వై.ఎస్.జగన్‌కు తల్లి విజయమ్మ బిగ్‌షాకిచ్చారు. సరస్వతీ పవర్ షేర్ల విషయంలో జగన్, భారతీ చేసిన ఆరోపణలను విజయమ్మ ఖండించారు. జగన్,భారతి చేస్తున్న ఆరోపణలు న్యాయ సమీక్షలో నిలవవంటూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో షర్మిలతో కలిసి విజయమ్మ కౌంటర్ దాఖలు చేశారు. కుటుంబంలో జరుగుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు విజయమ్మ. పిల్లల మధ్య వివాదం కారణంగా కోర్టు గదిలో తాను నిలబడాల్సి రావడంతో తీవ్రంగా కలచివేస్తోందన్నారు. భారమైన హృదయంతో కౌంటర్ దాఖలు చేస్తున్నట్లు వివరించారు. తనకు తెలియకుండా సరస్వతి పవర్ షేర్లను తన తల్లి, షర్మిల బదిలీ చేసుకున్నారని..ఆ బదిలీని రద్దు చేసి తన పేరిట, తన భార్య భారతి, తమ కంపెనీ క్లాసిక్ రియాల్టీ పేరిట 51.01 శాతం వాటాలు యథావిధిగా కొనసాగేలా ఆదేశాలివ్వాలని పేర్కొంటూ జగన్ NCLTలో పిటిషన్ వేసిన విషయం విదితమే. ఆ షేర్లను తన తల్లికి గిఫ్టుగా ఇచ్చానని..వాటిని తాను ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చని అందులో వివరించారు.. ఐతే జగన్ చేసిన ఈ ఆరోపణలను విజయమ్మ ఖండించారు.
ఐతే విజయమ్మ మాత్రం జగన్ ఆరోపణలను తప్పుపట్టారు. రాజకీయ ఉద్దేశాలు, కారణాలతోనే జగన్ NCLTలో తప్పుడు కేసు వేశారని విజయమ్మ,షర్మిల పేర్కొన్నారు. ఇద్దరూ వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. జగన్ పిటిషన్‌కు ఇద్దరు దాదాపు 38 పాయింట్లతో ఘాటు కౌంటర్ ఇచ్చారు. కుటుంబ వివాదాన్ని జగన్ కంపెనీ వివాదంగా మార్చారని పేర్కొన్నారు విజయమ్మ, షర్మిల. ఇక సొంత బిడ్డలపైనే NCLTలో పిటిషన్ వేయాల్సి రావడం తన గుండెను పిండేసిందన్నారు విజయలక్ష్మి.
2019 ఆగస్టు 31వ తేదీన కుటుంబం మధ్య జరిగిన మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్-MOU మేరకే సరస్వతి పవర్ షేర్ల బదలాయింపు జరిగిందన్నారు విజయమ్మ. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఎంవోయూలో NCLT జోక్యం చేసుకోజాలదన్నారు. షేర్ల బదలాయింపు అంతా చట్టప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు. NCLTని తప్పుదారి పట్టించేలా జగన్ రాజకీయ ప్రేరిత వ్యాజ్యం వేశారని తల్లీ కుమార్తెలు పేర్కొన్నారు. వాటాల బదలాయింపుపై ఆయన చేస్తున్న ‘క్లెయిమ్’ అంతా తప్పేనన్నారు. ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టించేలా పిటిషన్ దాఖలు చేశారన్నారు. చట్టబద్ధంగా జరిగిన MOUపై వాస్తవాలు వివరిస్తూ తాము పొందుపరచిన సాక్ష్యాధారాలను పరిశీలించి..ఆదేశాలు జారీ చేయాలని NCLTని విజయమ్మ, షర్మిల కోరారు.
ఇక జగన్ పిటిషన్‌పై NCLT సోమవారం విచారణ జరిపింది. జగన్ తరపున సీనియర్ న్యాయవాది, వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి వర్చువల్‌గా హాజరై వాదనలు వినిపించారు. కౌంటర్లు దాఖలు చేయాలని తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిల సహా ప్రతివాదులకు గతేడాది సెప్టెంబరులోనే నోటీసులు జారీ చేసినప్పటికీ..ఇద్దరు మాత్రమే దాఖలు చేశారని పేర్కొన్నారు. అందరూ కౌంటర్లు సమర్పిస్తే తాము రిజాయిండర్ దాఖలు చేస్తామని తెలిపారు. విజయలక్ష్మి, షర్మిల తదితరుల తరఫున న్యాయవాది విశ్వరాజ్ వాదనలు వినిపించారు. ఆన్‌లైన్‌లో తాము కౌంటర్లు దాఖలు చేశామని.. ఒకట్రెండు రోజుల్లో భౌతికంగా సైతం ధర్మాసనానికి సమర్పిస్తామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ట్రైబ్యునల్..తదుపరి విచారణను మార్చి 6కు వాయిదా వేసింది.