హెలికాప్టర్ కొనేందుకు లోన్ కావాలని అంబానీ, అదానీలు అడిగితే పర్లేదు గానీ.. ఏ సామాన్యుడో అడిగితే..! ‘ఏం వెటకారంగా ఉందా’ అంటారు. కానీ, ఓ సామాన్య మహిళా రైతు.. హెలికాప్టర్ కొనేందుకు తనకు లోన్ కావాలని, అందుకు సాయం చేయాలని కోరుతూ.. ఏకంగా రాష్ట్రపతికే లేఖ రాసింది. అది ఎక్కి తిరిగేందుకు లైసెన్సు ఇప్పించాల్సిందిగా కూడా విన్నవించుకుంది.
ఇలా చేసిందని ఆవిడ పిచ్చిదనుకుంటే.. తప్పులో కాలేసినట్టే. ఇంతకీ విషయమేమిటంటే.. ఆమె తనకొచ్చిన కష్టాన్ని, అధికారుల తీరుపై తన నిరసనను ఇలా వినూత్నంగా వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్‌లోని మాండ్‌సౌర్ జిల్లాకు చెందిన బసంతి బాయ్ లోహర్‌కు ఊళ్లో రెండెకరాల పొలం ఉంది. అదే ఆమె జీవనాధారం. ఆ ఊరి మోతుబరి.. ఆ పొలంపై కన్నేశాడు. కక్షగట్టి ఆమె పొలానికి వెళ్లే దారిని మూసివేశాడు. దీంతో.. ఆమె తన పొలంలోకి వెళ్లలేక, సాగు చేసుకోలేక, జీవనాధారాన్ని కోల్పోయింది.
న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం కనిపించలేదు. దీంతో.. ఏం చేయాలో అర్థం కాక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. ఇలా వినూత్నంగా తన బాధను రాష్ట్రపతికే చెప్పుకుంది. తన పొలానికి వెళ్లేందుకు ఓ హెలికాప్టర్ కావాలని, అది కొనేందుకు లోన్ ఇప్పించాలంటూ లేఖ రాసింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే.. ఆమెకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. హెలికాప్టర్ కొనేందుకు సాయం అనుకోకండి.. ఇలా జనాలు పొరబడకూడదనే.. ముందుగానే ఎమ్మెల్యే గారు.. తన సాయం హెలికాప్టర్ కొనేందుకు కాదని, ఆమె పొలానికి దారిన మాత్రమే ఏర్పాటు చేస్తానని చెప్పారు.











