ఎన్నికల ప్రచారానికి గడువు దగ్గరపడుతుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. టీఆర్ఎస్‌లో మాత్రం దాదాపుగా కేటీఆర్ ఒక్కరే అన్నీ తానై ప్రచార కార్యక్రమాలు తన భుజంపై వేసుకుని ముందుకు వెళ్తున్నారు. కానీ బీజేపీలో పరిస్థితి వేరేలా ఉంది. అందులో అగ్రనాయకత్వమంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోంది. ఇప్పటికే అరడజను మంది జాతీయ స్థాయి నేతలు హైదరాబాద్‌కు వచ్చి రోడ్ షోలలో, ప్రచార సభల్లో పాల్గొని వెళ్లారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి.. నడ్డా, సీఎం యోగి ఆదిత్యనాథ్, అమిత్‌షా, ప్రధాని మోడీ కూడా హైదరాబాద్‌కు రాబోతున్నారు. నరేంద్ర మోడీ పర్యటనకు ఈ ఎన్నికలకూ నేరుగా ఎలాంటి సంబంధం లేకున్నా ఆయన పర్యటన మాత్రం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది.
టార్గెట్ కాంగ్రెస్ కాదు బీజేపీయే…
మొదట టీఆర్ఎస్ పార్టీయే జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అనంతరం బీజేపీ ఏకంగా మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్‌ను హైదరాబాద్‌కు రప్పించి తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయించింది. కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో పొందుపరిచిన కొన్ని హామీలు ప్రజలను ఆకర్షించేలా ఉన్నాయి. ఒకవేళ ప్రజలు ఆ దిశగా ఆలోచిస్తే అది వారికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు పార్టీల మేనిపెస్టోలకు భిన్నంగా టీఆర్ఎస్ పార్టీ సైతం బీసీ క్యాటగిరీ ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు వీలుగా కొన్ని ఉచిత హామీలను పొందుపరిచి స్వయంగా కేసీఆరే ఆ మేనిఫెస్టోను విడుదల చేశారు. కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకుని రాష్ట్ర, జాతీయ నాయకత్వాలను ఎన్నికల ప్రచారంలో దింపుతుంటే టీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఓవరాల్‌గా ఈ బాధ్యతనంతా కేటీఆరే ఒక్కరే చూసుకుంటున్న పరిస్థితి ఉంది.
ఈక్రమంలో బీజేపీని.. కాంగ్రెస్ పార్టీని అడ్డుకునే ప్రయత్నంలో గులాబీ దళపతిని ఆ పార్టీ ఎంట్రీ చేస్తుంది. ముందస్తుగానే కేసీఆర్ సభ షెడ్యూల్ ఫిక్స్ అయినప్పటికినీ ఆ సభలో కేసీఆర్ ఇచ్చే స్పీచ్‌లో మార్పులు చేర్పులు చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సాదాసీదాగా స్పీచ్ ఉండకుండా ఎన్నికల హామీలతో ఆ సభ దద్దరిల్లిపోయేలా స్పీచ్ ఉండబోతున్నదనే వాదన కూడా వినబడుతోంది. బీజేపీ స్పీడును అడ్డుకోవాలంటే కేసీఆర్ తన స్పీడ్‌ను పెంచాలనే అభిప్రాయం కూడా తమ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రేపు జరగబోయే సభలో కేసీఆర్ హామీల వర్షంతో ప్రత్యర్థులను చెక్‌పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచని హామీలను ఈ సభా వేదికపై నుంచి కొన్నింటిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఆరేళ్లలో టీఆర్ఎస్ చేసిన అభివృద్దిని వివరిస్తూనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల హామీలు నీటిమూటలాగా ఉన్నాయనే విషయాన్ని ఈ సభ ద్వారా ప్రజల్లోక బలంగా తీసుకెళ్లేందుకు గులాబీ బాస్ వ్యూహంలో మార్పులు చేసుకున్నారని తెలుస్తోంది.
Must Read ;- మంచినీటి సరఫరా.. ఉచిత నల్లా కనెక్షన్: టీడీపీ మేనిఫెస్టో