే పనుల్లో రూ.2 వేల కోట్లు, ఇక పేదల నుంచి రూ.500 కోట్లు వైసీపీ నేతలు దండుకున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీలో 45 మంది ఎమ్మెల్యేలు భూముల కొనుగోళ్లలో తీవ్ర అవినీతికి పాల్పడ్డారని టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ విమర్శించారు.
Also Read: విజయనగరం మసాలా : బాబు డైరెక్షన్, అచ్చెన్న యాక్షన్!