ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేసే దిశగా ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తన శక్తికి మించి కష్టపడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమికి ప్రజలు రికార్డు మెజారిటీతో విజయం కట్టబెట్టగా… టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు కేబినెట్ లో కీలకమైన విద్యా శాఖతో పాటు ఐటీ, మానవ నవరుల మంత్రిత్వ శాఖలను తీసుకున్న లోకేశ్… రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సాగుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించిన లోకేశ్…అక్కడి దిగ్గజ కంపెనీలన్నింటినీ చుట్టేశారు. అంతేకాకుండా ఏపీలో ఆయా కంపెనీల కార్యకలాపాల ప్రారంభం, విస్తరణకు సంబంధించి ఉన్న అవకాశాలు, ఆ దిశగా ముందుకు వచ్చే కంపెనీలకు తమ ప్రభుత్వం నుంచి అందే సహకారం, ఏపీ నూతన పారిశ్రామిక విధానం తదితరాలపై డీటెయిల్డ్ ప్రజెంటేషన్ ఇచ్చి వచ్చారు. ఇక ఆ కంపెనీల నుంచి ఏదైనా సంకేతాలు వస్తాయా? అన్న దిశగా లోకేశ్ బృందం ఎదురు చూస్తోంది.
ఇలాంటి కీలక తరుణంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ డైరెక్టర్ వీవీ లక్ష్మినారాయణ రెండు రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా ఏపీ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ ఓ పోస్టును పెట్టారు. నేషనల్ మీడియాలో వచ్చిన ఓ కథనానికి చెందిన క్లిప్పింగ్ ను షేర్ చేసిన లక్ష్మినారాయణ… ఐఫోన్ తయారీ కంపెనీ యాపిల్ కు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం పలకాలంటూ కోరారు. యాపిల్ ఆపరేషన్స్ ఇండియా పేరిట యాపిల్ తన సొంత కంపెనీనే భారత్ లో ఏర్పాటు చేయనుందని తెలిపిన ఆయన…ఈ కంపెనీ ద్వారా ఆ సంస్థ రీసెర్చీ అండ్ డెవలప్ మెంట్ విభాగాలతో పాటు డిజైనింగ్ విభాగాలను ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. ఈ విభాగాలతో కూడిన యాపిల్ ఆపరేషన్స్ ఇండియా రాష్ట్రానికి వస్తే…రాష్ట్రంలోని ఇంజినీరింగ్ పట్టభద్రులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ సదవకాశాన్ని వదులుకోరాదన్న లక్ష్మినారాయణ… యాపిల్ కు తక్షణమే ఆహ్వానం పలకాలంటూ ఏపీ ప్రభుత్వానికి సూచించారు.
అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ యాపిల్… ఇప్పటికే భారత్ లో తన కార్యకలాపాలను మొదలుపెట్టింది. తన ఫ్లాగ్ షిప్ ఉత్పత్తి అయిన ఐఫోన్ తో పాటు ఇతర యాక్సెసరీలను కూడా యాపిల్ భారత్ లో తయారు చేస్తోంది.అయితే ఈ కార్యకలాపాలను సదరు సంస్థ తన సొంతంగా చేపట్టడం లేదు. ఫాక్స్ కాన్ అనే ఓ సంస్థ ద్వారా ఐఫోన్ల తయారీ, ఇతరత్రా కార్యకలాపాలను ఆ సంస్థ కొనసాగిస్తోంది. ఈ తరహా కార్యకలాపాలను యాపిల్ సంస్థ అమెరికాతో పాటు చైనా, మరిన్ని దేశాల్లో కూడా కొనసాగిస్తోంది. అయితే పరిశోధన, అభివృద్ధి, డిజైనింగ్ విభాగాలను మాత్రం ఆ కంపెనీ ఇతర కంపెనీలకు ఇవ్వడం లేదు. ఈ విభాగాలను ఆ కంపెనీ అమెరికా సహా చైనా, ఇజ్రాయెల్ లలోతన సొంతంగానే నిర్వహిస్తోంది. తాజాగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రతిపాదనలు, యాపిల్ కు పరిశోధన, అభివృద్ధి, డిజైనింగ్ విభాగాలను విస్తరించాల్సిన అవసరం ఏర్పడటంతో భారత్ లో ఆ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆ కంపెనీ యాపిల్ ఆపరేషన్స్ ఇండియా పేరిట ఓ కొత్త అనుబంధ కంపెనీని రిజిష్టర్ చేసింది. ఈ కంపెనీ పూర్తిగా యాపిల్ సొంత కంపెనీగానే కొనసాగనుంది.
ప్రస్తుతం ఫాక్స్ కాన్ కంపెనీ యాపిల్ ఐఫోన్ల తయారీ కోసం తమిళనాడులో ఫ్యాక్టరీని నడుపుతోంది. మరో రెండు కంపెనీలు కర్ణాటక వేదికగా ఐఫోన్ల తయారీని చేపడుతున్నాయి. అయితే కొత్తగా యాపిల్ తన సొంతంగానే ఏర్పాటు చేయనున్న ఆర్ అండ్ డీ, డిజైనింగ్ యూనిట్ ను ఎక్కడ ఏర్పాటు చేయనుందన్న విషయంపై ఆసక్తి నెలకొంది. ఇలాంటి కేంద్రాల ఏర్పాటుకు ఏపీ ఎకనమికల్ కేపిటల్ విశాఖపట్టణం అనుకూలంగా ఉన్న విషయాన్ని ఇప్పటికే లోకేశ్ బృందం .పలు ఐటీ కంపెనీలకు తెలిపింది. అమెరికా పర్యటనలో భాగంగా లోకేశ్ యాపిల్ కంపెనీని కూడా సందర్శించారు. ఈ నేపథ్యంలో యాపిల్ కంపెనీ తన సొంత కంపెనీ యూనిట్ ను భారత్ లో ఏర్పాటు చేసే విషయాన్ని ఏపీ ప్రభుత్వం వద్ద తప్పనిసరిగా ప్రస్తావించే అవకాశాలున్నాయి. దీనిపై లోకేశ్ బృందం ఇప్పటికే దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా… ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే… ఈ యూనిట్ ఏపీకి వచ్చేందుకే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పక తప్పదు.