వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన సొంత పార్టీనే విభేదిస్తున్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు. ఈ మధ్యే ఆయనపై అక్రమ సంబంధం ఆరోపణలు వచ్చాయి. విశాఖపట్నంలో దేవాదాయ శాఖలో పని చేస్తున్న అసిస్టెంట్ కమిషనర్ అయిన కె.శాంతి అనే ఉద్యోగితో విజయసాయి రెడ్డికి అక్రమ సంబంధం ఉందని బలమైన ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక, విజయసాయి రెడ్డి వల్ల ఆమెకు ఒక బాబు కూడా పుట్టాడని ఆమె భర్తనే ఆరోపిస్తున్నారు. అయితే, ఇదంతా కుట్ర అని విజయసాయి రెడ్డి కొట్టిపారేస్తున్నారు. ఈ కుట్ర చేసింది ప్రత్యర్థి పార్టీలని కూడా అనడం లేదు. తన సొంత పార్టీలోనే కొందరు తనను కార్నర్ చేస్తున్నారని విజయసాయి రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
వైఎస్ఆర్ సీపీలో జగన్ తర్వాత ఉన్న ఇద్దరు కీలక వ్యక్తులు కలిసి తనపై ఇంతటి అభాండం మోపారని విజయసాయి రెడ్డి చెబుతున్నారు. ఈ సందర్భంగా తనపై ఉన్న ఆరోపణలను కొన్ని మీడియా ఛానెళ్లు నిజాలే అంటూ ప్రసారం చేస్తున్నారని.. మీడియా భ్రష్టు పట్టిపోయిందని మాట్లాడారు. అందుకే తానే ఒక టీవీ ఛానెల్ పెడతానని విజయసాయి రెడ్డి రెండు రోజుల క్రితం ప్రకటించారు. అయితే, గతంలో కూడా తాను టీవీ ఛానెల్ ప్రకటించానని.. కానీ, జగన్ వద్దన్నందుకు ఛానెల్ స్టార్ట్ చేయలేదని అన్నారు. ఛానల్ పెట్టి నష్టపోవద్దని, మనకు ఇప్పటికే ఒక ఛానల్ ఉంది కదా అని జగన్ చెప్పారని విజయసాయి రెడ్డి గుర్తు చేశారు.
దీంతో ఛానల్ పెట్టాలనే ఆలోచనను విరమించుకున్నానని చెప్పారు. కానీ ఈసారి మాత్రం తాను ఛానెల్ పెట్టడంలో తగ్గేదే లేదని అన్నారు. జగన్ చెప్పినా, ఇంకెవరు చెప్పినా కొత్త ఛానెల్ విషయంలో తాను విననని అన్నారు. ఛానల్ పెట్టడం ఖాయం అని అన్నారు. తాను పెట్టబోయే ఛానెల్ కుల, మతాలకు అతీతంగా నిజాయతీగా పని చేస్తుందని అన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా కూడా వాస్తవాలను ప్రజలకు తెలియజేసేలా తన ఛానల్ పని చేస్తుందని తెలిపారు. తన ఛానల్ న్యూట్రల్ గా ఉంటుందని చెప్పారు.
అయితే, తాను ‘ఏ పార్టీలో ఉన్నా’ అనే మాట విజయసాయి రెడ్డి అనడంతోనే ఆయన భవిష్యత్తులో వైసీపీ వీడతారని ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే విజయసాయి రెడ్డిపై భూములు ఆక్రమించారని.. ఎన్నో కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. వీటిని ఖండించేలా సాక్షిలో అంతగా కవరేజీ కూడా రావడం లేదని విజయసాయి అసహనంతో ఉన్నారట. అందుకే సాక్షికి పోటీగా న్యూస్ ఛానెల్ స్టార్ట్ చేసి.. తాను సచ్ఛీలుడిననే కథనాలను తన టీవీలో చూపించుకోవాలని విజయసాయి రెడ్డి చూస్తున్నట్లు తెలుస్తోంది.