ఏపీలో మహిళలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉచిత బస్సు పథకం ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ – 6 హామీల్లో ఇది కీలకం. ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే అధ్యయనం కూడా పూర్తయింది. ఈ పథకం అమలుకు సంబంధించి పక్కా ప్రణాళికను సైతం ప్రభుత్వం రూపొందించుకుంది. జిల్లాలు, మండలాల వారీగా మహిళలకు పాసులు ఇవ్వనున్నట్టు తెలిసింది. దీనిని ఎట్టి పరిస్థితిలోనూ ఆగస్టు 15 నుంచి ప్రారంభం చేయనున్నారు.
ఇదే విషయాన్ని తాజాగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో చంద్రబాబు ప్రస్తావించారు. మహిళలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామన్నారు చంద్రబాబు. తెలుగు దేశం పార్టీ మహిళా పక్షపాతి అని..గతంలోనూ మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించామని.. ఇటీవలే తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేశామని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా అమలు చేయనున్నట్టు చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా..సూపర్-6ను అమలు చేస్తామని చెప్పారు. ఐతే..ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు నష్టపోయే అవకాశం ఉందని నివేదికలు వచ్చాయన్నారు.
ఈ అంశంపైనా దృష్టి సారించామన్నారు చంద్రబాబు. రవాణా రంగంపై ఆధారపడి లక్షల మంది కార్మికులు జీవిస్తున్నారని.. ప్రైవేటు రవాణా రంగంతో ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తోందని తెలిపారు. ఇలాంటి సమయంలో వారు నష్ట పోకుండా.. ఆగస్టు 15నే వారిని ఆదుకునేందుకు సంక్షేమ పథకాన్ని ప్రకటిస్తామన్నారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణాల కారణంగా నష్టపోయే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. దీనిపై విధివిధానాలను త్వరలోనే వెల్లడించనున్నట్టు ముఖ్యమంత్రి వివరించారు. చంద్రబాబు ప్రకటనతో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు..హర్షం వ్యక్తం చేస్తున్నారు.