ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి జీవనాడి, ప్రజల ప్రాణనాడి పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..మరో 10ఏళ్లకైనా ప్రాజెక్టు పూర్తవుతుందా అనే సందేహాలు సర్వత్రా నెలకొన్నాయి.. 4ఏళ్లలో కనీసం 4% పనులు పూర్తి చేయకుండా ఏ ముఖం పెట్టుకుని పోలవరం వెళ్తున్నాడని రైతులు, ఇతర వర్గాల ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి..
టిడిపి ప్రభుత్వం 5ఏళ్లలో పోలవరం నిర్మాణం ఎలా జరిగింది, గత 4ఏళ్లలో ఎలా జరిగింది..? ముఖ్యమంత్రిగా చంద్రబాబు పోలవరానికి ఇచ్చిన ప్రాధాన్యతలో వందోవంతు కూడా జగన్మోహన రెడ్డి ఇవ్వలేదనేది కఠోర సత్యం. సీఎంగా చంద్రబాబు 28సార్లు పోలవరం సందర్శిస్తే అదే జగన్మోహన్ రెడ్డి ఈ 4ఏళ్లలో ఎన్నిమార్లు వెళ్లారు..? ప్రాజెక్టు పనులపై వర్ట్యువల్ విజిట్స్ 40సార్లు, సమీక్షలు 63సార్లు చంద్రబాబు జరిపింది గుర్తు చేసుకుని జగన్మోహన రెడ్డిలో ఆ స్ఫూర్తి ఏమైందని ప్రజలే నిలదీస్తున్నారు.. ఫీల్డ్ విజిట్స్ , వర్ట్యువల్ విజిట్స్ గాలికొదిలేశారు, ఏడాదికోమారు మొక్కుబడి సమీక్షే తప్ప ఏనాడూ పోలవరం నిర్మాణ పనులపై శ్రద్ద పెట్టిన పాపాన పోలేదు. ఎంతసేపూ పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి, దానికన్నా ఎత్తుగా తండ్రి రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టాలనే ఆరాటమే తప్ప ఎంత తొందరగా పనులు పూర్తిచేద్దామనే ఆలోచనే లేదు..
పోలవరం ప్రాజెక్టు ఏపి రైతుల 80ఏళ్ల కల..భద్రాచలం రాముడి పాదాలను బ్యాక్ వాటర్ తాకుతుందనే అప్పట్లో దీనికి ‘‘రామపాద సాగర్’’ అని పేరెట్టారు..43ఏళ్ల క్రితమే అప్పటి సీఎం అంజయ్య దీనికి శంకుస్థాపన చేశారు.. 19ఏళ్ల క్రితం అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి కాలువ తవ్వకం పనులు ప్రారంభించారు. జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశారని, క్విడ్ ప్రో కో ముడుపులపై ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి జైలు పాలయ్యాడే తప్ప డ్యామ్ పై యూనిట్ కాంక్రీట్ వేయలేదు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టాకే పోలవరం పనులు ముమ్మరం అయ్యాయి..
ఏడున్నర లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు, 540గ్రామాలకు తాగునీరు, విశాఖపట్నం, అనకాపల్లి పరిశ్రమలకు నీటి వసతితో పాటు, 960మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో పాటుగా, గోదావరి డెల్టా 10లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, గోదావరి-కృష్ణా అనుసందానంతో కృష్ణా డెల్టా 13లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ వంటి అనేక ప్రయోజనాలున్న బహుళార్ధ సాధక ప్రాజెక్టు పోలవరం..
8 దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టు రాష్ట్ర విభజన దరిమిలా జాతీయ ప్రాజెక్టుగా మారిన నేపథ్యంలో మళ్లీ ప్రాణం పోసుకుంది. ఏపి పునర్విభజన చట్టం సెక్షన్ 90 సబ్ సెక్షన్ 1 కింద పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది, సబ్ సెక్షన్ 4ప్రకారం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదే.
7ముంపు మండలాలను ఏపిలో విలీనం చేస్తేనే సీఎంగా ప్రమాణం చేస్తానని చంద్రబాబు పట్టుబట్టి మరీ నరేంద్రమోడీ తొలి కేబినెట్ భేటిలో పోలవరం ఆర్డినెన్స్ వచ్చేలా చేయడం, పార్లమెంటు తొలి సెషన్స్ లోనే పోలవరం అథారిటీ చట్టం చేయించడంతో ఆరంభ ఆటంకాలన్నీ తొలిగాయి. అప్పట్లో కోర్టు కేసులు వేసినోళ్లతో మాట్లాడి విరమించేలా ఒప్పించడం, గతంలో కాంట్రాక్టర్ కే పనులు అప్పగించి భవిష్యత్తులో మళ్లీ కోర్టు కేసులు ఎదురుకాకుండా చొరవ తీసుకోవడం వల్లే ప్రాజెక్టు పనులు పుంజుకున్నాయి. 24గంటల్లోనే రూ 610కోట్లు పరిహారం విడుదల చేయడంలో, నాబార్డు రుణం తేవడంలో, రుణబాధ్యత 100% కేంద్రమే తీసుకునేలా చేయడంలో చంద్రబాబుదే క్రియాశీల పాత్ర. ఇరిగేషన్ కాంపోనెంట్ 100% పూర్తిగా కేంద్రమే భరిస్తుందని 2017మార్చి 15 కేంద్ర కేబినెట్ పేర్కొనడం విదితమే.
2016 డిసెంబర్ 29న చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 2017 జనవరి 7న డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించారు. జనవరి 17న స్పిల్ వే గేట్ల పనులు ప్రారంభించారు. ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చుకున్నారు, వారంవారం ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు.. ఫీల్డ్ విజిట్స్, వర్ట్యువల్ విజిట్స్, ఎప్పటికప్పుడు సమీక్షలతో నిర్మాణ పనులను పరుగులు తీయించారు. 24గంటల్లో 32,500 క్యూ మీటర్ల కాంక్రీటు వేయడం అప్పట్లోనే గిన్నెస్ రికార్డు.. రోజుకు రెండున్నర లక్షల క్యూమీ మట్టి తొలగించడం మరో రికార్డు. ప్రపంచంలోనే ఏ ప్రాజెక్టుకు లేనంత పెద్దగేట్లు 16 x 20 కొలతలతో చేయించారు.
ఎక్కడ ఒక్కరోజు పని ఆగితే రూ 21కోట్ల నష్టం వస్తుందనే ఆదుర్దాతో ప్రాజెక్టు పనులెక్కడా ఆగకుండా చంద్రబాబు పరుగులు తీయించారు. 111 ఎక్స్ కవేటర్లు, 522భారీ యంత్రాలు, వేలాది టిప్పర్లు, ప్రొక్లెయిన్లు, జెసిబిలతో, వేలాది కార్మికులు, అధికారులు, సిబ్బందితో ప్రాజెక్టు నిర్మాణ స్థలం తిరునాళ్లలా కోలాహలంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు పోలవరం పరిసరాలన్నీ కళావిహీనంగా మారాయి, అప్పటి పనుల సందడి మచ్చుకి కూడా లేదు.
జగన్మోహన్ రెడ్డి సిఎం కాగానే తొలి 6నెలలు పనులన్నీ ఆపేయడం ఒక తప్పు, అసత్య ఆరోపణలతో టెండర్లు రద్దు చేయడం మరో తప్పు, ప్రాజెక్టు ఎత్తు 1మీ తగ్గించమన్న తెలంగాణ సిఎం కేసిఆర్ మాటలను ఖండించక పోవడం ఇంకో తప్పు, అంచనా వ్యయం కుదించడం, ప్రాజెక్టు ఎత్తు 4.57మీటర్లు తగ్గించడం, దానికి తొలిదశ అనే ముసుగేయడం అన్నీ తప్పుల మీద తప్పులే..
గత 4ఏళ్లలో నిర్వాసితుల పునరావాసం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే..277ముంపు గ్రామాల్లో 44,574 కుటుంబాలకు చెందిన నిర్వాసితులు 1,77,594 మంది..వీరిలో ఎస్సీలు 25,782మంది, ఎస్టీలు 94,370మంది..వీరి పునరావాసం కోసం చేసిన ఖర్చు రూ 6,371కోట్లు కాగా ఇంకా రూ 26,796కోట్లు చెల్లించాలి. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిర్వాసితుడికి రూ 10లక్షల పరిహారం జగన్ రెడ్డి చెల్లించాల్సిందే..
ప్రాజెక్టు పూర్తికి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన డెడ్ లైన్ లు ప్రజల్లో అభాసు పాలయ్యాయి. .. 2020మార్చికల్లా పూర్తి అన్నారు..ఖరీఫ్ అన్నారు, రబీ అన్నారు..జూన్ అన్నారు, డిసెంబర్ అన్నారు..2022 ఖరీఫ్ అన్నారు..4ఏళ్లలో ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు మారారు..ఇప్పుడు ఏకంగా 2025 అంటే కేంద్రమే మొట్టికాయలేసి 2024కల్లా పూర్తి చేయాల్సిందేనని ఖరాఖండీగా చెప్పింది.
ప్రాజెక్టు అంచనా వ్యయం రూ 57,970కోట్లకు ఆమోదించాలని అప్పటి సిఎం చంద్రబాబు చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు, దీనిపై కేంద్రానికి అనేక లేఖలు రాశారు.. రూ 55,548కోట్లకు టిఏసి ఆమోదించిన విషయం గుర్తుచేశారు. సిడబ్ల్యుసి, పిపిఏ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ టిఏసి అడిగినప్పుడల్లా లక్షలాది డాక్యుమెంట్లు రైళ్లలో కేంద్రానికి పంపారు. 2017-18 ఎస్టిమేట్ల ప్రకారం ప్రాజెక్టు పూర్తికి రూ 55,548కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. 2013 భూసేకరణ చట్టం తీసుకొచ్చామని, దీని ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పెరిగిందని, వీటన్నింటికీ కేంద్రమే ఇస్తుందని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో 2014 ఫిబ్రవరి 20న స్పష్టంగా పేర్కొనడం తెలిసిందే. అలాంటిది అంచనా వ్యయంలో కేంద్రం కోతలు వేస్తున్నా సీఎం జగన్మోహన రెడ్డి కిమ్మనకుండా ఉండటం శోచనీయం..
దేశంలో 10రాష్ట్రాల్లో 15జాతీయ ప్రాజెక్టుల పనులు నత్తనడకన జరిగినా, 2016-19మధ్య పోలవరం ప్రాజెక్టు పనులు మాత్రం పరుగులు తీశాయి, ఆ 3ఏళ్లలోనే 72% పనులు జరగడం విశేషం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో(2014-19) పోలవరం నిర్మాణానికి చేసిన వ్యయం రూ 10,861కోట్లు కాగా, గత 4ఏళ్లలో జగన్మోహన రెడ్డి చేసిన వ్యయం అందులో సగం కూడా లేదు..టిడిపి ప్రభుత్వం ఏడాదికి రూ 2వేల కోట్లు పైన పోలవరానికి ఖర్చుచేస్తే వైసిపి ప్రభుత్వం చేసింది అందులో మూడోవంతే..
ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన రెడ్డి పోలవరం అంచనాల పెంపుపై చేసిన అవినీతి ఆరోపణలు అన్నీఇన్నీ కావు.. టిడిపి అవినీతి వల్లే అంచనాలు పెరిగాయని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక అవే అంచనాలను ఆమోదించాలని లేఖలు రాయడం తెలిసిందే, దానిని బట్టే ఆయన ఆరోపణలు అసత్యాలని తేలిపోయింది. పోలవరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని, జగన్మోహన్ రెడ్డి మీడియా, వైసిపి నాయకులు చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని కేంద్రమే చెప్పింది.
జగన్నాటకాలకు పోలవరం ప్రాజెక్టు బలి అయ్యింది..రివర్స్ టెండరింగ్ ఒక బూటకం, దీనితో రూ 800కోట్లు ఆదా చేశామని చెప్పి, 6నెలలు పనులు ఆపేసి రూ 8వేల కోట్ల నష్టం చేశారు, ఎవరిపైనేతే ఆరోపణలు చేశారో, వాళ్లకే మళ్లీ పనులు అప్పగించారు.
ప్రాజెక్టు ఎత్తుతో కూడా జగన్ ఆడుకుంటున్నారు..తొలిదశ, మలిదశ అని జగన్నాటకానికి తెరదీశారు. ‘‘పోలవరం 1మీటరు లెవల్ తగ్గిపోతే పెద్ద మునిగేదేముందని నేను జగన్మోహన్ రెడ్డికి చెప్పాను, అందుకాయన సుముఖంగానే ఉన్నారని’’ తెలంగాణ సిఎం కేసిఆర్ చెప్పినప్పుడే ప్రజల్లో అనేక అనుమానాలు ప్రబలాయి. పోలవరం ఎత్తును 45.72మీ నుంచి 41.15మీ కు తగ్గిస్తారనే ప్రచారానికిది ఊతమిచ్చింది. ఆ తర్వాత చెలరేగిన విమర్శల నేపథ్యంలో దీనిని తొలిదశగా చెప్పి మసిబూసి మారేడుకాయ చేశారు. 41.15మీటర్ల వరకు మొదటి దశ అని, 41.15మీ నుంచి 45.72మీ వరకు రెండవ దశ అని చెప్పడంపై కూడా సందేహాలు ఉన్నాయి.. పోలవరం ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 45.72మీ(150అడుగులు)గా బచావత్ ట్రిబ్యునల్ ఆమోదించిందనేది గమనంలోకి తీసుకోకుండా తొలిదశ అని, రెండవ దశ అని జగన్నాటకాలు ఆడటం వివాదాస్పదం అవుతోంది. పునరావాసం ఎగ్గొట్టడానికి, నిర్వాసితులను గాలికి వదిలేయడానికే ఈ రెండు దశల నాటకం ప్రారంభించారనే విమర్శలు కూడా ఉన్నాయి.
జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచి ప్రాజెక్టు నిర్మాణంపై అలసత్వం, మొదటి 6నెలలు పనులన్నీ ఆపేయడం కారణంగానే 2019, 2020 భారీవరదలకు డయాఫ్రంవాల్ దెబ్బతింది. తాము చేసిన తప్పిదాలను కప్పిపెట్టడానికే దీన్ని గత ప్రభుత్వానికి ముడిపెట్టి రాజకీయ లాభాల కోసమే అసత్య ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల పూర్తిపై దృష్టి పెట్టకుండా కమిషన్ల కోసమే రూ 913కోట్లతో పోలవరం ఎత్తిపోతల పథకం చేపట్టారనే ఆరోపణ కూడా ఉంది.
31మంది ఎంపిలుండీ(22మంది లోక్ సభ, 9మంది రాజ్యసభ) కేంద్రంపై ఒత్తిడిచేసి పోలవరానికి నిధులు రాబట్టడంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారు..టిడిపి 5ఏళ్లలో 72%పనులు చేస్తే ఈ 4ఏళ్లలో 5%పనులు కూడా చేయకపోవడం ఘోర వైఫల్యం..ఈ రీతిన పనుల్లో జాప్యం చేస్తే ఇంకెప్పటికి ప్రాజెక్టు పూర్తయ్యేనో, అప్పటికీ అంచనా వ్యయాలు ఎంతమేర పెరుగుతాయో, దానిపై కేంద్రం స్పందన ఎలాఉంటుందో, పొరుగు రాష్ట్రాల తీరెలా మారుతుందో అనే ఆందోళనలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఉంది. 2019లో తెలుగుదేశం ఓడిపోకుండా ఉంటే ఈపాటికే పోలవరం పూర్తయ్యేదనేది మాత్రం అక్షర సత్యం. దానివల్ల తామేం కోల్పోయామో తెలుసుకునేటప్పటికే జరగాల్సిన డేమేజి రాష్ట్రానికి, భావితరాలకు జరిగిపోయింది.
బిగ్ బ్రేకింగ్.. లోకేష్ అరెస్ట్ పై ఫుల్ అప్డేట్..!
కాకరేపుతున్న అక్రమ కేసులు..! తెలుగు దేశంపార్టీ అధినేత నారా చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్...