జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. జగన్ కటౌట్‌తో ప్రెస్ మీట్ నిర్వహించారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. వైసీపీ సభలలో పవన్, చంద్రబాబు, లోకేష్ ఫోటోలతో సభలు నిర్వహించడాన్ని నాదెండ్ల తప్పు పట్టారు. అందుకే తాను ఇలా వినూత్నంగా జగన్ ఫోటోలతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశానని తెలిపారు. దీంతో ఇది బాగా చర్చనీయాంశం అవుతుండడమే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా ఇది బాగా వైరల్ అవుతోంది.
జనసేన ప్రెస్ మీట్ లో ఓ చైర్ ను ఖాళీగా ఉంచి అందులో ముఖ్యమంత్రి జగన్ ఫొటో పెట్టి ప్రెస్ మీట్ కొనసాగించడం వైసీపీకి కౌంటర్ ఇవ్వడమేనని అంతా అంటున్నారు. దీనంతటికీ మూలం వైఎస్ఆర్ సీపీ మూకలు చేసిన పనుల వల్లే. మొన్న భీమిలిలో ముఖ్యమంత్రి జగన్ భారీ బహిరంగ సభ నిర్వహించినప్పుడు వారు ఇదే పని చేశారు. కాస్త వ్యగ్యం ప్రదర్శించారు. ఈ సభ ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టి దాని ముందు వైసీపీ నాయకులు బాక్సింగ్ బ్యాగ్ ఏర్పాటు చేశారు. సభకు వచ్చిన వైసీపీ శ్రేణులు కొందరు పవన్ కల్యాణ్ బొమ్మ ముందు పెట్టిన బాక్సింగ్ బ్యాగ్ తో బాక్సింగ్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
భీమిలీలో వైసీపీ ఏర్పాటు చేసిన ‘సిద్ధం’ సభలో అసలు విషయం మాట్లాడకుండా పైశాచిక ఆనందం పొందారు. మరోసారి ప్రజలు అవకాశం కల్పిస్తే ఏ విధంగా పాలన చేస్తామో, అవి చెప్పకుండా.. జగన్ సంస్కారం మరిచారు. ఆ సభలో పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కటౌట్లకు పంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేయడం.. ఆ బ్యాగులను వైసీపీ నేతలు బాక్సింగ్ చేయడం.. ఒక పైశాచికం అని జనసేన, టీడీపీ నేతలు ఆరోపించారు. ఏపీ రాజకీయాల్లో ఎఫ్పుడూ లేని విధంగా చేసిన సీఎం చర్యలను తాము ఖండిస్తున్నామని వారు పేర్కొన్నారు.
తాజా ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి జగన్ పై నాదెండ్ల మనోహర్ విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఏనాడు మీడియా ముఖం చూడరని మనోహర్ ఎద్దేవా చేశారు. అందుకే తాము ముఖ్యమంత్రిని మీడియా ముందుకు తీసుకువచ్చామని ఎగతాళి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల లెక్కలపై చర్చించడానికి తాము సిద్దమని, మీరు సిద్దంగా ఉన్నారా అని సీఎం జగన్ ఫోటో చూస్తూ మీడియా ముఖంగా ప్రశ్నించారు. జగన్ ఇష్టారీతిన సభలు పెట్టి, సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపై దాడులు చేయండని ప్రజలను రెచ్చగొడుతున్నారని.. పద్దతి మానుకోవాలని నాదెండ్ల అన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో ఇలాంటి సభలు ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.