ఏపీలో సీఎంకు వ్యతిరేకంగా చెల్లెలి ఎదురుదాడి మొదలైపోయింది. ఆమె ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అన్న జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. ఏపీలో పార్టీలు బీజేపీతో అధికార వైసీపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని షర్మిల ఆరోపించారు. విశాఖపట్నంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగానే షర్మిల వైసీపీ అధినేతపై ఘాటు విమర్శలు చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రత్యేక హోదాపై బాగా పోరాటాలు చేసిన జగన్ మోహన్ రెడ్డి.. అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ ముందు సాగిలాపడ్డాడని ఎద్దేవా చేశారు.
జగన్ అధికారంలోకి వచ్చాక దానిపై పోరాటమే లేదని.. గంగవరం పోర్టులో రాష్ట్ర వాటాను అప్పనంగా ఇచ్చేశారని ఆరోపించారు. 30 ఏళ్ల లీజు తర్వాత గంగవరం పోర్టు ప్రభుత్వ పరం కావాల్సి ఉండగా.. నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ వాటా 10 శాతం తక్కువే అమ్మేశారని అన్నారు. ఏపీలో చంద్రబాబువి కనిపించే పొత్తులు అయితే.. వైసీపీవి మాత్రం బయటికి కనిపించని పొత్తులని షర్మిల సెటైర్లు వేశారు. వైసీపీ, బీజేపీ కలిసి ఉత్తరాంధ్రను మోసం చేశాయని.. ఇక్కడ ఉన్న కంపెనీలను ప్రైవేటు సంస్థలకు అప్పనంగా ఇచ్చేశారని అన్నారు. విశాఖ ఉక్కు కార్మాగారాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడం ఒక కుట్ర అని అన్నారు. ఇందిరమ్మ హయాంలో ఏర్పడిన విశాఖ స్టీల్‌ను అమ్మే ప్రయత్నం చేస్తున్నారని షర్మిల అన్నారు.
అంతటితో ఆగకుండా వైఎస్ షర్మిల తన అన్నను మోదీకి దత్త పుత్రుడు ని అభివర్ణించారు. మిగతా విమర్శల సంగతి ఎలా ఉన్నా.. ఇలా దత్తపుత్రుడు అనడం మాత్రం అందరికీ తమాషాగా అనిపించింది. ఎందుకంటే.. గత మూడేళ్లుగా.. పవన్ కల్యాణ్ ను జగన్ దత్తపుత్రుడు అనే అంటూ వస్తున్నారు. ప్రతి బహిరంగ వేదికపైనా పవన్ కల్యాణ్ ప్రస్తావన లేకుండా జగన్ ప్రసంగం ముగియడం లేదు. పవన్ కల్యాణ్ ను తరచూ చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటూ పదే పదే అనడం వల్ల.. ప్రజల్లోనూ ఒకరకమైన వెగటు ఏర్పడింది. అలాంటిది ఇప్పుడు సొంత చెల్లెలు షర్మిల.. వైఎస్ జగన్ ను మోదీకి దత్తపుత్రుడు అనడం ప్రాధాన్యం సంతరించుకుంది.
బీజేపీతో ఏపీలోని వైసీపీ రహస్య దోస్తీ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం షర్మిల వ్యూహంగా కనిపిస్తోంది. ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టగానే షర్మిల దూకుడుతో ముందుకు వెళ్తున్నారు. వైసీపీతో పాటుగా టీడీపీ, బీజేపీలను కూడా టార్గెట్ చేస్తున్నప్పటికీ.. ప్రధానంగా జగన్ నే అధికంగా లక్ష్యం చేస్తున్నారు. షర్మిల మొదలు పెట్టిన జిల్లాల పర్యటనల్లో భవిష్యత్తులో తన అన్నపై ఇంకెన్ని ఘాటైన విమర్శలు వినాల్సి వస్తుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది











