మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రియాలిటీలోకి రాలేకపోతున్నారు. సోషల్‌మీడియాపైనే ఆయన ఆధారపడినట్లు తెలుస్తోంది. ఇటీవల YSRCP యువజన విభాగంతో సమావేశమైన జగన్…సోషల్‌మీడియాలో మరింత దూకుడు ప్రదర్శించాలని యువజన విభాగం నేతలకు సూచించారు. ప్రతి ఒక్కరూ సోషల్‌మీడియాను విధిగా వాడాలని, ప్రభుత్వాన్ని సోషల్‌మీడియాలో ఏకిపారేయాలని దిశానిర్దేశం చేశారు.
ఐతే అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ సోషల్‌మీడియా ఏ రకంగా పని చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యర్థి పార్టీ నేతల వ్యక్తిత్వ హననం చేసేలా వైసీపీ నేతలు, కార్యకర్తలు పోస్టులు పెట్టేవారు. ప్రధానంగా లోకేష్, చంద్రబాబు, పవన్‌ల ఫోటోలు మార్ఫింగ్ చేసే వారు. వ్యక్తిగత దూషణలు, రాజకీయాల్లోకి ఫ్యామిలీలను లాగుతూ పోస్టులు పెట్టేవారు. అంతేకాదు టీడీపీ మహిళా నేతలపై ఫేక్ పోస్టులు క్రియేట్ చేసి సర్క్యూలేట్ చేసేవారు.
ఈ వైఖరి వల్లే వైసీపీ నేతలు అనేక కేసులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్‌మీడియా కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. బోరుగడ్డ అనిల్ కుమార్ వంటి వారు, అలాగే పోసాని కృష్ణ మురళి వంటి సీనియర్ నాయకులు కూడా అరెస్టు అయ్యారు.
ఇంతకీ జగన్ సోషల్‌మీడియా వారియర్స్‌కు ఏం చెప్పదలుచుకున్నారు. మరోసారి దూషణలు, బూతు పోస్టులు పెట్టాలని కార్యకర్తలకు సూచిస్తున్నారా. లేదా పారదర్శకంగా రాజకీయాలు చేసి ప్రజల మనసు చూరగొందామని చెబుతున్నరా. క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. భవిష్యత్తులో యువతకు ప్రాధాన్యతనిస్తామని, పదవులు కల్పిస్తామని గానీ ఎలాంటి హామీ ఇవ్వకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ కావాలని చెప్పడంపై ఆ పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ తమను పట్టించుకోలేదని, భవిష్యత్తులో పట్టించుకుంటారన్న నమ్మకం లేదన్న చర్చ జరుగుతోంది. నన్ను నమ్ముకో, ఉన్నది అమ్ముకో అన్న చందంగా వైసీపీ కార్యకర్తల పరిస్థితి తయారైంది.











