ఏపీలో చంద్రబాబు నాయుడు అరెస్టై జైలు నుంచి విడుదల అయిన తర్వాత రాజకీయ కార్యక్రమాలు కాస్త నెమ్మదించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షం సైలెంట్ గా ఉన్నప్పటికీ అధికార పార్టీ కలవరపడుతూనే ఉంది. అడపాదడపా సజ్జల రామక్రిష్ణా రెడ్డి ప్రెస్ మీట్ లు పెట్టి, విపక్షాన్ని తిడుతూ తమ భయాన్ని చాటుకుంటూ ఉండేవారు. కానీ, ఇక నుంచి అసలైన ఆట మొదలు కానుంది. అధికార పార్టీ కళ్లు బయర్లు కమ్మేలా టీడీపీ వరుసగా యాత్రలతో ప్రజల్లోకి రానుంది. దానికి తోడు జనసేన కూడా వారాహి యాత్రను మళ్లీ ప్రారంభించనుంది. దీంతో తాడేపల్లి ప్యాలెస్ లోని జగన్ సహా అధికార పార్టీ నేతలు అందరికీ గజగజ వణుకు మొదలైంది.
నవంబరు 27 నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 2.0 ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ఆ వెంటనే డిసెంబర్ 1 తర్వాత చంద్రబాబు బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఆ తర్వాత సుమారు వచ్చే నెల మొదటి వారంలోనే నారా భువనేశ్వరి ఓదార్పు యాత్ర మొదలు కానుంది. వీటికి తోడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఇదే సమయంలో వారాహి యాత్రను పున:ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగే ఈ యాత్రలతో అధికార పార్టీ బెదిరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పటిదాకా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తాత్కాలిక బెయిల్ పై ఉన్న చంద్రబాబు హైకోర్టు ఆదేశాలను గౌరవించి రాజకీయాల గురించి ఎక్కడా మీడియాతో మాట్లాడలేదు. పైగా కంటికి జరిగిన ఆపరేషన్ వల్ల కొద్ది రోజులు ఆయన విశ్రాంతిలో ఉన్నారు. ఇటీవలే హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడంతో ఆయనపై ఉన్న ఆంక్షలు తొలగిపోయాయి. దీంతో ఇక ప్రజల మధ్యలోకి వచ్చి ప్రభుత్వ చేతగాని తనాన్ని, కక్ష్యసాధింపు తీరును చంద్రబాబు వివరించనున్నారు. ఇప్పటికే చంద్రబాబుపై ప్రజల్లో బాగా సానుభూతి ఏర్పడగా, విపరీతమైన జనాదరణ లభిస్తోంది.
చంద్రబాబు విడుదల సందర్భంగా రాజమండ్రి జైలు నుంచి ఉండవల్లి నివాసానికి 14 గంటలకు పైగా సమయం పట్టిన సంగతి తెలిసిందే. అందులోనూ అర్ధరాత్రి అనే బేధం లేకుండా తెలుగు దేశం శ్రేణులు దారి పొడవునా ఆయనకు అభివాదం తెలపడంతో ఆ పరిస్థితులను చూసి అధికార పార్టీ కంగుతిన్నది. ఇప్పుడు చంద్రబాబు జనాల మధ్యలోకి వస్తే పరిస్థితి ఏంటనేది తలచుకుంటేనే జగన్ వెన్నులో వణుకుపుడుతోంది. మొత్తంగా టీడీపీ, జనసేన పార్టీలు చేసే ఈ యాత్రల దాడితో జగన్ కు మోత మోగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.