వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆయన ప్రత్యర్థులు ఈ పిక్ ను వైరల్ చేస్తూ రఘురామకు కౌంటర్ ఇచ్చామని సంతోషపడ్డారు. ఊరుకుంటే రాజు గారు ఎందుకు అవుతారు? తనదైన స్టయిల్ లో దీనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైకాపా నాయకులు తన చిత్రాలను కావాలనే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.
సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ ఈ చిత్రాన్ని ‘మీ బాబాయి సుబ్బారెడ్డి తీసినదే అనుకుంటా. అది ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం ఓ ఎంపీ నిర్వహించిన పార్టీలోనిది. అది కోల్ కతా లో కానీ, హైదరాబాద్ లో కానీ ఆ పార్టీ జరిగి ఉండవచ్చు. ఆ చిత్రంలో ఉన్నది నేనే. దానిని నేను ఇప్పటి వరకు ఎప్పుడూ చూసుకోలేదు. ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్న చిత్రంలో తప్పు ఏముంది. పెద్దవారి పార్టీలు జరుగుతున్న సమయంలో రష్యన్ యువతులు వస్తూంటారు. వారు అందరి వద్దకు వెళ్లి తమ చేతుల్లోని షాంపైన్ ను అతిథుల నోటిలో పోస్తుంటారు. ఆ క్రమంలోనే ఓ యువతి నా వద్దకు కూడా వచ్చి షాంపైన్ ను పోసింది.

షాంపైన్ అనేది మద్యం లెక్కలోకి రాదు. క్రికెట్ క్రీడాకారులు కూడా దీనిని తాగుతుంటారు. నేను షాంపైన్ తాగితే మీకేంటి రా పిచ్చి వెధవల్లారా.. ఉన్మాదుల్లాగా మీరు సంతోష పడతారేంటిరా.. అంటూ ఆయన ఆవేశంగా మాట్లాడారు. కొందరు మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి ఫొటోలు పెట్టుకొని తనను అసభ్యంగా దూషిస్తూ సందేశాలు పెడుతున్నారని తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలని అన్నారు. ఒకవేళ వారు చర్యలు తీసుకోపోతే ఢిల్లీ పోలీసులే చూసుకుంటారని హెచ్చరించారు.











