రాజకీయ పార్టీలకు విరాళాలు రావడం మామూలే. అన్ని పార్టీలు ఈ డొనేషన్ల మీదనే ఎక్కువగా ఆధారపడి మనుగడ సాగిస్తుంటాయి. అయితే, ఈ విరాళాల విషయంలో అవకతవకలు జరగకుండా ఉండడానికి ఎన్నికల సంఘం ఓ కన్నేసి ఉంచుతుంది. ప్రతి ఏడాది విరాళాలకు సంబంధించిన లెక్కలను వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించాలి. తాజాగా వైఎస్ఆర్ సీపీ ఎన్నికల సంఘానికి ఇచ్చిన వివరాల్లో ఎన్నో అనుమానాలు బయటపడ్డాయి. ఆ పార్టీకి విరాళాలన్నీ అత్యంత గోప్యంగా వచ్చాయట. సక్రమంగా వచ్చిన వాటిలో కేవలం రూ.30 వేలు మాత్రమే ఉండడం గమనార్హం.
ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్ సీపీ ట్రెజరర్ పి.క్రిష్ణమోహన్ రెడ్డి విరాళాల వివరాలను సమర్పించారు. ఆ సమాచారం ప్రకారం.. 2022-23 ఏడాదిలో వైఎస్ఆర్ సీపీకి రూ.68 కోట్ల 30 వేలు డొనేషన్ల రూపంలో అందాయి. ఈ మొత్తంలో రూ.30 వేలు మాత్రమే ఓ దాత పేరుతో పార్టీకి అందినట్లుగా పేర్కొన్నారు. అతని పేరు కడప జిల్లాకు చెందిన పోచింరెడ్డి సుబ్బారెడ్డి. అయితే, విరాళంగా వచ్చిన మిగిలిన రూ.68 కోట్లు సొమ్ము ఎవరి ద్వారా వచ్చిందో పేర్కొనలేదు. దీనిపైనే ప్రస్తుతం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే తెలుగుదేశం పార్టీకి వచ్చినవన్నీ బహిరంగ విరాళాలే ఉంటాయి. ఎవరెవరు ఎంతెంత ఇచ్చారో అన్ని వివరాలూ వారు పబ్లిక్ డొమైన్ లో పెట్టుకుంటారు. అవే వివరాలు ఎన్నికల సంఘానికి ఇస్తుంటారు.
కానీ, వైఎస్ఆర్ సీపీ గుప్త నిధుల గుట్టు తాజాగా బయటకు వచ్చింది. పొలిటికల్ పార్టీలకు డొనేషన్లు రహస్యంగా ఇవ్వాలనుకుంటే వారికి కేంద్ర ప్రభుత్వం రెండు మార్గాలు ఏర్పాటు చేసింది. ఎస్‌బీఐ నుంచి ఎలక్టొరల్ బాండ్స్ కొనుక్కోవడం ఒక పద్ధతిగా ఉంటుంది. ఆ బాండ్లపై ఎవ్వరి పేరూ ఉండదు. ఆ బాండ్లను కొని తమకు నచ్చిన పార్టీకి ఇచ్చే వెసులుబాటు విరాళం ఇచ్చేవారికి ఉంటుంది. ఆ బాండ్లు అందిన పార్టీ తన అకౌంట్ లో వేసుకుంటుంది. ఈ పద్ధతి ద్వారా వైఎస్ఆర్ సీపీకి ఏకంగా రూ.52 కోట్లు విరాళం వచ్చింది. ప్రుడెంట్ ట్రస్ట్ పేరుతో పార్టీలకు విరాళం ఇచ్చే మరో పద్ధతి ఉండగా.. ఈ మార్గంలో వైఎస్ఆర్ సీపీకి రూ.16 కోట్లు వచ్చాయి. ఈ విరాళాలు ఎవరు ఇచ్చారో ఎవరికీ తెలియదు. చెప్పాల్సిన అవసరం లేకుండానే వాటికి పార్టీలకు ఇచ్చే వెసులుబాటు ఉంది. ఇలా వైసీపీకి రూ.68 కోట్లు వచ్చాయి. ఇవి జగన్ ప్రభుత్వం వల్ల లబ్ధిపొందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఇచ్చారా? లేక కాంట్రాక్టర్లు ఇచ్చారా అనేది కూడా ఎవ్వరికీ తెలియదు.
వైఎస్ఆర్ సీపీ విరాళాల పరిస్థితి ఇలా ఉంటే.. టీడీపీకి వచ్చిన విరాళాలు మాత్రం చాలా ట్రాన్స్‌పరెంట్ గా ఉన్నాయి. టీడీపీ ప్రధాన కార్యదర్శి రాజు నాయక్ ఈసీకి ఇచ్చిన విరాళాల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో టీడీపీకి రూ.11,92,39,000 విరాళాలు వచ్చాయి. వీటిలో గోప్యంగా ఉండే ఎలక్టొరల్ బాండ్లు, ప్రుడెంట్ ట్రస్టు బాండ్లు ఏమీ లేవు. అన్నీ దాతల నుంచి బహిరంగంగా వచ్చినవే. 193 మంది దాతలు ఈ మొత్తం విరాళంగా ఇచ్చారు. ఏ వ్యక్తి ఎంత మొత్తం విరాళంగా ఇచ్చారో వారి పేర్లు, అడ్రస్ లను కూడా టీడీపీ ఎన్నికల సంఘానికి ఇచ్చింది. వైఎస్ఆర్ సీపీకి విరాళం ఇచ్చిన వారిలో రూ.30 వేలు ఇచ్చిన ఒక వ్యక్తి తప్ప, మిగతా వారు ఎవరో తెలియట్లేదు. టీడీపీ వివరాలు మాత్రం సవిరంగా ఉన్నాయి. కానీ, విరాళాలు ఇచ్చిన దాతల వివరాలు మాకు ఇవ్వండని ఇటీవల ఏపీ సీఐడీ ఇటీవల టీడీపీకి నోటీసులు జారీ చేసింది. కానీ, వైఎస్ఆర్ సీపీకి మాత్రం ఏ నోటీసులూ ఇవ్వలేదు. దీనిని బట్టే కక్ష్య సాధింపు రాజకీయం అధికార పార్టీకి ఏ స్థాయిలో ఉందో అర్థం అయిపోతోంది.