శ్రీ వేంకటేశ్వరుడిని కలియుగ దైవం అని ఎందుకన్నారు? అంటే వేంకటేశ్వరుడు కలియుగానికి చెందిన వాడా? అసలు తిరుమల ఎప్పుడు ఏర్పడింది? ఇలాంటి ప్రశ్నలకు అంత తేలిగ్గా సమాధానం దొరకదు.
తిరుమలకు ఎంతటి ప్రాచీనమైన చరిత్ర ఉందన్న దాని మీద ఎన్నో పరిశోధనలు జరిగాయి. అసలు తిరుమల గురించి మన పురాణాలు ఏమంటున్నాయి? శ్రీవేంకటేశ్వురుడి జీవితానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అనే విషయాలను చూద్దాం. మన నిత్య పూజలో సంకల్పం చెప్పేటప్పుడే మనం ఎక్కడి నుంచి ఎక్కడి ప్రయాణించామో వస్తుంది. శ్వేతవరాహ కల్పం, వైవస్వత మన్వంతరం, కలియుగం ప్రథమ పాదే అంటూ కాలం గుర్తులతో మన ప్రయాణాన్ని తెలుసుకుంటాం. ఇక్కడ శ్వేత వరాహ కల్పం ప్రసావన వస్తోంది. తిరుమల గురించి తెలుసుకునే ముందు కల్పం గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
కల్పం అంటే 432 కోట్ల సంవత్సరాల కాలం. మత్స్య పురాణంలో మొత్తం 30 కల్పాల ప్రసావన ఉంది. ఆ ప్రకారం చూస్తే మనం మొదటి కల్పమైన శ్వేత వరాహ కల్పంలోనే ఉన్నామని అనుకోవాలి. ఒక్కో కల్పంలో 14 మన్వంతరాలు ఉంటాయి. ఒక్కో మన్వంతరం లో 71 మహాయుగాలు ఉంటాయి. ప్రతి మహాయుగంలో నాలుగు యుగాలు ఉంటాయి. ఇప్పుడు ఏడో మన్వంతరం అయిన వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగంలో వచ్చే కలియుగంలో ప్రథమ పాదం నడుస్తోంది. లెక్క చాలా పెద్దగానే ఉంది కదూ. ఈ కల్పం ప్రారంభంలోనే భూమి పుట్టింది కాబట్టి అప్పటి మొదటి మహాయుగంలో వచ్చే కృతయుగంలోనే తిరుమల ఆవిర్భవించి ఉండటానికి ఆస్కారముంది.
వేంకటేశుడు ఏ యుగం వాడు?
పరీక్షిత్తు మహారాజు మరణానికి కశ్యప మహాముని శాపం ఆపలేకపోయిందనే విషయం అందరికీ తెలుసు. ఆయన పాపనాశం తీర్థంలో స్నానం చేసి పరిహారం పొందారని మనం చదువుకున్నాం. ఆ ప్రకారం చూస్తే కలియుగం ప్రారంభ సమయానికే తిరుమల ఉన్నట్లు అర్థమవుతోంది. ద్వాపర యుగంలోనూ తిరుమలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. పాప పరిహారం కోసం పాండవులు తిరుమలలో స్నానం చేశారని మనం మహాభారతంలో చదువుకున్నాం. అక్కడ వారికి భరద్వాజ మహర్షి సువర్ణముఖి నదికి ఎంతటి ప్రాశస్త్యం ఉందో అర్జునుడికి వివరించారు. అగస్త్య మహాముని గురించి కూడా వివరించారు.
స్కంద పురాణం వైష్ణవ ఖండంలో ఆ వివరాలు ఉన్నాయి. దీని ప్రకారం ద్వాపర యుగం నాటికే వేంకటాచలం ఉందని అర్థమవుతోంది. ఇంకా వెనక్కి వెళితే త్రేతా యుగం వస్తుంది. అంటే శ్రీరాముడి అవతారం ఉన్న యుగం. రావణుడి బారి నుంచి తమను రక్షించమని మునులంతా వేంకటాచలానికి వెళతారు. అక్కడ శ్రీనివాసుడు వారికి అభయమిస్తాడు. దశరథుడు పుత్ర సంతానం కోసం యాత్రలు చేస్తూ వేంకటా చలానికి వెళ్లగా అక్కడ వశిష్ఠుడితో పుత్రకామేష్టి యాగం చేయించాల్సిందిగా శ్రీనివాసుడు ఆదేశిస్తాడు. అక్కడే ఉన్న అంజనాద్రిపై పుత్ర సంతానం కోసం తపస్సు చేస్తున్న అంజనా దేవికి ఆంజనేయుడు కలగడం కూడా అలాంటిదే. ఈ వివరణలన్నీ చూస్తే త్రేతాయుగంలోనూ శ్రీనివాసుడి లీలా విశేషాలు కనిపిస్తాయి.
త్రేతాయుగం కన్నా ముందు ఉన్నది కృతయుగం. దీన్నే సత్యయుగం అని కూడా అంటారు. శ్రీనివాసుడు కృతయుగంలోనూ ఉన్నాడనటానికి ఆధారాలు కనిపిస్తాయి. కృతయుగం ప్రారంభం లోనే దృడమతి అనే వ్యక్తి పాపనాశనంలో స్నానం చేసి పునీతుడవుతాడు. అలాగే భద్రమతి అనే బ్రాహ్మణుడి దరిద్రం పాపనాశనం లోనే తొలగిపోతుంది. ఈ ఆధారాల ప్రకారం కృతయుగంలోనూ వేంకేటేశుడు ఉన్నట్లు స్పష్టమవుతుంది. అసలు వేంకటా చలం ఆవిర్భావం ఎప్పుడు జరిగింది అనేది తెలియాలంటే వరాహ పురాణం చదివి తీరాల్సిందే. దీని ప్రకారం చూస్తే 28వ మహాయుగంలోనే శ్రీనివాసుడు ఉన్నాడనుకోవచ్చు.
శిలాతోరణం చూస్తే ఏం తెలుస్తుంది?
వరాహ పురాణం ప్రకారం సృష్టి ప్రారంభంలోనే వరాహస్వామి నీటి నుంచి భూమిని బయటికి తెచ్చి సృష్టిని ప్రారంభించాడని, ఆ తర్వాతే వేంకటాచలంపై ఇప్పటి స్వామి అవతారం స్వామివారి పుష్కరిణి పక్కన శాశ్వత నివాసం ఏర్పరచుకున్నాడని తెలుస్తోంది. దానికి నిదర్శనం అక్కడ ఉన్న పుష్కరిణికి పడమరన ఉన్న వరాహ స్వామి ఆలయం. ఇది జరిగి 200 కోట్ల సంవత్సరాలు అయి ఉంటుందని అంచనా. దానికి రుజువు ఏమిటి? అని ప్రశ్నించవచ్చు. తిరుమల కొండపై సహజసిద్ధంగా ఏర్పడిన శిలాతోరణాన్నిపరిశీలించాక ఒక అంచనాకి వచ్చారు. కార్బన్ డేటింగ్ అనే ప్రక్రియ ద్వారా ఈ శిలాతోరణాన్ని పరిశీలించి దీని వయసు 200 బిలియన్ సంవత్సరాలుగా తేల్చారు.
అసలు శ్రీనివాసుడు ఈ కొండపై ఎంతకాలం ఉంటాడు అనే ప్రశ్న కూడా ఒకటి. వరాహ స్వామి అనుమతితోనే శ్రీనివాసుడు తిరుమలలో కొలువుదీరాడు. తనకు ఆ అవకాశం ఇచ్చినందుకే తనను దర్శనం చేసుకోవడానికన్నా ముందు దర్శనం చేసుకునే భాగ్యాన్ని వరాహ స్వామికి కల్పించాడని వేంకటాచల మహత్యంలో ఉంది. దీనికి ఆధారంగా వరాహస్వామి సన్నిధిలో ప్రథమ దర్శన అనుమతి పత్రం కూడా ఉంది. దీన్ని కుభేర యంత్రం అని, భైరవ యంత్రం అని అంటున్నారు. ఆ తర్వాత వైవస్వత మన్వంతరం లోని 28 వ మహాయుగం లోని కృతయుగంలో శ్రీ మహా విష్ణువు వేంకటేశ్వరుడిగా పుష్కరిణికి దక్షిణాన అవతరించాడని అంటారు.
కొన్ని వేల సంవత్సరాలు ఆయన రహస్యం గా యోగముద్రలో ఉన్నారని, ఆ తర్వాత అగస్త్య ముని తపోఫలం గా పుష్కరిణికి సమీపంలో దక్షిణాన చింతచెట్టు, సంపెంగ చెట్టు మధ్యలో కల పుట్టలో నుంచి దర్శనం ఇచ్చాడని కూడా చెబుతుంటారు. శ్రీ వేంకటేశ్వరుడి చరిత్రను అనంత ఆళ్వారులు రాశారు. దాని ప్రకారం చోళరాజు సువీరుడి కొడుకు సుధర్ముడి మొదటి కుమారుడైన ఆకాశరాజు పద్మావతిని శ్రీనివాసుడు వివాహం చేసుకుంటాడు. రెండో కుమారుడైన తొండమానుడు ఆనంద నిలయం అనే ఆలయాన్ని కట్టించాడని అంటుంటారు.
tiఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు, మరికొందరు తిరుమల ఆలయాన్ని అభివృద్ది చేయడానికి కృషి చేశారు. వికృతి నామ సంవత్సరం ఆశ్వనీ నక్షత్రయుక్త పాడ్యమి గురువారంనాడు ఆనంద నిలయంలోకి స్వామి వారు ప్రవేశించారని చెబుతుంటారు. శ్రీనివాసుడికన్నా ముందుగా శ్వేత వరాహకల్పంలో ఆదివరాహ స్వామి తిరుమలపై వెలిశాడని అర్థమవుతోంది. తిరుమల వెనక ఎంతటి చరిత్ర ఉందో అర్థమవుతోంది కదూ.