వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి ఐ ప్యాక్ టీమ్ టెన్షన్ పట్టుకుందా.?? ఐ ప్యాక్ కి ఆయన గుడ్ బై చెప్పాలనే భావనలో ఉన్నారా.?? కొత్త టీమ్ ని రంగంలోకి దించాలనుకుంటున్నారా.?? వైసీపీని ప్రస్తుతం ఈ ప్రశ్నలు కుదిపేస్తున్నాయి..
గత ఎన్నికలలో జగన్ కష్టం పది శాతం అయితే, ఆయనను అధికారంలోకి తీసుకురావడానికి ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ఐప్యాక్ టీమ్ చీఫ్ ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు 90 శాతం అని చెబుతారు రాజకీయ విశ్లేషకులు.. ప్రశాంత్ కిశోర్ టీమ్ అనుసరించిన వ్యూహాలు ఫలించాయి.. నాటి చంద్రబాబు సర్కార్ పై సోషల్ మీడియాలో భారీగా విష ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యాయి.. అమరావతి, పోలవరం, కియా, పరిశ్రమలతోపాటు ఒక సామాజికవర్గానికే చెందిన పార్టీగా టీడీపీని ముద్ర వేయడంలో పీకే టీమ్ సక్సెస్ అయింది. దీనికితోడు, వైజాగ్ ఎయిర్ పోర్టులో జరిగిన కోడి కత్తి డ్రామా కూడా ఐ ప్యాక్ టీమ్ రచించినదే అని అభిప్రాయం రాజకీయ వర్గాలలో ఉంది.. ఏపీలోని సామాజిక వర్గాల మధ్య పెట్టిన చిచ్చు కూడా కలిసి వచ్చింది వైసీపీకి. వీటన్నింటి సహకారంతో జగన్ ఐ ప్యాక్ టీమ్ స్ట్రాటజీకి రోబోలా వ్యవహరించాడని, ఇది విజయం సాధించిందనే ప్రచారం ఉంది..
తాజాగా ఐ ప్యాక్ టీమ్ కి ఏపీలో టఫ్ టైమ్ మొదలయినట్లు కనిపిస్తోంది.. ఆ టీమ్ ఇస్తున్న వ్యూహాలు, అనుసరిస్తున్న స్ట్రాటజీ అంతగా ఫలించడం లేదు.. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్ఎల్సీ ఎన్నికల సమయంలో.. ఐ ప్యాక్ టీమ్ ఇచ్చిన స్ట్రాటజీనే జగన్ టీమ్ అనుసరించింది.. అది అట్టర్ ఫ్లాప్ అయింది.. దీంతో, ఏపీలో వై నాట్ 175 అన్న జగన్ టార్గెట్ కి.. ప్రత్యక్షంగా గ్రౌండ్ లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు అర్ధం అయింది. వెంటనే ఐ ప్యాక్ ఆఫీస్ కి వెళ్లిన జగన్.. అక్కడ వారిపై సీరియస్ అయినట్లు ప్రచారం జరిగింది.. స్ట్రాటజీ మార్చాలని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం..
తాజాగా, ఐ ప్యాక్ టీమ్… ఇస్తోన్న బీసీ, ఎస్సీ, ఎస్ టీ జయహో నినాదంతో పాటు ఎన్నో ఆశలు పెట్టుకున్న మూడు రాజధానుల వ్యూహం కూడా వైసీపీకి కలిసి రావడం లేదు.. ఇటు సంక్షేమం ఒక్కటే తమని గట్టెక్కిస్తుందని గంపెడాశలు పెట్టుకున్న వైసీపీకి ఇది బూమరాంగ్ అవుతోంది. ఏపీ ఖజానా కొండంత అప్పులతో జీతాలకు కూడా మనీ లేక కూనిరాగాలు తీస్తోంది.. దీంతో, ఐ ప్యాక్ టీమ్ అనుసరించిన విధానపరమైన, అభివృద్ధి వ్యూహం నెగిటివ్ గా మారిందని జగన్ టీమ్ కి అర్ధం అయింది.. దీంతో, ఐ ప్యాక్ టీమ్ వ్యూహాలను అనుసరించాలా.? లేక, ఆపేయాలా అనే డైలమాలో పడిపోయినట్లు సమాచారం..
ఐ ప్యాక్ టీమ్ తోపాటు మరికొంతమంది వ్యూహ నిపుణులను సైతం రంగంలోకి దించాలనుకుంటున్నారట జగన్.. ఇదే నిజం అయితే, ఎన్నికలకు ఏడాది ముందే ఆ పార్టీపై ఎంత నెగిటివ్ ఉందో అర్ధం అవుతుంది.. తమ ఓటమిని తామే ముందుగానే డిక్లేర్ చేసుకున్నట్లు అవుతుందని లెక్కలు కడుతున్నారట.. దీంతో, ఏం చేయాలో పాలుపోవడం లేదట వైసీపీ హై కమాండ్ కి.. మరి, దీనిపై జగన్ ఏం చేస్తారో చూడాలి.