ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఎవరిపై ఎలాంటి ప్రభావాలు చూపాయో తెలియదు కానీ, ఏపీలో ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గూబ పగలకొట్టాయి.. హస్తినలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి ప్రధాన కారణం విచ్చలవిడి అవినీతి.. జనలోక్ పాల్ బిల్లుని తీసుకువచ్చి దేశంలో నీతివంతమయిన పాలన తీసుకువస్తానని హామీ ఇచ్చి మూడుసార్లు అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్.. ఆ తర్వాత అవినీతి పాప పంకిలంలో మునిగిపోయాడు.. భారీగా బురద అంటించుకున్నాడు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్.. దేశాన్ని ఎంతగా కుదిపేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పార్టీలో సీనియర్ నేత, మాజీ మంత్రి సిసోదియాతోపాటు స్వయంగా ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ సైతం మద్యం స్కామ్‌లో బుక్ అయ్యారు. చివరికి జైలుకు వెళ్లారు.. రాజీనామా చేసినా బొక్కబోర్లా పడ్డారు…
ఇక, కేజ్రీవాల్ ఓటమికి మరో కారణం.. షీష్ మహల్.. షీష్ మహల్ అంటే కేజ్రీవాల్ అధికారిక నివాసం.. ఆయన స్వంత ఇల్లు.. మారుతి 800 కారుతో ముఖ్యమంత్రి పీఠం తొలిసారి దక్కించుకున్న ఢిల్లీ మాజీ సీఎం.. పదేళ్ల తర్వాత తన సొంత ఇంటిని ఓ రాజమహల్‌ని తలపించే ప్యాలెస్‌లా మార్చుకున్నారు.. వందల కోట్లతో తన నివాసాన్ని రాజులను తలపించే ఇంద్ర భవన్‌ని మించిపోయేలా చేసుకున్నారు.. ఆ ప్యాలెస్ విజువల్స్ ఎప్పుడయితే వెలుగులోకి వచ్చాయో.. ఢిల్లీ ప్రజల అంచనాలు మారిపోయాయి.. కేజ్రీవాల్.. సంక్షేమపథకాల పేరుతో తాయిలాలు అందించి, తాను మాత్రం హస్తిన చక్రవర్తిలా ఆర్భాటాలు ప్రదర్శిస్తున్నారని భావించారు.. అంతే, కేజ్రీవాల్ అహంకారానికి, రాచరికానికి చరమగీతం పాడారు.. ఆయన సీఎం సీటును గల్లంతు చేశారు ఓటర్లు..
సరిగ్గా ఎనిమిది నెలల క్రితం.. ఏపీలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది.. మాజీ ముఖ్యమంత్రి జగన్ సైతం లిక్కర్ స్కామ్‌లో వేల కోట్లు దిగమింగాడని ఇప్పటికే సిట్ లెక్కలు కట్టింది. దానిపై విచారణకు అంతా సిద్ధం అవుతోంది.. ఇక, కేజ్రీవాల్ సింగిల్ ప్యాలెస్ షీష్ మహల్‌తో సరిపెడితే, జగన్‌కి ఏకంగా అరడజను ప్యాలెస్‌లు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి.. బెంగళూరులో ఎలహంక ప్యాలెస్, హైదరాబాద్‌లో లోటస్ పాండ్, చెన్నైలో మరో ప్యాలెస్, ఇక, తాడేపల్లిలో జగన్ నివాసం ప్యాలెస్‌ని తలపిస్తుందని చెబుతారు.. వాటిని కనిపించకుండా, ఇనుప గ్రిల్‌తో ఆయన మేనేజ్ చేస్తున్నారు..
30 ఏళ్లు తానే సీఎం అని భావించిన జగన్.. ఆ తర్వాత విశాఖలో ఎంతో పవిత్రమయిన రిషికొండను అడ్డంగా తొలచి ఒక ప్యాలెస్‌ని నిర్మించుకున్నారు.. ఏకంగా సుమారు 700 కోట్ల ప్రభుత్వ నిధులతో ఆయన ప్యాలెస్‌ని ఆర్బాటంగా కట్టించుకున్నారు.. ఇలా జగన్ ప్యాలెస్‌ల పిచ్చి ప్రజలకు అర్ధం అయింది.. పరదాల మాటున ఆయన ఓ ఆధునిక ప్రభువుగా, రాచరికపు నిరంకుశ చక్రవర్తిలా పాలించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు.. దీంతో, జగన్‌ని గద్దె దించారు..
తాజాగా హస్తిన ఫలితాలు జగన్‌కి లెంపకాయ వేశాయని చెబుతున్నారు.. లిక్కర్ స్కామ్, ప్యాలెస్‌లతో కేజ్రీవాల్ ఓడిపోయారు.. దీంతో, వైసీపీ అధినేతకి ఢిల్లీ ఎన్నికలు గుణపాఠం నేర్పాయని అంటున్నారు. మరి, వీటిని జగన్ ఎలా తీసుకుంటారో చూడాలి..