గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో యువత కనిపించలేదు. ప్రచారంలో , సోషల్ మీడియా ప్రచారంలో దూసుకు పోయిన వారంతా పోల్ డే వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ప్రచారం మొత్తంలో ముందుండి జోష్ నింపిన వారంతా ఓటు వేసే సమయానికి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. యువత ఓట్లనే నమ్ముకున్న పార్టీలు కూడా ఈ పరిణామాలతో షాక్ గురయ్యాయి. యువకులే తమ బలం అనుకున్న పార్టీలు ఇప్పుడు వారిచ్చిన షాక్‌తో దిమ్మతిరిగి పోయాయి. తమ అంచనాలు తారుమయ్యాయా అన్న అనుమానంతో లెక్కలు వేసుకోవడం మొదలు పెట్టారు.
యువతే టార్గెట్‌గా ప్రచారం ..
ఎన్నికల ప్రారంభం నాటి నుండి యువతను ఆకట్టుకునేలా పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాలేకుండా అన్ని యువతే టార్గెట్‌గా తమ మేనిఫెస్టో కూడా విడుదల చేసాయి. యువతకు ఛలాన్లు కడతామని బీజేపీ చెబితే .. ఉద్యోగాల మాటేంటని అడగండి అంటూ టీఆర్ఎస్ ఎదురు దాడి చేసింది. కాంగ్రెస్ సైతం తమ వంతుగా యువతను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డింది. అయితే అన్ని పార్టీలు ఏమి చెప్పినా పట్టించుకోలేదు యువత. వారి దారి వాదే అన్నట్టు.. తమకు ఓటింగ్ .. రాజకీయాలు పట్టనట్టు వ్యవహరించారు. పోలింగ్ రోజు ఓటు వేసేందుకు పోల్ బూత్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో పార్టీలన్నీ తాము అనుకున్న విధంగా యువత తరలిరాక పోవడంతో పునరాలోచనలో పడ్డాయి. అప్పటి వరకు గెలుపు , సీట్ల పెరుగుదల పై నమ్మకంగా ఉన్న పార్టీలు తాము ఏ ఫిగర్ వద్ద ఆగుతామో అంటూ బూత్‌ల వారీగా ఓట్ల లెక్కలు వేస్తున్నాయి.
దుబ్బాక జోష్ ఇక్కడేదీ…
ఇరవై రోజుల క్రితం జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించారు. అధికార టీఆర్ఎస్ , బీజేపీ పార్టీల తరఫున పోటాపోటీగా పని చేశారు. ఇక పోలింగ్ రోజు సైతం వారి హడావుడి అంతా ఇంతా కాదు. కాని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయం వచ్చే సరికి వారంతా కనిపించ కుండా పోయారు. దుబ్బాకలో ఎన్నికల రోజు ప్రతి ఓటును బూత్ వద్దకు తీసుకు వచ్చి వేయించారు. ఇక్కడ వారే బూతు వద్దకు రావడం గగనంగా మారింది. పార్టీ తరఫున పోటీ చేసిన తమ వారిని గెలిపించుకునేందుకు కూడా వారు పోలింగ్‌కు రాలేదు. వృద్దులతో పాటు మధ్య వయసు దాటిన వారు కూడా పోలింగ్‌లో ఉత్సాహంగా పాల్గొని యువతకు చెప్పపెట్టుగా సమాధానం చెప్పారు. పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిని చూసైనా నేటి యువత పోలింగ్‌లో తన ఓటు హక్కును వినియోగించుకునేలా ముందుకు రావాలని విశ్లేషకులు కోరుతున్నారు.











