అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్న వ్యూహాల ద్వారా తిరిగి ఆయనే ఎదురు దెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. సర్వేల్లో చాలా మంది ఎమ్మెల్యేలు గెలవడం లేదని, వారిపై ప్రజా వ్యతిరేకత ఉందని చెప్పి దాదాపు 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకూడదని జగన్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కేసీఆర్ చేసిన తప్పు తాను చేయకూడదని జగన్ బలంగా ఉన్నారు. అయితే, ఎమ్మెల్యేలు మాత్రం జగన్ తీరుపై మండిపడుతున్నారు. సర్వేల సాకు చూపి టికెట్లు ఇవ్వకపోతే సహించేది లేదని ఎమ్మెల్యేలు తేల్చిచెబుతున్నారు. పాలన విషయంలో గత ఐదేళ్ల నుంచి తమ మాట వినకుండా నచ్చినట్లు చేసుకుపోయిన ముఖ్యమంత్రి ఇప్పుడు తనకు నచ్చినట్లు చేస్తానంటే కుదరదని వారు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలో ఎంతో కొంత అభివృద్ధి చేయాలని తాము మొదటి నుంచి నెత్తీనోరూ బాదుకొని చెప్పినప్పటికీ జగన్ వినలేదని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. బటన్లు నొక్కి అకౌంట్లలో వేసే డబ్బులే మనల్ని మళ్లీ గెలిపిస్తాయనే ధీమాతో జగన్ ఉన్నారని ఎమ్మెల్యేలు అంటున్నారు. తమ మాట వినకుండా.. జగన్ చేతులారా తప్పులు చేసి.. ఇప్పుడు తమ పనితీరు బాగోలేదని నిందలు వేయడం సరికాదని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. తమ స్థానంలో వేరేవారిని బరిలోకి దించితే తాము సహించబోమని, అవసరమైతే ఎదురు తిరుగుతామని వారు తేల్చి చెప్పారు. తాము ఎమ్మెల్యేలుగా గెలిచి శాసనసభాపక్ష నేతగా జగన్ ను ఎన్నుకుంటేనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేస్తున్నారు. ప్రజా వ్యతిరేకత ప్రభుత్వంపైనే ఉన్నందున.. ఎమ్మెల్యేలపై నిందలు వేస్తుండడం సరికాదని వారు చెబుతున్నారు. ఈ లాజిక్‌ను జగన్ గుర్తు పెట్టుకోవాలని అంటున్నారు.
రెండు రోజుల కిందట 11 నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలో ఎమ్మెల్యేలను కూడా మార్చే అవకాశం ఉందని అంటున్నారు. కనీసం 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గండం ఉందని.. జగన్ సొంత మీడియాలోనే వేస్తుండడంతో.. వైసీపీ ఎమ్మెల్యేల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ఇప్పుడు జగన్ టికెట్ ఇవ్వదలచుకోని చాలా మంది ఎమ్మెల్యేలు జగన్ ను ఆరాధిస్తుంటారు. జగన్ మెప్పు కోసం ప్రతిపక్ష నేతల్ని ఇష్టంలేకపోయినా తిట్టేవారు. ఇప్పుడు జగన్ హ్యాండ్ ఇస్తుండడంతో ఇప్పుడు వారికి పట్టరాని కోపం పెరుగుతోంది. జగన్ అండ చూసుకొని టీడీపీని బండబూతులు తిట్టారు. ఇక టీడీపీలోకి రానిచ్చే పరిస్థితి ఉండదు. రాజకీయంగా అనాథలైపోతామేమో అని కలవరపడుతున్నారు.
ఎప్పుడైతే టికెట్లు నిరాకరించిన ఎమ్మెల్యేల పేర్లు అధికారికంగా బయట పెడతారో అప్పుడు జగన్ పెను ముప్పు ఎదురు కానుందని టాక్. ఆ ఎమ్మెల్యేలంతా తిరుగుబాటుకు రెడీ అవుతున్నారు. ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్నారెడ్డి జగన్ తనకు అత్యంత ఆప్తుడని భావించి.. వైసీపీ పెద్దల ప్రోద్బలంతో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు ఆయనపైనే జగన్ వేటు వేయడంతో.. ఇక తమ పరిస్థితి ఏంటని మిగతా ఎమ్మెల్యేలు మదన పడుతున్నారు. అటు ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు తలుపులు మూసుకుపోవడంతో రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనప్పటికీ జగన్.. టికెట్లు ఇవ్వని ఎమ్మెల్యేల లిస్టు అధికారికంగా బయట పెట్టిన వెంటనే ఆయన ఊహించని రీతిలో ఎమ్మెల్యేలు ఎదురు తిరగనున్నట్లు తెలుస్తోంది.