తెలుగు చలన చిత్ర రంగంలో మరో దర్శక దిగ్గజం కన్నుమూశారు. ఆయనే పి. చంద్రశేఖర్ రెడ్డి. ఆయన వయసు 86 సంవత్సరాలు. అందరూ ఆయనను పి.సి. రెడ్డిగా సంబోధంచేవారు. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజులతో నిర్మించిన అనేక చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువగా సూపర్ స్టార్ కృష్ణ హీరోగా సినిమాలు చేశారు. ఎన్టీఆర్ తో చేసిన బడి పంతులు చిత్రం ఘనవిజయం సాధించింది. అలాగే కృష్ణ హీరోగా చేసిన అనేక చిత్రాలు ఘనవిజయం సాధించాయి.
శోభన్ బాబుతో చేసిన మానవుడు-దానవుడు బ్లాక్ బస్టార్ హిట్ అయ్యింది. అలా దాదాపు 80 చిత్రల వరకూ చేశారు. చెన్నైలో ఈరోజు ఉదయం కన్నుమూసినట్టు సమాచారం. ఆయన సొంతూరు నెల్లూరు జిల్లాలోని అనుమ సముద్రం గ్రామం. ఎన్.జగన్నాథ్, విక్టరీ మధుసూదనరావు, ఆదుర్తి సుబ్బారావు తదితరుల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి అనూరాధ చిత్రంతో దర్శకుడిగా మారారు. వరుసగా అనేక విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. 2005 తర్వాత సినిమాలకు దూరమైనా అనేక టీవీ సీరియల్స్ కు కూడా దర్శకత్వం వహించారు.
విచిత్ర దాంపత్యం, రగిలే గుండెలు, నవోదయం, పాడిపంటలు, బంగారు కాపురం, రాజకీయ చదరంగం, అన్నా వదిన, పెద్దలు మారాలి, పట్నవాసం, అన్నా చెల్లెలు తదితర చిత్రాలన్నీ ఆయన దర్శకత్వంలో రూపొందినవే. బి.గోపాల్, ముత్యాల సుబ్బయ్య, పి.ఎన్.రామచంద్రరావు, శరత్, వై.కె.నాగేశ్వరరావు లాంటి వారంతా ఆయన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసి ఆ తర్వాత దర్శకులుగా ఎదిగిన వారే. పి. సి. రెడ్డి మరణ వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు.











