వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన అక్రమాల పుట్టలను చంద్రబాబు ఒక్కొక్కటిగా కదిలిస్తూ ఉన్నారు. సమయం చూసుకొని వివిధ శాఖల ప్రస్తుత స్థితిగతులను శ్వేతపత్రాల రూపంలో విడుదల చేస్తున్నారు. కొద్ది వారాలుగా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు, నీటిపారుదల, విద్యుత్, భూగర్భ గనులు ఇలా వివిధ శాఖలపై సచివాలయం వేదికగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వచ్చారు. మొత్తం ఏడు శ్వేతపత్రాలకు గాను నాలుగు పత్రాలను సీఎం సచివాలయం వేదికగానే విడుదల చేశారు. ఇక మిగిలిన శ్వేతపత్రాలను ప్రభుత్వం అసెంబ్లీలోనే విడుదల చేయాలని నిర్ణయించింది.
మరో రెండు రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అందుకే సభలోనే పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా శ్వేతపత్రాలను చంద్రబాబు విడుదల చేయనున్నారు. వైసీపీ హాయాంలో రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలు – గంజాయి డ్రగ్స్ విస్తరణ.. మద్యం రూపంలో రూ.వేల కోట్ల దోపిడీ.. పాతాళానికి పడిపోయిన రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు లాంటి కొన్నిఅంశాలపై మరో మూడు శ్వేతపత్రాలను విడుదల చేయాల్సి ఉంది. ఈ నెల 22వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదు రోజులపాటు ఏపీ ప్రభుత్వం ఈ సమావేశాలను నిర్వహించనుంది.
ఈ సమావేశాల్లోనే ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అసెంబ్లీలో వైఎస్ఆర్ సీపీ కూడా ఉంటుంది కాబట్టి.. తాము లేవనెత్తిన అంశాలపై వివరణలు ఇచ్చుకోవడానికి వారికి కూడా అవకాశం ఉంటుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. దాంతో ప్రజలకు వాస్తవాలు అర్థమవుతాయి. అసెంబ్లీలో ప్రజాస్వామ్యబద్ధంగా చర్చ నిర్వహించాలనుకుంటున్నందున.. వైసీపీ కూడా అందుకు సహకరిస్తుందని అనుకుంటున్నట్లు టీడీపీ నేతలు చెప్పారు. సభలో మొదటి రోజు ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. రెండో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించి ఆమోదిస్తారు. మిగిలిన మూడు రోజుల్లో రోజుకో శ్వేతపత్రాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. ఎప్పటికప్పుడు చర్చను పూర్తి చేయనున్నారు.
దీంతో వైసీపీ అధినేత జగన్ కు ఇప్పుడు వైసీపీలో అసలు సవాలు ఎదురు కానుంది. అధికార పక్షం అసెంబ్లీలో గత పాలన గురించిన ప్రశ్నలు లేవనెత్తుతుంటే.. అసెంబ్లీలో వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలతో జగన్ ఏం చేయగలరనే ప్రశ్న తలెత్తుతోంది. గతంలో మంత్రులుగా పని చేసిన వారిలో దాదాపు ఎవరూ ఇప్పుడు సభలో లేరు. కనీసం అప్పట్లో రైట్ హ్యాండ్ తరహాలో ఉండే గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా లేరు. కాబట్టి, ఎక్కువ ప్రశ్నలకు జగనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వాటిని ఆయన ఎలా ఎదుర్కోగలరనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. లేదా వాటిని ఎదుర్కోలేక ఏదో ఒక గొడవ పెట్టుకొని వాకౌట్ చేసి వెళ్లిపోతారా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.