ఐఫోన్ తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో ఎన్ని రకాల ఫోన్లు ఉన్నా ఐఫోనే నెంబర్ వన్. అలాంటి ఫోన్లు తయారు చేసే కంపెనీలో ఉద్యోగం అంటే లక్షల్లో జీతాలు ఉంటాయి. కానీ ఐఫోన్ కంపెనీకి అనుబంధంగా నడుస్తున్న తైవాన్‌కు చెందిన విస్ట్రాన్ కార్పొరేషన్‌పై ఉద్యోగులు తిరగబడ్డారు. కార్పొరేట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 2 వేల మంది ఉద్యోగులు బెంగళూరు సమీపంలోని కోలార్ జిల్లా నరసాపురలోని విస్ట్రాన్ కంపెనీపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అద్దాలు పగులగొట్టారు. ఐఫోన్ల తయారీ యూనిట్లను ధ్వంసం చేశారు. వేలాది ఐఫోన్లను ఎవరికి చిక్కినవి వారు కాజేశారని తెలుస్తోంది. చివరకు అక్కడి వాహనాలకు కూడా నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. శనివారం ఉదయాన్నే జరిగిన ఈ ఘటన అటు కార్పొరేట్ వర్గాలనే కాదు, సామాన్యులను సైతం విస్మయానికి గురిచేసింది.
అసలేం జరిగిందంటే..?
బెంగళూరుకు 60 కిలోమీటర్ల దూరంలోని కోలార్ జిల్లా నరసాపురలో 43 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఐఫోన్లు తయారు చేసే విస్ట్రాన్ కంపెనీని నాలుగేళ్ల కిందట స్థాపించారు. రూ.2,900 కోట్ల పెట్టుబడితో 10 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని కర్ణాటక ప్రభుత్వంతో విస్ట్రాన్ కంపెనీ ఎంవోయూ చేసుకుంది. ఇప్పటికే రూ.2,300 కోట్ల పెట్టుబడులు పెట్టారు. దాదాపు 8 వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. సజావుగా సాగుతున్న కంపెనీపై లాక్ డౌన్ ఎఫెక్ట్ పడింది. నెలకు రూ.21 వేల జీతం చెల్లిస్తామని వేలాది మంది బీటెక్ ఇంజనీర్లను తీసుకున్నారు. లాక్ డౌన్ కారణంగా కంపెనీ ఉత్పత్తిపై ప్రభావం పడింది. దీంతో ఉద్యోగుల జీతాలను రూ.16వేలకు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఆ తరవాత అకస్మాత్తుగా వారి జీతాన్ని రూ.12వేలకు తగ్గించి ఉద్యోగుల అకౌంట్లలో ఒక నెల జీతం జమ చేశారు. రాత్రి డ్యూటీ ముగించుకుని 2వేల మంది ఉద్యోగులు ఉదయం 6.30 గంటలకు ఇంటికి వెళుతుండగా వారి ఫోన్లకు బ్యాంకు నుంచి మెసేజ్‌లు వచ్చాయి. జీతంలో రెండోసారి కోత వేయడంతో ఉద్యోగులంతా ఒక్కసారిగా రెచ్చిపోయారు. చేతికి చిక్కిన వస్తువులతో కంపెనీ ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. ఐఫోన్ తయారీ యూనిట్లను కూడా నాశనం చేశారు. అక్కడే పార్కింగ్ చేసిన వాహనాలకు కూడా నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. ఉద్యోగుల దాడితో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. పోలీసులు వచ్చే సరిగే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది.జీతాలు ఒక్కసారిగా తగ్గించడంతో కోలార్ జిల్లా నరసాపురలోని ఐఫోన్లు తయారు చేసే విస్ట్రాన్ కంపెనీపై ఉద్యోగులు దాడి చేశారు. దీంతో రూ.437 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు. దాడిలో ఉగ్రకోణం ఏమైనా ఉందా అనే విషయంలోనూ కేంద్ర నిఘా సంస్థలు ఆరా తీస్తున్నాయి.
Must Read ;- ఆపిల్ ఇండియా స్టోర్ లో ఫోన్లు కొనొద్దు: నాగార్జున సలహా
భారీ నష్టం
ఉద్యోగుల దాడితో ఐఫోన్ అనుబంధ సంస్థ విస్ట్రాన్ కార్పొరేషన్‌కు రూ.437 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. లాక్ డౌన్ కారణంగా ఉద్యోగుల జీతాలు రెండు సార్లు తగ్గించడంతో పాటు, నాలుగు నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయని తెలుస్తోంది. ఒకనెల జీతం, అది కూడా తగ్గించిన మొత్తాన్ని ఉద్యోగుల బ్యాంకు ఖాతాలో వేయడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుందని తెలుస్తోంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల జీతాలను భారీగా తగ్గించడంతో పాటు, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల జీతాలను ఒకేసారి రూ.8వేలకు తగ్గించారు. దీంతో ఉద్యోగులు రెచ్చిపోయారని కోలార్ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది.
ఉగ్రకోణం కాదు కదా?
విస్ట్రాన్ కార్పొరేషన్‌పై ఉద్యోగుల దాడి ఘటనలో ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందేమోనని కేంద్ర నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించాయి. కొన్ని ఉగ్రవాద ముఠాల సభ్యులు ఉద్యోగులుగా చేరారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సహజంగా ఉద్యోగులు ఇంత తీవ్ర స్థాయిలో తిరగబడే సంఘటనలు చాలా అరుదు. మరోవైపు లాక్ డౌన్ కారణంగా అనేక కంపెనీల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పుడిప్పుడే అనేక కంపెనీలు తమ ఉత్పత్తులను పెంచుకుంటున్నాయి. ఈ సమస్య ఉద్యోగులకు తెలియనిది కాదు. అయినా ఒక్కసారిగా ఉద్యోగులు అంతలా ఎందుకు రెచ్చిపోయారు అనే అంశంపై కేంద్ర నిఘా సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఉగ్రకోణంపై కూడా దర్యాప్తు సాగుతోంది. రెండు మూడు రోజుల్లో విస్ట్రాన్ కార్పొరేషన్‌పై దాడి ఘటనపై కొంత క్లారిటీ రానుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.
Must Read ;- వాక్సిన్ శుభవార్తలతో స్టాక్ మార్కెట్ పరుగులు!