ఏపీ – తెలంగాణ విభజన సమస్యల గురించి ముఖ్యమంత్రి జగన్ లో కదలిక వచ్చింది. దాదాపు నాలుగున్నర సంవత్సరాల నుంచి ఆ విషయంలో నిద్రావస్థలో ఉన్న ముఖ్యమంత్రి తాజాగా విభజన సమస్యల గురించి పోరాడతామని ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. నవంబర్ 21న కేంద్ర కేంద్ర హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర విభజన అంశాలపై జరగబోయే సమావేశం కోసం సన్నాహక సమావేశాన్ని సోమవారం సీఎం జగన్ నిర్వహించారు. ఏపీ సీఎస్ సహా ఇతర అధికారులతో సీఎం జగన్ సమీక్ష చేశారు.
విభజన కారణంగా ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని.. విభజన జరిగి పదేళ్లు పూర్తయినా చట్టంలోని అంశాలు పరిష్కరించలేదని రివ్యూ మీటింగ్ లో అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదా, పోలవరం నిధుల హామీ ఇంకా నెరవేరలేదని, తెలంగాణ నుంచి ఏపీకి విద్యుత్ బకాయిలు ఇంకా రాలేదని వివరించారు. రైల్వే జోన్, విశాఖ మెట్రో విషయం కూడా సమావేశంలో చర్చించాలని అధికారులకు జగన్ సూచించారు. అప్పుల్లో ఏపీకి 58 శాతం, 42 శాతం తెలంగాణకు కేటాయించారని, కానీ, ఆదాయ పరంగా తెలంగాణకు 58 శాతం ఏపీకి 42 శాతం కేటాయించాలని అన్నారు. 21న జరిగే సమావేశంలో విభజన హామీలను నెరవేర్చాలని కేంద్రాన్ని గట్టిగా కోరాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.
ఇన్నేళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు హామీల కోసం పోరాటం మొదలుపెట్టిన సీఎం జగన్ చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సరిపడ ఎంపీల బలం ఉన్నందున ప్రత్యేక హోదా, విభజన హామీల విషయాల్లో ఇక తాము ఏమీ చేయలేమని చెప్పేసి, ఇక మళ్లీ వాటి ఊసెత్తలేదు. గతేడాది డిసెంబరులో తెలంగాణలోని ఆస్తుల పంపకం విషయంలో ఓసారి జగన్ సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఆస్తులు పంచలేదని.. తెలంగాణలో 1.42 లక్షల కోట్ల ఆస్తులు ఏపీకి ఉన్నాయని.. వెంటనే ఆస్తులు పంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఆ విషయం కూడా ఏడాది గడుస్తున్నప్పటికీ మళ్లీ కదలిక లేదు.
త్వరలో ఏపీలో ఎన్నికలు ఉన్నందున విభజన హామీల సాధనకు తాను ప్రయత్ని్స్తున్నట్లుగా చాటేందుకు చేసే వ్యూహంలా ఇది కనిపిస్తుంది. నాలుగున్నరేళ్లుగా మరుగున పడిపోయిన ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ఇప్పుడు సీఎం జగన్ పోరాటంతో కేంద్రంలో ఏ మాత్రం కదలిక వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.