ఏపీ డీజీపి గౌతం సవాంగ్ పెద్దగా పబ్లిసిటీని కోరుకోరు. ఐపీఎఎస్‌గా ఎన్నికైన నాటి నుంచి పలు ప్రాంతాల్లో పలు కీలక పోస్టింగ్ లలో పనిచేసిన సవాంగ్‌కు నిజంగానే పబ్లిసిటీ అంటే గిట్టదనే చెప్పాలి. సవాంగ్‌ను చాలా కాలం నుంచి చూస్తూ వస్తున్న వారెవరైనా ఇదే మాట చెబుతారు. అయితే ఏపీ డీజీపీగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత… అది కూడా పదవీ విరమణకు దగ్గరవుతున్న సమయంలో మాత్రం ఆయన వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇందుకు నిదర్శనంగా.. ప్రస్తుతం తిరుపతి వేదికగా జరుగుతున్న ఏపీ పోలీస్ డ్యూటీ మీట్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
తనను తాను చూసుకుని మురిశారు..
పోలీస్ డ్యూటీ మీట్ పూర్తిగా పోలీస్ విభాగానికి సంబంధించినదే కావడంతో ఏపీ పోలీస్ బాస్‌గా ఉన్న సవాంగ్‌కు చెందిన నిలువెత్తు కటౌట్‌ను అక్కడ ఏర్పాటు చేశారు. సాధారణంగా ఇదివరకటి సవాంగ్ అయితే పెద్దగా పట్టించుకునే వారు కాదేమో. ఇంకెవరైనా పోలీస్ బాస్ అయి ఉన్నా కూడా ఈ కటౌట్‌ను ఎందుకు పెట్టారంటూ సిబ్బందికి సుతిమెత్తని మందలింపులు ఉండేవి. అయితే సవాంగ్ అందుకు భిన్నంగా వ్యవహరించారనే చెప్పాలి. డ్యూటీ మీట్‌లో భాగంగా తన కటౌట్‌ను తేరిపార చూసిన సవాంగ్… అందులో తనను తాను చూసుకుని మహా మురిసిపోయారనే చెప్పాలి. అంతేకాదండోయ్… అందరి ముందే… ఆ కటౌట్ పక్కనే నిల్చుని ఫొటోలకు ఫోజులిచ్చారు.
పూర్తిగా మారిన వైఖరి
ఇదివరటి సవాంగ్ అయితే నిజంగానే ఈ కటౌట్‌ను పెద్దగా పట్టించుకునే వారు కాదేమో. వైసీపీ ఏలుబడిలో ప్రత్యేకించి జగన్ సీఎంగా ఉండగా.. పోలీసు బాస్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన సవాంగ్ అంతకు ముందటి వైఖరిని పూర్తిగా మార్చేసుకున్నారు. గతంలో ఏనాడూ మీడియా ముందుకు వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపని సవాంగ్ డీజీపి అయ్యాక మీడియా సమావేశాలంటే అమితమైన ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఈ ఫొటోను చూస్తుంటే.. త్వరలోనే పోలీస్ ఆఫీసర్‌గా రిటైర్ కానున్న సవాంగ్… ఖాకీ వదిలేసి ఖద్దరు వేసేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన సవాంగ్… తన మొత్తం సర్వీసును ఏపీలోనే పూర్తి చేసుకుంటున్నారు. మరి ఖద్దరేస్తే… అరుణాచల్‌లో పోటీకి దిగుతారో, లేదంటే తాను సేవలందించిన ఏపీలోనే బరిలోకి దిగుతారో చూడాలి.