జగన్ సర్కార్ హయాంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పెద్ద ఎత్తున జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతోందన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఐతే ఇందుకు బ్యాంకుల నుంచి కొంత సమాచారం అవసరమని స్పష్టం చేశారు. విచారణలో భాగంగా దర్యాప్తు సంస్థలు కోరే సమాచారం ఇచ్చి, అధికారులకు సహకరించాలని బ్యాంకర్లకు సూచించారు. సచివాలయంలో సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో చంద్రబాబు పాల్గొని..వారికి పలు సూచనలు చేశారు.
ఇక అర్హులైన రైతులు బ్యాంకులకు వస్తే..15 నిమిషాల్లోపే రుణం ఇచ్చే విధానం అందుబాటులోకి తీసుకురావాలని నిర్దేశించారు. పీఎం సూర్యఘర్ స్కీం కింద ఏడాదిలో 20 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్ ఇందించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు చెప్పారు. ఎస్సీ,ఎస్టీలకు 2 కిలోవాట్ల వరకు ఉచితంగా సోలార్ పరికరాలు అందిస్తామన్నారు. దీంతో ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా..మిగులు విద్యుత్ ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందన్నారు. మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సాగులోనూ మార్పు వస్తోందన్నారు. ఉద్యాన పంటలకు ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. రైతులకు బ్యాంకులు వీలైనంత తోడ్పాటు అందించాలన్నారు. ఆక్వా, ప్రకృతి వ్యవసాయం, డెయిరీ రంగాలను ప్రోత్సహించాలని బ్యాంకర్లకు సూచించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో వివిధ రంగాలకు రూ.5.34 లక్షల కోట్ల రుణాలు ఇచ్చామని, టార్గెట్‌లో 99 శాతం సాధించామన్నారు యూనియన్ బ్యాంక్ సీఈఓ, ఎండీ ఎ.మణిమేఖలై వ్యవసాయ రంగానికి రూ.2.64 లక్షల కోట్ల రుణాల లక్ష్యం ఉండగా..రూ.2.37 లక్షల కోట్లు, ప్రాధాన్య రంగంలో రూ.3.37 లక్షల కోట్లకు రూ.3.26 లక్షల కోట్లు అందించామని వివరించారు. MSME రంగానికి రూ.79,905 కోట్లు, ప్రాధాన్యేతర రంగానికి రూ.2.08 లక్షల కోట్ల రుణాలు విడుదల చేశామన్నారు.ఇక ఇటీవల కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన వాట్సప్ గవర్నెన్స్ బ్యాంకర్లు ప్రశంసలు కురిపించారు. ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్నారు.