గన్నవరం వైసీపీ నేతల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న చిన్నఅవుటపల్లిలో ఎమ్మెల్యే వంశీ, దుట్టా వర్గాలు తలపడ్డాయి. ఈ ఘటన మరవక ముందే ఇవాళ గన్నవరం వైసీపీ దళిత నేత మొగిలిచర్ల జోజిబాబు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనంగా మారింది. వైసీపీ దళిత నేత జోజిబాబు వంటిపై పెట్రోల్ పోసుకున్న వెంటనే వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన అనుచరుడు కోట్లు దళితులకు కాంట్రాక్టులు రాకుండా అడ్డుకుంటున్నారని జోజిబాబు ఆరోపిస్తున్నారు. దళితులకు కాంట్రాక్టులు ఎందుకంటూ హేళనగా మాట్లాడుతున్నారని జోజిబాబు మీడియా ముందు వాపోయారు. వైసీపీ అధిష్ఠానం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కోట్లుపై చర్యలు తీసుకోవాలని జోజిబాబు డిమాండ్ చేశారు.
పార్టీని నాశనం చేస్తున్నారు..
కాంట్రాక్టు పనుల కోసం గన్నవరంలో వైసీపీని నాశనం చేస్తున్నారని వైసీపీ దళిత నేత జోజిబాబు విమర్శలు గుప్పించారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే వంశీ, టీడీపీ నుంచి ఆయనతో వచ్చిన నేతలకే కాంట్రాక్టు పనులు అప్పగిస్తున్నారని జోజిబాబు ఆరోపిస్తున్నారు. అయితే, గన్నవరం నియోజకవర్గంలో మూడు గ్రూపులు ఎవరికివారే అన్న చందంగా తయారయ్యాయి. టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీతోపాటు, 2019 ఎన్నికల్లో ఓటమిపాలైన యార్లగడ్డ వర్గం, 2014 వైసీపీ నుంచి ఓటమి పాలైన దుట్టా రామచంద్రరావు వర్గాలు నియోజకవర్గంలో గ్రూపులుగా తయారయ్యాయి. వైసీపీ పెద్దలు ఎన్నిసార్లు వారి మధ్య సయోధ్య కుదిర్చినా మూడు గ్రూపులు మాత్రం ఒక్కతాటి పైకి రావడం లేదు. గన్నవరం వైసీపీ మూడు గ్రూపుల కార్యకర్తలు తలపడటం నిత్యకృత్యంగా మారింది. వైసీపీ పెద్దలు కూడా గన్నవరం పంచాయితీ తేల్చలేక చేతులెత్తేసినట్టు తెలుస్తోంది.