పాలనలో ప్రజలకు చుక్కలు చూపిస్తూ.. వారి నుంచి అందినకాడికి దోచుకుంటున్న జగన్.. పార్టీలోనూ అంతే కమర్షియల్ గా వ్యవహరిస్తున్నారు. పవిత్రంగా భావించాల్సిన రాజకీయ పార్టీని అడ్డుపెట్టుకొని లోక్ సభ స్థానాల టికెట్లను థియేటర్ లో బ్లాక్ టికెట్ల మాదిరిగా అమ్మకానికి రెడీ అయ్యారు. వైఎస్ఆర్ సీపీలో కొన్ని లోక్‌సభ స్థానాల టికెట్లు కావాలంటే పార్టీ పెద్దలు డిమాండ్ చేస్తున్న నంబర్ విని ఆశావహులు అవాక్కవుతున్నారు. పోటీ కాస్త ఎక్కువ ఉండడం వల్లే.. ఖరీదు మరీ పెంచేస్తు్న్నారని అంచనా. మరీ ఎక్కువ రేటు చెబుతుండడం వల్ల ఇప్పటికే కొంత మంది పోటీ నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
అయితే, కొంత మంది పార్టీ వర్గాలు విశ్వసనీయంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఎన్నికల్లో లోక్‌సభ సీట్ల పరిధిలో ఒక్కో సెగ్మెంట్‌కు ఎన్నికల ఖర్చు కోసం అని చెప్పి ఒక్కో సీటుకు రూ.5 కోట్ల దాకా వసూలు చేసేవారు. ఈసారి దానికి దాదాపు నాలుగు రెట్లు చెబుతున్నట్లు సమాచారం. ఒక్క లోక్ సభ స్థానానికి అంత ఖర్చు చెబుతుండడంతో అధికార వైఎస్ఆర్ సీపీలో ఇప్పుడది హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఆ పార్టీ ఎంపీలు ఢిల్లీలో పార్లమెంటు సమావేశాల సందర్భంగా కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఇదే చర్చించుకుంటున్నట్లు తెలిసింది. ఒకప్పుడు ఎంపీ అంటే ఉండే విలువ, పలుకుబడి ఇటీవలి కాలంలో లేవని.. కేంద్రంలో ఏ మంత్రినీ నేరుగా కలిసే అవకాశం లేదని వారు మాట్లాడుకుంటున్నారు.
తాజా విశ్లేషణల ప్రకారం.. ఏపీలో ఉన్న 25 లోక్‌సభ స్థానాల్లో దాదాపు 15 చోట్ల కొత్తవారిని వైసీపీ ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఉంది. కొంత మంది సిట్టింగ్ ఎంపీలు తాము ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. మరికొందరు ప్రజల్లో వ్యతిరేకత వల్ల అసలు ఎన్నికల్లో నిలబడేందుకు భయపడుతున్నారు. అందుకని ఆ స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం వైసీపీ వెతుకుతోంది. మచిలీపట్నం, రాజంపేట, కడప స్థానాలను సిటింగ్‌లకే కేటాయించే అవకాశం ఉన్నందున.. అవి తప్ప.. రిజర్వ్‌డ్ స్థానాలైన బాపట్ల, తిరుపతి, చిత్తూరులతోపాటు బలహీనవర్గాలకు ఇవ్వాలనుకుంటున్న కర్నూలు, అనంతపురం, హిందూపురం వంటి చోట్ల పార్టీ ఫండ్ అడిగే పరిస్థితి కనిపించడం లేదు. నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు, నంద్యాల నుంచే ఎన్నికల ఖర్చు పేరుతో అభ్యర్థుల నుంచి వీలైనంత నొక్కాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
తమ లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి ఏదైనా కేంద్రం ఆధీనంలోని పని చేయించుకోవాలంటే.. లోక్‌సభాపక్ష లీడర్‌నో, పార్లమెంటరీ పార్టీ లీడర్‌కో చెప్పాలి. అసలే తీరిక లేకుండా ఉండే వారితో చెప్పి పనులు చేయించుకోవడం కాని పని. కేంద్రంలోని అధికార పార్టీకి అనుకూలంగా ఓటేయటానికి తప్ప కేంద్రాన్ని ఏ ఒక్క విషయంలోనూ డిమాండ్ చేసేది కూడా ఉండదు. సాధించేది ఏమీ ఉండదు. చివరికి పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన వాటిపై చర్చించేందుకు సీఎం ఆధ్వర్యంలో నిర్వహించే ఎంపీల మీటింగ్‌లు కూడా కొంత కాలంగా జరగట్లేదు. ఈ మాత్రం దానికి అంత ఖర్చు పెట్టి ఎంపీ టికెట్ పొందడం ఎందుకనే భావన చాలా మందిలో ఉంది. ఒకవేళ పొందినప్పటికీ జగన్ పైన ప్రజా వ్యతిరేకత వల్ల గెలిచే అవకాశాలు కూడా మరీ సన్నగిల్లడం ఖాయం అనే అభిప్రాయంలో వారు ఉన్నారు.











