వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ వ్యవహార శైలి గతంలో పోలిస్తే ఈ మధ్య కాస్త భిన్నంగా ఉంటోంది. అధికారం కోల్పోయామనే బాధలో ఉన్న జగన్.. కాస్త శ్రుతి మించి వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రవర్తనా శైలి పలువురికి నవ్వు కూడా తెప్పిస్తోంది. తాజాగా ఏపీ బడ్జెట్ సమవేశాలు నేడు ప్రారంభం కాగా.. అక్కడ జగన్ అపహాస్యం పాలయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమపై దాడులు జరుగుతున్నాయని, శాంతిభద్రతలు క్షీణించాయని జగన్ అండ్ కో నల్ల కండువాలతో అసెంబ్లీకి వెళ్లారు. అసెంబ్లీ ప్రాంగణం వద్ద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు సహజంగానే అడ్డుకుని వారి వద్ద నుంచి ప్లకార్డులు లాక్కొనే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసుల తీరుపై జగన్ సీరియస్ అయ్యారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దగ్గర నుంచి పేపర్లు తీసుకుని చింపేసే అధికారం మీకు ఎవరిచ్చారంటూ నిలదీశారు. ఏమయ్యా.. మధుసూదన్ రావు గుర్తు పెట్టుకో.. ఎల్లకాలం ఇలాగే ఉండదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏంటో తెలుసా.. ఏంటో తెలుసా..? అధికారంలోకి ఉన్న వారికి సెల్యూట్ చేయడం కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే మీరు ఉన్నారు. గుర్తు పెట్టుకోండి.. అంటూ ఓ పోలీస్ అధికారిపై చిందులు తొక్కారు.
అయితే, ఈ వీడియో వైరల్ అవుతుండడంతో జగన్ మోహన్ రెడ్డి వ్యవహర శైలిని చూసి అందరూ నవ్వుకుంటున్నారు. నువ్వు సీఎంగా ఉన్నప్పుడు పోలీసులను నీకు నచ్చినట్లుగా వాడుకున్నది నువ్వేగా జగన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పైగా తనకు నచ్చిన పోలీసు ఉన్నతాధికారులను నచ్చిన చోట నియమించుకొని.. అప్పటి విపక్షాలను నానా యాతనలు పెట్టిన తీరును మర్చిపోయావా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు జగన్ కు తగిన శాస్తి జరిగింది అంటూ సంబర పడుతున్నారు.
ఇక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే, వైసీపీ అధినేత మరో డ్రామాకు తెర తీశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం మొదలుపెట్టగానే.. గవర్నర్ ప్రసంగం ప్రారంభంతోనే జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు నశించాలి.. సేవ్ డెమొక్రసీ.. అంటూ సభలో వైసీపీ నేతలు నినాదాలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ.. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు నినాదాలతో, నిరసన వ్యక్తం చేశారు. అలా ముందస్తు ప్లాన్ ప్రకారం కొద్దిసేపటికి గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. నిజానికి అసెంబ్లీకి డుమ్మా కొట్టేందుకు ఇదంతా వైసీపీ ముందుగానే చేసిన ప్లాన్. దాని ప్రకారమే వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు.