ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు అసంపూర్తిగా మిగలనుందా? పోలవరం జాతీయ ప్రాజెక్టును, బ్యారేజీగా మార్చే కుట్ర సాగుతోందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. రైతు సంఘాల నేతలు. పోలవరం ప్రాజెక్టును పూర్తి ఎత్తునకు నిర్మించినా కేవలం 48 మీటర్ల వరకే నీటిని నిల్వ చేయడం ద్వారా ప్రాజెక్టు ఫలితాలు 30 శాతం కూడా రైతులకు చేరవని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 195 టీఎంసీలు. కానీ 48 మీటర్ల వరకే నీటిని నిల్వ చేయడం వల్ల కేవలం పోలవరంలో 50 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసుకునే వీలుంటుంది. దీని వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరే అవకాశం కోల్పోవాల్సి ఉంటుంది.
రూ.30వేల కోట్ల పరిహారమే ప్రధాన అడ్డంకి
కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. అందుకు అవసరమయిన నిధులు కూడా విడుదల చేస్తూనే ఉంది. అయితే కేంద్ర జలసంఘం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేవలం రూ.20,153 కోట్లుగా నిర్థరించింది. పోలవరం ప్రాజెక్టులో పూర్తిగా నీటిని నిల్వ చేయాలంటే 273 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. ఇందుకు రూ.35 వేల కోట్లు అవసరం అవుతాయి. ఇంత మొత్తం ఇచ్చేందుకు కేంద్రం సిద్దంగా లేదని తెలుస్తోంది. ఇంత భారీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడం కూడా కష్టమే. అందుకే పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్మిస్తామని అంటున్నా, పునరావాసం పరిహారం చెల్లింపు విషయంలో మాత్రం సందిగ్ధత తొలగడం లేదు.
మరో నర్మద ప్రాజెక్టు కానున్న పోలవరం
పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం మొత్తం ఏపీలోనే 90 శాతం ఉండటం కలసివచ్చే అంశం. అయితే పోలవరంలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయాలంటే 7 మండలాల్లోని 273 గ్రామాల్లోని 2 లక్షల మందికి పునరావాసం కల్పించడం, వారికి పరిహారం చెల్లించడం అనేది చాలా క్లిష్టమైన వ్యవహారం. పోలవరం ప్రధాన ప్రాజెక్టును నిర్మించి పనులు అయ్యాయంటే చేతులు దులిపేసుకున్నట్టే భావించాల్సి ఉంటుంది. ఏ ప్రాజెక్టు అయినా పూర్తిగా అందుబాటులోకి రావడం అనేది పునరావాసం, పరిహారం నూరు శాతం చెల్లించినప్పుడే సాధ్యం అవుతుంది. పోలవరం విషయంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ప్రాజెక్టు నిర్మాణం అయితే పూర్తవుతుంది.. కానీ ఎంత వరకు నీటిని నిల్వ చేస్తారనే విషయంపై ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు.
Must Read ;- మతలబు : పోలవరం ఎత్తులో కాదు, నీటి నిల్వలో ఉందట
కేంద్రం సిద్దంగా లేదు
పోలవరం ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.55 వేల కోట్లు. ఈ మొత్తాన్ని భరించేందుకు కేంద్రం సిద్దంగా లేదని తెలుస్తోంది. కేవలం రూ.20153 కోట్లు చెల్లించి పోలవరం పూర్తయిందనిపించే ఆలోచనలో కేంద్ర పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలోనూ బీజేపీ అనుకూలతను కనబరుస్తున్న వైసీపీ ప్రభుత్వం ఉండటంతో కేంద్రంతో పోరాడి సాధించుకునే ఆలోచన విరమించారు. కేంద్రం ఏది చెబితే అది, వారు ఎంత ఇస్తే అంత అన్న విధంగా పోలవరం ప్రాజెక్టు వ్యవహారం తయారైంది. దీంతో కేంద్ర జలసంఘం కూడా పోలవరం వ్యయం రూ.20153 కోట్లేనంటూ కొత్త పాట అందుకుంది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా 48 మీటర్ల వరకే పోలవరంలో నీటిని నిల్వ చేస్తే ఎంత పరిహారం అవుతుంది…. అనే అంచనాల లెక్కలు కడుతున్నారు. ఇప్పటికే చెల్లించిన పరిహారంతోపాటు, మరో రూ.3000 కోట్లు చెల్లిస్తే పోలవరంలో 48 మీటర్ల వరకు నీటిని నిల్వ చేయవచ్చని ఏపీ ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. గ్రావిటీ ద్వారా కాలువలకు నీటిని విడుదల చేసి చేతులు దులిపేసుకునే ఆలోచన చేస్తున్నారని రైతు సంఘాల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రంలో ప్రభుత్వం మారితేనే సాధ్యమా?
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా పోలవరం ప్రాజెక్టు పూర్తి వ్యయం చెల్లించే అవకాశం లేదని తెలుస్తోంది. ఎలాగూ బీజేపీ ఏపీలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. పోలవరం పూర్తి చేసినా, ప్రత్యేక హోదా ప్రకటించినా ఏపీలో బీజేపీ అభ్యర్థులు కనీసం కార్పొరేటర్ గా కూడా గెలిచే అవకాశం కనిపించడం లేదు. అందుకే ఏపీకి ఎలాంటి ప్రయోజనాలు ఇచ్చినా ఇక్కడ బీజేపీ లేచే పరిస్థితి లేదు కనుక కేంద్ర పెద్దలు ఏపీకి రిక్తహస్తం చూపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇక కేంద్రంపై పోరాటం చేయాల్సిన అధికార వైసీపీ- బీజేపీతో చేతులు కలిపింది. ఇక కేంద్రాన్ని నిలదీసేవారే లేకుండా పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టుకు పూర్తి పరిహారం చెల్లించేందుకు కేంద్రం ముందుకు వస్తుందని భావించలేమని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
Also Read ;- పోలవరంపై హైకోర్టులో పిల్..