ప్రత్యర్థి పార్టీలు, ఆ పార్టీలకు చెందిన కీలక నేతలు, వారి కుటుంబాల సభ్యులపై నిత్యం అసభ్యకర పోస్టులు పెట్టి… వారిని తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తున్నట్లుగా భావిస్తున్న వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల వ్యవహారంలో నిగూఢంగా దాగున్న సంచలన విషయాలను ఏపీ పోలీసులు బయటకు తీశారు. ఇదేదో… అలా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేసి ఏదో రాక్షసానందం పొందే బ్యాచ్ ఎంతమాత్రం కాదన్న పోలీసులు…వీరంతా ఓ ముఠాగా ఏర్పడి సమాజాన్నే విచ్ఛిన్నం చేసేందుకు యత్నించారని కోర్టుకు తెలిపారు. కులం, మతం, పార్టీల పరంగా సమాజంలో అసమానలతను రేకెత్తించి… సమాజంలో కల్లోలం సృష్టించేందుకు వైసీపీ యాక్టివిస్టులు యత్నించారని నిగ్గు తేల్చారు. ఇలాంటి వ్యక్తులను బయట తిరగనిస్తే…సమాజానికి తీరని చేటు కలుగుతుందని, అందుకే వారిని తక్షణమే జైలుకు పంపాలని కూడా కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు, వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డికి పీఏగా వ్యవహరిస్తున్న వర్రా రవీంద్రారెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు ఈ మేర సంచలన విషయాలను ప్రస్తావించారు. ఈ రిమాండ్ రిపోర్టును మంగళవారం పులివెందుల కోర్టులో సమర్పించిన పోలీసులు.. కోర్టు ఆదేశాల మేరకు వర్రాతో పాటు ఆయనకు సహకరించిన గుర్రంపాటి వెంకట సుబ్బారెడ్డి, గురజాల ఉదయ్ కుమార్ రెడ్డిలను జైలుకు తరలించారు.
ఇక ఈ వ్యవహారంలో వర్రా వైసీపీ సోషల్ మీడియా విభాగానికి కో కన్వీనర్ గా వ్యవహరించగా… సజ్జల భార్గవ రెడ్డి ఈ మొత్తం వ్యవహారాన్ని తన కనుసన్నల్లో నడిపారని పోలీసులు తెలిపారు. వీరికి జగన్ మేనల్లుడు సిరిగిరి అర్జున్ రెడ్డి సహకరించడమే కాకుండా ఓ వ్యవస్తీకృత నేరంగా జరిగిన ఈ వ్యవహారంలో అతడు కీలక భూమిక పోషించినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. ఈ ముఠాలో మొత్తంగా 45 మంది పాలుపంచుకున్నారన్నపోలీసులు…వారందరిపైనా కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసులో వర్రాను మొదటి ముద్దాయిగా చేర్చిన పోలీసులు, సజ్జల భార్గవరెడ్డిని రెండో నిందితుడిగా, అర్జున్ రెడ్డిని మూడో నిందితుడిగా చేర్చారు. సినిమాల్లో చూపిన మాదిరిగా ఓ ఆర్డనేజ్డ్ క్రైమ్ మాదిరిగా కొనసాగిన ఈ వ్యవహారంలో ఈ ముఠా సభ్యులు సమాజంలో కులపరమైన అసమానతలు సృష్టించి…వాటి ఆధారంగా సమాజంలో అశాంతిని రేకెత్తించడంతో పాటుగా వాటినే పెట్టుబడిగా పెట్టి సొమ్ము చేసుకునేందుకు కూడా యత్నించారని తెలిపారు. కేవలం సోషల్ మీడియా పోస్టుల ద్వారానే ఓ పెను విధ్వంసాన్నే సృష్టించేందుకు ఈ ముఠా యత్నించిందని వెల్లడించారు.
ఈ వ్యవహారాన్ని పోలీసులు అభివర్ణించిన తీరు భయాందోళనలను రేకెత్తిస్తోందని చెప్పాలి. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వ్యవహారం కేవలం సోషల్ మీడియాకు మాత్రమే సంబంధించినదిగా భావించడానికి వీల్లేదని పోలీసులు తెలిపారు. సమాజంలోని కులాల మధ్య కుంపట్లు రాజేసే ఓ వ్యవస్థీకృత నేరమని, తద్వారా సమాజంలో చిచ్చు పెట్టే ఓ కుటిల యత్నమని… ఈ వ్యవహారాన్ని అభివర్ణించారు. మహిళలను అసభ్య పోస్టులతో వేధించిన ఈ ముఠా… బాలికలను కూడా తీవ్ర మానసిక వేదనకు గురి చేసిందని తెలిపారు. ఇక సమాజంలో గౌరవంగా బతికే దళితులను అవమానించడమే లక్ష్యంగా ఈ ముఠా కుట్రలు చేసిందని తెలిపారు. ఈ తరహా యత్నాల ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు కూడా ఈ ముఠా విఫలయత్నం చేసిందని కూడా పోలీసులు తెలిపారు. వీటితో బలవంతపు వసూళ్లకు కూడా ఈ ముఠా తెరతీసిందని వెల్లడించారు. మొత్తంగా ఈ వ్యవహారం కేవలం సోషల్ మీడియాలో అసభ్యపోస్టులకు మాత్రమే పరిమితమైన విషయం కాదని తేల్చేశారు.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో పాటు వారి కుటుంబసభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైనంపై ఏపీవ్యాప్తంగా పోలీసులు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు నమోదు చేస్తున్న తీరుణంలో భారతి రెడ్డి పీఏగా ఉంటూ వర్రా కొనసాగించిన దమనకాండపై ప్రత్యేకంగా దృష్టి సారించగా… ఈ దారుణాలు బయటపడ్డాయి. ఈ మొత్తం వ్యవహారానికి కేంద్ర బిందువుగా మారిన భార్గవ రెడ్డితో పాటు అతడికి వెన్నుదన్నుగా నిలిచిన అర్జున్ రెడ్డిలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వేట సాగిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. మాదిర రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా… ఇదేమిటని ప్రశ్నించిన దళితుడు హరిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అర్జున్ రెడ్డితో కలిసి హరి నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు. హరి ఫిర్యాదుతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు…వర్రా దుర్మార్గాలను ఒక్కటొక్కటిగా బయటకు తీస్తున్నారు… ఈ లింకులు ఎన్ని బయట పడతాయో, మరెంతమంది అరెస్టు అవుతారో అనేది హాట్ టాపిక్‌గా మారుతోంది..