ఏపీలో రాజకీయ వేడి ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఏపీ సీఎం జగన్ తీరును నిరసిస్తూ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆవేశపూరిత వ్యాఖ్యలు చేయడం, వాటికి బదులుగా వైసీపీ శ్రేణులు టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటుగా పలు జిల్లాల్లోని ఆ పార్టీ కార్యాలయాలపైనా, కీలక నేతలపైనా దాడులకు తెగబడటం తెలిసిందే. ఈ దాడులను నిరసిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు 36 గంటల దీక్షకు దిగితే.. ఆ దీక్షకు వ్యతిరేకంగా వైసీపీ జనాగ్రహ దీక్షలకు తెర తీయడం.. టీడీపీ నేతలపై వైసీపీ నేతలు పరుష పదజాలంతో విరుచుకుపడటం, వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ నేతల ఎదురు దాడి.. వెరసి ఏపీలో ఈ వారమంతా ఉద్రిత్తతో కూడిన పరిస్థితులే నెలకొన్నాయి. ఏపీలో జగన్ పాలన మొదలయ్యాక అరాచకం రాజ్యమేలుతోందని, మంగళవారం నాటి దాడులు, ఆ తర్వాతి పరిణామాలే ఇందుకు నిదర్శనమని చంద్రబాబు విమర్శించారు. అంతేకాకుండా ఏపీలో రాష్ట్రపతి పాలన అమలు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో చంద్రబాబు సోమవారం నుంచి ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం రెండు రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలోనే ఉండనున్నారు. చంద్రబాబు ఢిల్లీ టూర్ ఖరారైన వెంటనే వైసీపీలో అలజడి మొదలైపోయింది.
రాష్ట్రపతితో భేటీ.. ఆ తర్వాత..
శనివారం సాయంత్రం వరకైతే.. ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. చంద్రబాబు నేతృత్వంలోని ఐదుగురు టీడీపీ బృందం తనను కలిసేందుకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఇచ్చేశారు. రాష్ట్రపతిని కలవనున్న చంద్రబాబు.. ఏపీలో నెలకొన్న పరిస్థితులు, వైసీపీ అమలు చేస్తున్న అరాచక పాలన, టీడీపీ కార్యాలయాలపై దాడులు, ఇష్టారాజ్యంగా టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తున్న తీరు.. తదితరాలను రామ్ నాథ్ కోవింద్‌కు వివరించనున్నారు. అంతేకాకుండా ఆయా ఘటనలకు సంబంధించి చంద్రబాబు ఆధారాలను కూడా అందించనున్నారు. అరాచక పాలన నుంచి ఏపీ ప్రజలను రక్షించేందుకు తక్షణమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను అమలు చేయాలని కూడా చంద్రబాబు కోరనున్నారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో పాటు పలువురు కేంద్ర మంత్రులతోనే భేటీ అయ్యే దిశగా టీడీపీ యత్నాలు సాగిస్తోంది. ఇందుకు సంబంధించి ఆయా మంత్రులు, ప్రముఖుల అపాయింట్ మెంట్ల కోసం ఇప్పటికే టీడీపీ తనదైన శైలి యత్నాలను ప్రారంభించింది కూడా. మొత్తంగా ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ఎవరెవరితో భేటీ కానున్నారన్న విషయంపై ఇప్పటిదాకా స్పష్టత లేకున్నా.. అందరూ ఆ దిశగానే చూస్తున్నారు.
మరి వైసీపీ పనేంటి..?
సాధారణంగా ఓ పార్టీ అధినేత హస్తిన పర్యటనకు వెళుతుంటే.. ఇతర పార్టీలు ఆసక్తిగా గమనిస్తూ ఉంటాయి. ఢిల్లీ వెళ్లిన నేత ఎవరెవరిని కలుస్తున్నారు? ఏమేం చేస్తున్నారు? అన్న విషయాలపై వివరాలు సేకరిస్తూ ఉంటాయి. విపక్షంలో ఉన్న పార్టీ నేతలు ఇలా ఢిల్లీకి వెళితే.. అధికారంలోని పార్టీలు అంతగా పట్టించుకోవు. అయితే ఏపీలో పరిస్థితి అలా లేదనే చెప్పాలి. విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారంటేనే.. వైసీపీలో ఇప్పటికే పెను అలజడి రేగింది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ఎందుకు వెళుతున్నారు? అంటూ విమర్శలు సంధిస్తున్నాయి. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ఎక్కడ బీజేపీ నేతలను కలుస్తారో, ఎక్కడ టీడీపీ, బీజేపీల మధ్య కొత్త పొత్తు పొడుస్తుందోనన్న భయం వైసీపీలో నెలకొంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. తాను సైలెంట్‌గా ఉంటే కుదరదు కదా అనుకుందో, ఏమో తెలియదు గానీ.. వైసీపీ అప్పుడే రంగంలోకి దిగిపోయింది. చంద్రబాబు ఎవరెవరి అపాయింట్‌మెంట్లు కోరుతున్నారన్న విషయాన్ని పసిగడుతూ ఆయా నేతల కార్యాలయాలకు తన పార్టీ ఎంపీలను పంపుతూ చంద్రబాబుకు ఆయా నేతల అపాయింట్ మెంట్లు దక్కకుండా వ్యూహాన్ని అమలు చేస్తోందట. ఇందుకు సంబంధించి వైసీపీ కీలక నేతలతో పాటు ఇటీవలే ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమితులైన ఓ కీలక రిటైర్డ్ ఐఏఎస్ సేవలను కూడా జగన్ సర్కారు వినియోగిస్తోందట. మరి ఈ వ్యూహం అమలులో వైసీపీ సత్తా చాటుతుందో, చంద్రబాబు చాణక్యం ముందు చతికిలబడుతుందో చూడాలి.