వ్యవస్థలను మేనేజ్ చేయడంలో జగన్ మోహన్ రెడ్డి దిట్టగా ఉంటారని చెబుతుంటారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి తన తప్పిదాలు బయటికి రాకుండా ఉండడంలో జగన్ వ్యవస్థలను మేనేజ్ చేయడమే కారణమని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఏపీకి ముఖ్యమంత్రి అయ్యాక.. తన అధికార బలంతో ఏ వ్యవస్థను అయినా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించారు. అందుకే ఇన్నేళ్లుగా అక్రమాస్తుల కేసులో జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నప్పటికీ కేంద్రంతో అంటకాగడం వల్ల.. దాని బారి నుంచి తాత్కాలికంగా తప్పించుకుంటూ వస్తున్నారు. మరోవైపు, బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలోనూ జగన్ ఇదే ధోరణి అవలంబిస్తున్నారు. తన తమ్ముడు అవినాష్ రెడ్డిని, తనను కాపాడుకుంటూ వస్తున్నారు.
రాజకీయ నాయకులు, పోలీసులు, అఖిలభారత అధికారులను తన గుప్పిట్లో ఉంచుకున్న జగన్ గురించి తాజాగా ఓ వాస్తవం బయటికి వచ్చింది. నిజానికి ఇది 2021లో కొవిడ్ టైంలో జరగ్గా.. ఆ విషయం బయటికి రాకుండా.. అప్పుడే జగన్ మేనేజ్ చేసేశారట. కానీ, నిజం నిప్పులాంటిది కాబట్టి.. తాజాగా ఆ విషయం బయటికి వచ్చింది. 2021లో ఏపీ హైకోర్టులో పని చేసిన ఓ జడ్జి ఫ్యామిలీలో వివాహం ఉత్తరాదిలో జరిగింది. కరోనా కాలం కావడంతో హంగూఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా ఆ పెళ్లి జరిగింది. అయితే, ఏపీ నుంచి ఇద్దరు ఊహించని అతిథులు హాజరయ్యారు. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీలో ఈవోగా ఉన్న ధర్మారెడ్డి. వారిని చూసి సదరు జడ్జి ఆశ్చర్యపోయారు.
వారిని న్యాయమూర్తి ఏకాంతంగా కలవగా.. ఇంతలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక గిఫ్ట్ బాక్స్‌లో నుంచి ధగధగలాడే రిస్ట్ వాచ్ ఒకటి బయటికి తీశారు. ఆ వజ్రాలు పొదిగిన బ్రాండెడ్ వాచ్ విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. దాన్ని జడ్జికి ఇవ్వబోతుండగానే.. ఆ వాచ్ ను వాళ్లవైపునకే విసురుగా తోసేశారు. ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని పరుష పదజాలంతో జడ్జి కేకలు వేశారు. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ధర్మారెడ్డి అక్కడి నుంచి వచ్చేశారు. ఆ జడ్జికి జగన్ వ్యవహార శైలి బాగా తెలియడంతో ఈ విషయం మొత్తాన్ని ఓ లెటర్ ద్వారా సుప్రీంకోర్టుకి తెలిపారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఎంపీ వేమిరెడ్డి పై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేయగా.. నిబంధనల ప్రకారం దీనిపై నిఘా వర్గాలతో విచారణ చేయించాల్సి ఉంటుంది. అయితే, ఆ విషయం అంతటితో ముగిసేలా జగన్ మేనేజ్ చేసినట్లు తెలిసింది. ఆ న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు రాసిన లేఖ గురించి ఇప్పుడు చర్చ మొదలవడంతో ఈ మొత్తం అంశం వెలుగులోకి వచ్చింది.
జగన్ తొలి నుంచి న్యాయవ్యవస్థపై కన్నేశారు. అంతకుముందు కూడా ఒక జడ్జిని ఇలాగే ప్రలోభాలకు గురిచేయాలని ప్రయత్నించి విఫలం చెందారు. కేసుల విచారణలో తనకు ఉపయోగపడిన, పడుతున్న వారిని ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో సంతృప్తి పరుస్తూనే ఉన్నారు. మూడేళ్లకు పైబడి సర్వీసు ఉన్న హైకోర్టు న్యాయమూర్తులపై జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వీరు భవిష్యత్తులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులయ్యే అవకాశం ఉండడంతో వీరిని మంచి చేసుకునేందుకు చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం ఉంది. ఏమైనప్పటికీ తన కేసుల కోసమే ఆయన ఇన్ని పాట్లు పడుతున్నట్లుగా చెబుతున్నారు.











