ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైతే గానీ…వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పార్టీ పరిస్థితి గురించి అర్థం కాలేదు. పార్టీలో నెంబర్ 2 గా ఉన్న రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి అప్పటిదాకా ఉత్తరాంధ్ర వ్యవహారాలను పర్యవేక్షించారు. ఈ హోదాలో విశాఖలో తిష్ట వేసిన సాయి రెడ్డి… విశాఖను తన సామ్రాజ్యంగా మలచుకునే యత్నం చేసినట్లుగా ఆరోపణలు వినిపించాయి. అంతేకాకుండా పలువురు పార్టీ నేతల నుంచి జగన్ కు సాయిరెడ్డిపై ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఏమనుకున్నారో, ఏమో తెలియదు గానీ… ఉత్తరాంధ్ర జిల్లాల కో ఆర్డినేటర్ గా సాయిరెడ్డిని తప్పించిన జగన్… ఆ స్థానాన్ని తన బాబాయి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. ఫలితంగా సాయిరెడ్డి, సుబ్బారెడ్డిల మధ్య దూరం పెరిగింది. పరిస్థితి ఇలానే కొనసాగితే వచ్చే ఎన్నికల్లోనూ ఇబ్బందేనని భావించిన జగన్ ఆ ఇద్దరు రెడ్ల మధ్య రాజీ కుదిర్చే దిశగా ఓ కీలక ప్రకటన చేశారు.
రాష్ట్రంలో వైసీపీకి ప్రాంతాల వారీగా రీజనల్ కో ఆర్డినేటర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ పదవుల్లో కొనసాగుతున్న నేతలను షఫిల్ చేసిన జగన్… గతంలో మాదిరే సాయిరెడ్డికి ఉత్తరాంధ్ర జిల్లాల కో ఆర్డినేటర్ గా పదవిని ఇచ్చారు. ఇప్పటిదాకా ఈ పదవిలో కొనసాగిన సుబ్బారెడ్డిని రాయలసీమకు పంపించారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ గా సుబ్బారెడ్డి నియమితులయ్యారు. తాను కష్టపడి పనిచేసిన ఉత్తరాంధ్రను మళ్లీ తనకే కేటాయించిన నేపథ్యంలో సాయిరెడ్డి ఒకింత చల్లబడే అవకాశాలున్నట్లుగా సమాచారం. అదే సమయంలో వైసీపీకి పెట్టని కోటలుగా ఉన్న రాయలసీమ జిల్లాలకు తనను కో ఆర్డినేటర్ గా నియమించారన్న భావనతో ఇటు సుబ్బారెడ్డి కూడా శాంతించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది
ఇక ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని అక్కడి నుంచి తప్పించి… రాష్ట్రంలోనే రాజకీయంగా కీలక జిల్లాలుగా ఉన్న గుంటూరు, ప్రకాశం జిల్లాల కో ఆర్డినేటర్ గా జగన్ ఆయనను నియమించారు. అదేవిధంగా నిన్నటిదాకా రాయలసీమ జిల్లాల కో ఆర్డినేటర్ గా కొనసాగిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చిత్తూరు, నెల్లూరు జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమించారు. శాసనమండలిలో విపక్ష నేతగా ఉన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు తన సొంత జిల్లా విజయనగరంతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాల కో ఆర్డినేటర్ గా నియమించారు. కృష్ణా జిల్లా బాధ్యతలను కొత్తగా రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి అప్పగించారు.