ఏపీలోని సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సహకాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు జగన్ సర్కారుకు లేఖ రాశారు. అయితే సురేష్ ప్రభు రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావిస్తూనే సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ప్రాధాన్యాన్నికూడా పేర్కొన్నారు.ఈ మేరకు సీఎం జగన్‌కు లేఖ రాశారు.
ఏపీకి జిల్లాకు ఒకటి చొప్పున 13 అంబులెన్స్‌లు
రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రం నుంచి ఎంపికైనందున ఎంపీ ల్యాడ్స్ ద్వారా ఏపీకి జిల్లాకు ఒకటి చొప్పున 13 అంబులెన్స్ ల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తున్నట్టు రాజ్యసభ సభ్యుడు సురేష్ ప్రభు వెల్లడించారు. రాష్ట్రం నుంచి ఎంపికైనందున తాను ఏపీ ప్రజల అవసరాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. ఏపీ ప్రజల సంక్షేమానికి పాటుపడతానని పేర్కొన్నారు. ప్రస్తుతం కొవిడ్ కారణంగా దేశ వ్యాప్తంగా దయనీయ పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేశారు. ఏపీలోనూ కొవిడ్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని, అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కొవిడ్ నియంత్రణ చర్యలు చేపడుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సమన్వయం కారణంగా ఏపీలో కొవిడ్ చికిత్స, కొవిడ్ నియంత్రణలు సాధ్యమని, సంతృప్తికర స్థాయిలో అది జరుగుతోందని వ్యాఖ్యానించారు.
కొవిడ్ నియంత్రణకు గాను ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడ్పాటుగా ఏపీలో ప్రతి జిల్లాకు ఒక అంబులెన్స్ చొప్పున 13 అంబులెన్స్ లు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. అధునాత సదుపాయాలతో ఈ అంబులెన్స్‌లు ఉంటాయని వ్యాఖ్యానించారు. దీంతో పాటుగా విశాఖపట్నంలో జిల్లాలో ఆధునిక చికిత్స, వ్యాధి పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఎంపీ ల్యాడ్స్ ద్వారా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
ఆర్థిక అంశాల్లోనూ జాగ్రత్తలు తీసుకోండి
కొవిడ్‌పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పోరాటం కొనసాగుతుందని చెప్పిన ఎంపీ సురేష్ ప్రభు అదే సమయంలో ఆర్థిక అంశాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రగతిపై కొవిడ్ నియంత్రణ చర్యలు ప్రతికూల ఫ్రభావాన్ని చూప కూడదని వ్యాఖ్యానించారు. దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(MSME)ల ఉత్పాదకత దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉందని, ఉపాది అవకాశాల్లోనూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలకంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కొవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా అమల్లోకి తెచ్చిన ఆంక్షలు MSMEలపై మరింత ఆర్థిక భారాన్ని మోపాయన్నారు. దేశ వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో MSMEలు ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయని వ్యాఖ్యానిస్తూనే ఓ అంశాన్ని ప్రతిపాదించారు. రాష్ట్రంలోని MSMEలకు విడుదల కావాల్సిన ప్రోత్సహకాలను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సురేష్ ప్రభు కోరారు.
కాగా ఏపీలో కొవిడ్ నియంత్రణకు గాను గత నెలలో మరో లేఖ రాశారు రాజ్యసభ సభ్యుడు సురేష్ ప్రభు.ఏపీలో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని చెబుతూ కేంద్ర వైద్య మంత్రికి మే 27న లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరుతూ ఈ లేఖ రాయగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్షవర్దన్ సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే.
Must Read ;- కుప్పం ఆస్పత్రిలో ఆక్సిజన్ ఫ్లాంటు.. రూ.35 లక్షలు ఇస్తున్న చంద్రబాబు












