టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఓ నిర్ణయం తీసుకున్నారంటే…దానిని ఆయన మార్చుకోవడం అంటూ దాదాపుగా జరగదు. సొంత పార్టీ నేతలతో పాటు వైరి వర్గానికి చెందిన నేతలు కూడా ఈ తరహా లోకేశ్ తీరును ప్రశంసిస్తున్న వైనం తెలిపిసిందే. పార్టీ పరంగా అయినా, ప్రభుత్వ పరంగా అయినా… చివరాఖరుకు ప్రత్యర్థులపై చర్యల విషయంలో అయినా లోకేశ్ ఇదే తీరును కనబరుస్తున్నారు. తనను, తన పార్టీని అవమానించేలా వ్యవహరించే వైరి వర్గాలపై న్యాయపోరాటం చేయడంలో లోకేశ్ చూపిస్తున్న తెగువ ఇటీవలి కాలంలో మరే నేత వద్ద కనిపించలేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. శుక్రవారం విశాఖ వెళ్లిన లోకేశ్… నగరంలోని 12వ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లారు. లోకేశ్ ఇలా కోర్టుకు వెళ్లిన ఈ కథ చాలా పెద్దదే.
2014లో అధికారం చేపట్టిన టీడీపీ సర్కారులో ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికైన లోకేశ్ మంత్రిగానూ అవకాశం దక్కించుకున్నారు. మంత్రి హోదాలో రాష్ట్రాన్ని చుట్టేసిన లోకేశ్… పలుమార్లు విశాఖలోనూ పర్యటించారు. ఈ సందర్భంగా విశాఖ ఎయిర్ పోర్టులో వెయిటింగ్ సమయంలో లోకేశ్ తన స్నాక్స్ కోసం లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వినియోగించారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం అధ్వర్యంలోని సా*క్షి పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. చినబాబు చిరుతిండికి 25 లక్షలండి శీర్షికన ప్రచురితమైన ఈ కథనంపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు వచ్చే వీఐపీలకు ఇచ్చిన టీ,స్నాక్స్ కోసమే ఓ మోస్తరు నిధులు ఖర్చు అయిన మాట వాస్తవమేనని.. తాను ఏనాడూ ఎయిర్ పోర్టులో స్నాక్స్ తీసుకోలేదని తెలిపారు. ఇదే విషయాన్ని తెలుపుతూ… సా*క్షి పత్రికకు నోటీసులు పంపారు. ఆధారాలు లేని వార్త రాసినందుకు క్షమాపణలు చెప్పాలని ఆయన తన నోటీసుల్లో కోరారు.
లోకేశ్ నోటీసులను లైట్ తీసుకున్న సా*క్షి పత్రిక క్షమాపణలు చెప్పకపోగా.. కనీసం సదరు కధనంపై వివరణను కూడా ప్రచురించలేదు. దీంతో సా*క్షి యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్ ఆ పత్రికపై రూ.75 లక్షలకు పరువు నష్టం దావా వేశారు. ఆధారాలు లేకుండానే అసత్యాలతో సా*క్షి పత్రిక తనపై రాసిన కథనంతో తన పరువుకు భంగం వాటిల్లిందని చెప్పిన లోకేశ్… అందుకు గానూ తనకు సాక్షి యాజమాన్యం నుంచి రూ.75 లక్షల పరిహారాన్ని ఇప్పించాల్సిందిగా కోర్టును కోరారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే పలుమార్లు కోర్టుకు హాజరైన లోకేశ్.. ఆగస్ట్ 29నే జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరయ్యారు. తాజాగా శుక్రవారం మరోమారు క్రాస్ ఎగ్జామినేషన్ ఉండగా… దానికి కూడా లోకేశ్ స్వయంగా హాజరయ్యారు. లోకేశ్ పట్టుదలను చూస్తుంటే… సా*క్షి యాజమాన్యంతో లోకేశ్ పరిహారం కట్టించుకుని తీరతారన్న వాదనలు వినిపిస్తున్నాయి.