కక్షసాధింపు చర్యలకు దిగబోమన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కానీ నేరం చేసిన వారెవరినీ వదిలిపెట్టబోమని, ఆధారాలతో నేరాన్ని నిరూపించి శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని, ఒకప్పుడు నేరస్థులను నాయకులు కలవాలంటే భయపడేవారని, ఇప్పుడు వారినే అడ్డుపెట్టుకుని నేతలు రాజకీయాలు చేస్తున్నారంటూ పరోక్షంగా జగన్‌పై సెటైర్లు వేశారు చంద్రబాబు. వైసీపీ అధ్యక్షుడు జగన్ తెనాలి వెళ్లి రౌడీషీటర్లకు సంఘీభావం ప్రకటించడంపై చంద్రబాబు స్పందించారు. విజయ్‌మాల్యా వంటివారు ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం వదిలి పారిపోయారు. కానీ అనేక ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇక్కడే ఉండి, రాజకీయం ముసుగులో నేరస్థులను రెచ్చగొట్టి, ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు
జగన్ కోటరీ చేసిన నేరాలు గుర్తు చేసుకుంటూ, ఎవరు ఎప్పుడు జైలుకు వెళతారా అన్న ఆందోళనలో వారు ఉన్నారని ఒక మంత్రి వ్యాఖ్యానించగా..నేరస్థులు ఎంతటివారైనా తప్పించుకోవడానికి వీల్లేదని, పకడ్బందీగా నేర నిరూపణ చేశాకే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు బదులిచ్చారు. జగన్ నేరస్థుడే కదా అని మరో మంత్రి వ్యాఖ్యానించగా..ఫలానా వ్యక్తి నేరస్థుడని మీరు, నేను అంటే సరిపోదని ఆధారాలతో నిరూపించి, శిక్షిస్తేనే ప్రజలు ఆమోదిస్తారని చెప్పారు చంద్రబాబు. నన్ను అక్రమ కేసులో జైల్లో పెట్టారని, నేను కూడా వాళ్లను అలా జైల్లో పెట్టాలన్నది తన విధానం కాదని స్పష్టం చేశారు. అలాగని తప్పు చేసినవారికి శిక్ష వేయకుండా ఉండటమూ సరికాదని పేర్కొన్నారు.
P-4 విధానం కింద బంగారు కుటుంబాల దత్తత కార్యక్రమాన్ని ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. P-4 పర్యవేక్షణకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక యంత్రాంగం ఉండాలని ఆయన స్పష్టంచేశారు. ఈ నెల 12వ తేదీ నాటికి జిల్లా కేంద్రాల్లో P-4 ఆఫీసులు ఏర్పాటు చేయాలన్నారు.
ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్నీ అమలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. సంక్షేమంపై పెట్టే ఖర్చు పేదలు వారి కాళ్లపై వారు నిలబడేలా, ఉత్పాదకత పెంచేలా ఉండాలన్నారు. అధికారుల బదిలీలు, పోస్టింగుల్లో అవినీతి జరగడానికి వీల్లేదని మంత్రులకు ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.
వచ్చే జనవరి 26కి క్వాంటమ్ వ్యాలీ
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవనాల్ని వచ్చే జనవరి 26 నాటికి సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. భవనాల డిజైన్లు చూసి సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు సూచించారు. క్వాంటమ్ కంప్యూటింగ్‌తో ఉపయోగాలను మంత్రులకు ఆయన వివరించారు. మరింత సమర్థంగా నిర్ణయాలు తీసుకునేందుకు మంత్రులంతా ఎంబీఏ చదవాల్సిన అవసరం ఉందన్నారు.
గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు రూ.81,600 కోట్లు కావాలని, ఈ ప్రాజెక్టుపై కేంద్రం సానుకూలంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. తాజాగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ కేంద్ర ప్రభుత్వ అధికారులకు దిల్లీలో ప్రజంటేషన్ ఇచ్చారని, వారి నుంచి సానుకూల స్పందన వ్యక్తమైందని తెలిపారు.