వైసీపీ అధికారంలో ఉండగా విర్రవీగిన పార్టీ నేతల పాపం ఇప్పుడు పండుతోంది. అప్పట్లో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో తాజాగా ఓ వైసీపీ మాజీ ఎంపీ అరెస్టు అయ్యారు. ఈ కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్‌తో పాటు మరికొందరు కీలక వైసీపీ నేతలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టు చేసేందుకు కొన్ని రోజులుగా ఆయన్ను పోలీసులు వేటాడుతున్నారు. మంగళగిరి రూరల్ పోలీసులు గురువారం రోజు ఎట్టకేలకు నందిగాం సురేష్ ను హైదరాబాద్ వెళ్లి అరెస్ట్ చేశారు.
తొలుత అరెస్టు నుంచి తప్పించుకునేందుకు నందిగాం సురేష్ అనేక నాటకాలు ఆడారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌తో హైకోర్టుకు వెళ్లగా.. దాన్ని హైకోర్టు కొట్టివేసింది. దీంతో నందిగాం సురేష్ అజ్ఞాతంలోకి పారిపోయారు. ముందు హైదరాబాద్ కు పారిపోయి అక్కడి నుంచి వేరో చోటికి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నం చేస్తున్నారని సమాచారం పోలీసులకు అందడంతో వెంటనే అలర్ట్ అయ్యి.. ప్రత్యేక బృందాలు అరెస్ట్ చేశాయి. అక్కడి నుంచి నందిగం సురేష్‌ను గుంటూరు జిల్లాకు పోలీసులు తరలిస్తున్నారు. ముందుగా ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టనున్నారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఒక్క నందిగం సురేష్ మాత్రమే కాకుండా.. దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, నందిగాం సురేష్, తలశీల రఘురామ్ సహా మరో 14 మంది నిందితులుగా ఉన్నారు. అప్పట్లో అధికారం చేతిలో ఉంది కదా అని వీరంతా తమదే రాజ్యం అన్నట్లుగా రెచ్చిపోయారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలోకి చొరబడి గేట్లు, అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. గూండాల మాదిరిగా ప్రవర్తించారు. అప్పట్లో వారి ప్రభుత్వమే కాబట్టి, వారి కేసును వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసును తిరగతోడింది. ఈ నిందితులు అంతా తమను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోరగా.. హైకోర్టు తిరస్కరించడంతో.. సుప్రీంకోర్టు వెళ్తామన్నారు. కనీసం అప్పటివరకైనా తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేలా హైకోర్టును కోరినా ఊరట దక్కలేదు.
దీంతో అంతా కలిసి పరారయ్యారు. వారిలో ఒక్క నందిగాం సురేశ్ మాత్రమే దొరికిపోయారు. అయితే, ఇందులో మరో వాదన కూడా వినిపిస్తోంది. నిందితులైన దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు తమ ఆచూకీ దొరక్కుండా పరారైనట్లు చెబుతున్నారు. అంతా కూడబలుక్కొని ఒక పథకం ప్రకారం పరారైనట్లుగా భావిస్తున్నారు. కానీ, నందిగం సురేశ్ ను మాత్రం వదిలేసినట్లు సమాచారం. ఈయన హైదరాబాద్ మీదుగా పరారీ అవుతుండగానే దొరికిపోయారు.











