వైసీపీ నేత, విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇల్లు, కార్యాలయాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈదీ) అధికారులు జరిపిన దాడుల్లో పలు ఆసక్తికర కోణాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ కుటుంబం మొత్తం కిడ్నాప్ నకు గురైందన్న వార్తలు పెను కలకలమే రేపిన సంగతి తెలిసిందే. అయితే కిడ్నాప్ వెనుక కూడా ఆ మాజీ ఎంపీ పాల్పడ్డ భూ కబ్జానే కారణమని కూడా తేలిపోయింది. అంతేకాకుండా ఈ కిడ్నాప్ ను సొంత పార్టీ నేతలే చేసి ఉంటారన్న అనుమానాలూ కలుగుతున్నాయి. ఎంవీవీని దారికి తెచ్చుకునేందుకే వైసీపీకి చెందిన కొందరు కీలక నేతలు ఆయన కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి ఉంటారన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా ఈడీ సోదాలతో మాజీ ఎంపీ భూకబ్జా భాగోతం బయటపడటంతో పాటుగా ఎంవీవీ కుటుంబ కిడ్నాప్ ఉదంతం, దాని పర్యవసానాలు కూడా బయటకు వచ్చాయి.
ఇక మాజీ ఎంపీ ఎంవీవీ కొట్టేసిన భూముల వివరాల్లోకి వెళితే…మరింత ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2008లో అస్పటి ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి… విశాఖలో వృద్ధులు, అనాథల కోసం కాటేజీలు కట్టేందుకు హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ కు ఎండాడ గ్రామ పరిధిలో 12.51 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూములను కాజేసేందుకు చాలా మంది నేతలు యత్నించినా కుదరలేదు. అయితే 2019 ఎన్నికల్లో విజయం సాధించి ఏపీలో అధికారం చేపట్టిన వైసీపీ సర్కారులో విశాఖ భూములకు రెక్కలొచ్చేశాయి. ఎక్కడికక్కడ, ఎవరికి దొరికింది వారు అన్న చందంగా వైసీపీ నేతలు విశాఖలోని భూములను తమ హస్తగతం చేసుకున్నారు. చోటామోటా నేతలే భూకబ్జాలకు పాల్పడుతున్న వేళ… రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అప్పటికే కాకలు తీరిన బిజినెస్ మ్యాన్ గా ఎదిగిన ఎంవీవీ ఊరుకుంటారా? చిన్న నేతలకూ, తనకూ తేడా ఉండాలన్నట్లుగా… ఏకంగా హయగ్రీవ భూములపై కన్నేసిన ఎంవీవీ… వాటిని తన పేరిట రాయించుకునేందుకు నానా అడ్డదారులు తొక్కారు.
సరే… 2024 ఎన్నికల్లో వైసీపీని గద్దె దించిన ఏపీ ప్రజలు టీడీపీ కూటమికి పట్టం కట్టారు. అదే సమయంలో హయగ్రీవ భూముల అన్యాక్రాంతంతో పాటుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎంవీవీ పాల్పడ్డ అక్రమాలపై ఫిర్యాదులు అందుకున్న ఈడీ అదికారులు… 2 రోజుల క్రితం విశాఖలోని ఎంవీవీ ఇల్లు, కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు జరిపారు.ఈ సోదాల్లో పలు కీలక పత్రాలతో పాటు కొన్ని హార్డ్ డిస్క్ లను కూడా ఈడీ అదికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సోమవారం ఎంవీవీ ఇంటిపై జరిపిన దాడులకు సంబంధించిన వివరాలను ఈడీ అధికారులు విడుదల చేశారు. ఈ వివరాలు చూస్తుంటే… హయగ్రీవ భూములను హస్తగతం చేసుకునేందుకు ఎంపీ హోదాలో ఎంవీవీ ఇన్నేసి అక్రమాలకు పాల్పడ్డారా? అని జనంముక్కున వేలేసుకుంటున్నారు. అంతేకాకుండా హయగ్రీవ భూములను ఓ సదుద్దేశ్యానికి వైఎస్ ఇస్తే,… ఆయన కుమారుడికి చె పార్టీ ఎంపీ వాటిని కాజేయడం ఏమిటని కూడా వాపోతున్నారు.
ఇదిలా ఉంటే… సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఎంవీవీ కుటుంటం కిడ్నాప్ కావడం, అది కూడా ఆ ఎంపీకి టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ ఘటన జరిగిన తీరు నాడే పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే సొంత పార్టీకి చెందిన ఎంపీ… పార్టీ అధిష్ఠానికి తెలియకుండానే రూ.200 కోట్ల విలువ చేసే హయగ్రీవ భూములను కాజేశారని నాడు పార్టీలోనే కొందరు నేతలు ఆగ్రహోదగ్రులయ్యారట. ఈ విషయం పార్టీ అధినేత, నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెవిన కూడా పడిందట. ఆ తర్వాతే ఎంవీవీ కుటుంబం కిడ్నాప్ నకు గురి రావడం, దానిపై పోలీసు కేసు నమోదు కావడం, ఆపై ఎంవీవీ కుటుంబం సేఫ్ గానే తిరిగి ఇంటికి చేరడం, తర్వాత జగన్ కుటుంబం ఆధ్వర్యంలోని సాక్షి పత్రికలో 2 ఫుల్ పేజీ యాడ్ లను ఎంవీవీ జారీ చేయడం, చివరాఖరుకు ఈ ఉదంతం మరుగున పడిపోవడం జరిగిపోయాయి. అయితే ఈ కిడ్నాప్ వ్యవహారంలో పాత్ర ఉందంటూ పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుడు మాత్రం ఇప్పటికీ జైల్లోనే మగ్గుతుండటం గమనార్హం.