వైఎస్ జగన్ హాయాంలో రాష్ట్రంలో సక్రమంగా పని చేసిన శాఖ ఒక్కటీ లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి విభాగంలోనూ ఏవో కుంభకోణాలు, అంతకుముంచిన లొసుగులతోనే వైఎస్ఆర్ సీపీ పాలన సాగింది. వాటిలో ఒకటైన టీచర్ల ట్రాన్స్ ఫర్ ప్రక్రియను కూడా తమ స్వార్థానికి వాడుకున్నారు. అప్పటి సీఎంవో కేంద్రంగానే టీచర్ల ట్రాన్స్‌ఫర్ అక్రమాలు జరిగాయని తెలుస్తోంది. అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దీనికి ఎంతో సహకరించినట్లుగా.. వీలైనంత దోచేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు రూ.100 కోట్ల మేర టీచర్ల బదిలీల కుంభకోణం జరిగినట్టు తెలుస్తోంది.
జగన్ ఏలుబడిలో ఏకంగా 2,400 మంది టీచర్లను అక్రమంగా ట్రాన్స్‌ఫర్ చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. మొత్తంగా ఏడాది కాలం వ్యవధిలో ఒకసారి వెయ్యి మందిని, మరోసారి మరో 1,400 మందిని వైసీపీ ప్రభుత్వం అక్రమంగా ట్రాన్స్ ఫర్ చేసింది. 2,400 మంది టీచర్లను దొడ్డిదారిలో ట్రాన్స్ ఫర్ చేసిన విషయం ప్రభుత్వం మారాక వెలుగులోకి వచ్చింది. అలా ఒక్కో ట్రాన్స్ ఫర్ కు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారని సమాచారం.
ఈ టీచర్ల ట్రాన్స్ ఫర్ల అక్రమాలకు అప్పటి స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ పూర్తి సహకారం అందించారు. మంత్రి బొత్స చెప్పారనే కారణంతో ఈ పనులు చేయించి వారి అభిమానం చూరగొన్నారు. అదే విభాగంలో కమిషనర్ గా ఉన్న సురేశ్ కుమార్ కళ్ల ముందే ట్రాన్స్ ఫర్ల అక్రమాలు జరుగుతున్నా మౌనంగా ఉండిపోయారు. మరోవైపు, ట్రాన్స్ ఫర్ ఆర్డర్ పొంది రిలీవ్ కాని టీచర్ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.
ట్రాన్స్ ఫర్ల కోసం అడిగినంత లంచాలు ఇచ్చుకున్నారు.. తీరా బదిలీ ఆదేశాలు పొందినా కొత్త స్థానానికి వెళ్లేలోగా ప్రభుత్వం మారడంతో ఆ ట్రాన్స్ ఫర్లు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో అటు డబ్బులు పోయి, ఇటు ట్రాన్స్ ఫర్ అవ్వక ఎటూ కాకుండా టీచర్లు మిగిలిపోయారు. అయితే, ఇప్పుడు బొత్స చేసిన అక్రమాల తాలుకు ఫైల్ లోకేశ్ చేతిలో ఉండడంతో దీనిపై త్వరలోనే మరింత ఇబ్బందికర పరిస్థితులు బొత్సకు ఎదురు కానున్నట్లు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ బదిలీల వ్యవహారం పెను వివాదానికి దారితీయడంతో ఇకపై జరిగే బదిలీల్లో రాజకీయ జోక్యం వినిపించకూడదని తాజాగా జరిగిన విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేశ్ స్పష్టంచేశారు. బొత్స అక్రమాలను బయటికి లాగాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు











