వచ్చే ఏడాది మార్చిలో సాధారణ ఎన్నికలతో పాటుగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ముఖ్యమంత్రి జగన్ కు ఇప్పటి నుంచే భయం పట్టుకుంది. కొద్ది నెలల వరకూ ఎక్కడ లేని ధీమాతో ఆకాశంలో ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడు నేలకు దిగివచ్చి భయపడుతూ ఉన్నారు. గతేడాది సీఎం జగన్ నోటి నుంచి వచ్చిన ‘వై నాట్ 175’ అనే మాట బాగా పాపులర్ అయింది. రాష్ట్రంలోని 175 స్థానాల్లోనూ వైఎస్ఆర్ సీపీ ఎందుకు గెలవలేదు.. అందుకు అనుగుణంగా నేతలు పని చేయాలని నిర్దేశించారు. కట్ చేస్తే ఇప్పుడు సీన్ ఉల్టా అయింది. వై నాట్ 175 కాదు కదా.. కనీసం గెలవడానికి అవసరమైన సీట్లు వచ్చినా చాలనుకొనే స్థాయికి జగన్ ఆత్మవిశ్వాసం పడిపోయినట్లుగా తెలుస్తోంది. తాను ఎక్కడ కుర్చీ దిగిపోవాల్సి వస్తుందోనని తెగ కలవరపడుతున్నారు.
దీనికి కారణం ప్రశాంత్ కిషోర్ సర్వే. టీడీపీ, జనసేన కూటమికి 140 కి పైగా సీట్లు దక్కుతాయని, జగన్ పార్టీకి మాత్రం 30 కి మించి స్థానాలు రావడం కష్టమని ఆ సర్వే తేల్చింది. అధికార పార్టీ గ్రాఫ్ ఇంతలా పడిపోవడానికి మితిమీరిన ఆత్మవిశ్వాసమే కారణంగా చెప్పొచ్చు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే తీసుకున్న నిర్ణయాలు, విధానాలు పుట్టిముంచాయి. 3 రాజధానుల నిర్ణయం ప్రకటించాక కొందరు మద్దతు ఇచ్చారు.. ఇంకొందరు వ్యతిరేకించారు. ఇన్నేళ్లయినా ఏదీ ఓ కొలిక్కి రాకపోవడంతో జగన్ చేతగానితనాన్ని గుర్తించేశారు. ఇప్పుడు ఆ వ్యతిరేకత ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, క్రిష్ణా జిల్లాలపై అధికంగా ఉంది. ఈ రెండు జిల్లాల్లో అసలు వైఎస్ఆర్ సీపీకి ఒక్క సీటు కూడా రాదని తెలుస్తోంది. అటు నెల్లూరులో కీలక నేతలే ఫిరాయింపులు చేశారు. ప్రకాశం జిల్లాలోనూ విభేదాలు ఉన్నాయి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కరవు పరిస్థితులను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోలేదు.
ఇటు ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం మామూలుగా లేదు. దీంతో 2024 ఎన్నికలను ఎదుర్కోవడం వైఎస్ఆర్ సీపీ నేతలను భయపెడుతోంది. పైగా ఏ ఒక్క నిర్ణయంలోనూ ప్రభుత్వం నిలకడగా లేదు. రాజధాని అంశంలోనూ ప్రతిపక్ష స్థానంలో ఉండగా, అమరావతిని అంగీకరించి ఇప్పుడు ప్లేటు మార్చారు. అట్లాగే ఓపీఎస్ తీసుకొస్తామని చెప్పి, మడమ తిప్పారు. ఇవి కాక, చంద్రబాబుపై చేస్తున్న కక్ష్య సాధింపు రాజకీయాలతో వైఎస్ఆర్ సీపీ ప్రతిష్ఠ మరింత దిగజారింది. అన్ని చేతులారా చేసుకున్న తప్పిదాలతో వైఎస్ఆర్ సీపీ నేతలకు ఇక నుంచి గడ్డు కాలం ఎదురుకానుంది.