పల్నాడు పురుడుపోసుకుంటున్న ఫ్యాక్షన్..!
పౌరుషాల పురిటిగడ్డ పలనాడులో ఫ్యాక్షన్.. వైసీపీ ప్రభుత్వం, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పుణ్యామాని తిరిగి పురుడుపోసుకున్నాయి. నిత్యం మాచర్ల నియోజకవర్గంలో రౌడీ రాజకీయం రాజ్యమేలుతూ.. ప్రజలను, వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేయటం పరిపాటిగా మారింది ! తాజాగా ఆదివారం సాయంత్రం నియోజకవర్గ పరిధిలోని దుర్గి మండల కేంద్రంలో అధికార పార్టీకి చెందిన నాయకుడు ఒకరు.. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని సుత్తితో పగలకొట్టారు. అందరూ చూస్తుండగానే పట్టపగలు సుత్తితో ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని నెలకూల్చేందుకు ప్రయత్నిస్తున్న వీడియోలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. వైసీపీ జడ్పీటీసీ శెట్టిపల్లి యలమంద తనయుడు శెట్టిపల్లి కోటేశ్వరరావు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు నిర్థారణకు వచ్చారు. దీంతో పల్నాడు మొత్తం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అసలే సెన్సిటీవ్ ప్రాంతమైన దుర్గి మండలంలో ఈ ఘనటతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. పెద్దఎత్తున టీడీపీ నేతలు దుర్గి మండల కేంద్రానికి చెరుకుని ఆందోళన దిగారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
శాంతియుత నిరసనలకు పిలుపు..!
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేతపై మాచర్ల నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జీ జూలకంటి బ్రహ్మనందరెడ్డి స్పందించారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సోమవారం టిడీపీ నేత బ్రహ్మారెడ్డితోపాటు, రాష్ట్ర పార్టీ నాయకులు చిరుమావిళ్ల మధు, కుర్రి పున్నారెడ్డి తదితరులు దుర్గి మండల కేంద్రానికి రానున్నారు. ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేసిన ప్రాంతంలో శాంతి నిరసన వ్యక్తం చేసి.. ఇటువంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే గత నెల 23న జూలకంటి బ్రహ్మారెడ్డిని మాచర్ల టీడీపీ ఇంఛార్జీగా అధినేత చంద్రబాబు నియమించారు. ఈక్రమంలో 30 న కారంపూడి నుంచి టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి.. బ్రహ్మారెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ నేపధ్యంలో మాచర్లలో రూ.50 వేలు ఖర్చు చేసి, ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలను స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి ఆదేశాల మేరకు వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ తురక కిషోర్ చింపివేశారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి రెచ్చగొట్టే ధోరణులు పక్కనపెడితే.. నిన్న ఆదివారం సాయంత్రం దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చేందుకు చేసిన కుట్రలు టీడీపీ శ్రేణుల్లో అగ్గిమీద గుగ్గిలాన్ని రాజేసింది. ఇలా పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.











