అధికారం పోవడంతో వైసీపీ నేతలు కుట్రలకు తెరలేపుతున్నారు. బ్లూ మీడియా అండతో రెచ్చిపోతున్నారు. ఇందుకు సంబంధించి వైసీపీ చీఫ్ జగన్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. పార్టీ వేరు, పత్రిక వేరూ కాదు…అందరం కలిసి పని చేయాలి. ప్రభుత్వం గురించి ఏ చిన్న సమాచారం వచ్చినా మన మీడియా ప్రతినిధులు పార్టీ నేతలకు చెప్పాలి. అలాగే…ప్రభుత్వం వైపు నుంచి ఏ తప్పు దొరికినా పార్టీ నేతలు సాక్షి ప్రతినిధులకు చెప్పాలి. దేనినీ వదలొద్దు. ఏది దొరికితే అది కుమ్మేయాలి. ప్రభుత్వాన్ని ఎండగట్టాలని జగన్ వైసీపీ నేతలకూ, తన బ్లూమీడియా ప్రతినిధులకు చెప్పినట్లు సమాచారం.
తప్పొప్పులతో సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని..తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనేది ఆయన ఉద్దేశం. దీంతోపాటు పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవాలనేది వ్యూహం. ఇందుకోసం ఇప్పుడు ప్రత్యేకంగా పార్టీకి, పత్రికకూ మధ్య సమన్వయం పేరుతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తొలివిడతగా గురువారం తిరుపతిలో జగన్ మీడియా ప్రతినిధులు, వైసీపీ నేతల సమావేశం జరిగింది. త్వరలోనే మిగిలిన జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించేలా ప్లాన్ రూపొందించారు.
కుట్ర ఇదే –
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల నుంచే విమర్శలకు తెరలేపింది. అటు..జగన్ మీడియా కూడా తనదైన శైలిలో ప్రభుత్వంపై బురదజల్లుతోంది. అయితే…ఇవేవీ ప్రజలను పెద్దగా ప్రభావితం చేయలేదు. జగన్ అనేక పిలుపులు ఇచ్చినా..ప్రజల నుంచి స్పందన కనిపించలేదు. చివరికి జూన్ 4న నిర్వహించిన వెన్నుపోటు దినంలోనూ ప్రజలెవరూ స్వచ్ఛందంగా పాల్గొనలేదు. పార్టీ నేతల నుంచీ స్పందన అంతంత మాత్రమే కనిపించింది. ఈ నేపథ్యంలో కేవలం పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆందోళనలు, పోరాటాలు చేస్తే తిరిగి అధికారం దక్కించుకోలేమని జగన్ గ్రహించారు. తన ఆరోపణలు, విమర్శలతోపాటు, ప్రభుత్వ వ్యతిరేక వార్తలను రోజువారీగా వండివార్చే తన పత్రికను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పదేపదే చెప్పే అబద్ధాలనే నిజమని నమ్మించాలని..పార్టీ నేతలను కూడా ఇందులో భాగస్వాములను చేయాలని వ్యూహం రచించారు. అందులో భాగంగానే..సమన్వయ సమావేశాలు మొదలుపెట్టారు.
సాక్షి..ఈ పత్రిక ఎవరిదో, ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు… ప్రభుత్వంపై బురదజల్లి, వ్యతిరేకత పెంచి అధికారంలోకి వచ్చేందుకు మీడియాను వాడుకున్నారు. అధికారంలోకి రాగానే..సొంత మీడియాకు ఆదాయం తెచ్చిపెట్టేందుకు ప్రభుత్వాన్ని వాడుకున్నారు. వలంటీర్లు, గ్రామ సచివాలయాల సిబ్బందికి ప్రభుత్వ సొమ్మును అలవెన్సు రూపంలో ఇచ్చి బ్లూ పత్రికకు చందాదారులుగా మార్చారు. వలంటీర్లు కొందరు ప్రజలతో కూడా చందాలు కట్టించారు. ఎంత చేసినప్పటికీ..ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. దీంతో అధికారంలో ఉన్నప్పుడు బలవంతంగా పెంచుకున్న సర్క్యులేషన్ ఒక్కసారిగా పడిపోయింది.
తన అడ్డగోలు ఆరోపణలు, విమర్శలు ప్రజలకు చేరాలంటే సర్క్యులేషన్ పెంచుకోవాలి. దీనికోసమే… స్వతంత్ర మీడియా అనే ముసుగును పూర్తిగా తొలగించేశారు. తన పత్రికను బహిరంగంగానే పార్టీ పత్రికగా మార్చేశారు. వైసీపీ నేతలతో కలిసి పని చేయాలని పత్రికను..పత్రికకు పూర్తిగా సహకరించాలని పార్టీ నేతలను ఆదేశించారు.
జగన్ ఆదేశాల మేరకు..తిరుపతిలో తొలి సమావేశం జరిగింది. భూమనకరుణాకర్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సాక్షి ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు..ప్రత్యేకించి రాయలసీమ, ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని రాజకీయాలు, ప్రజా సమస్యలు, ఆయా అంశాలపై ప్రస్తుతం సాక్షి ఇస్తున్న కవరేజ్, సర్క్యులేషన్ పెంచుకునేందుకు ఉన్న మార్గాలపై చర్చించారు. ఆ తర్వాత మీటింగ్‌ను రిట్జ్ హోటల్‌కు మార్చారు. అక్కడ జగన్ మీడియా కీలక కార్యనిర్వహణ ప్రతినిధితోపాటు..వైసీపీ నేతలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రోజా, భూమన అభినయ్‌రెడ్డి, చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి, చంద్రగిరి సమన్వయకర్త మోహిత్‌రెడ్డి, సత్యవేడు నేత ఎన్.రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చిన్నవే అయినా..వాటిని భూతద్దంలో చూపించాలి, ప్రభుత్వ చర్యల వల్ల ఇబ్బందులు పడుతున్నారని ఫ్రేమ్ చేయాలని నిర్ణయించారు. సమస్య చిన్నదా? పెద్దదా? అన్నది చూడకుండా… ప్రభుత్వ వైఫల్యంగా చూపించేలా వార్తలు రాయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. జగన్ పత్రికలో వచ్చే అంశాల ఆధారంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టే బాధ్యతను వైసీపీ తీసుకుంటుందని, ఇలా సమన్వయంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా ఉన్న ఎలాంటి సమాచారమైనా పరస్పరం పంచుకోవాలని కూడా తీర్మానించుకున్నట్లు తెలిసింది.