ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో రాజకీయ పార్టీలతోపాటు, ప్రజలలోనూ అనిశ్చితి నెలకొందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.. అనూహ్యంగా కొందరు వైసీపీ నేతలు మాత్రం జంప్ జిలానీ రాగం అందుకోవడానికి రెడీ అవుతున్నారని సమాచారం.. ముఖ్యంగా సైకిల్ ఎక్కడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.. ఇటు, ఇతర పార్టీల నేతలు సైతం టీడీపీలోకి చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరబోతున్నారు. హైదరాబాద్‌లో టీడీపీకి సన్నిహితంగా పేరున్న టీవీ చానళ్ల యజమానులను కలిసేందుకు కనీసం పది మంది వైసీపీ కీలక నేతలు ఇటీవలి కాలంలో వచ్చి వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీని ఏదో చేద్దామనుకున్నారు కానీ… మరింత బలోపేతం అయిందన్న వాదన రాజకీయాల్లో వినిపిస్తోంది.
చంద్రబాబు అరెస్ట్ ద్వారా మహాకుట్రకు తెరతీసిన వైసీపికి జగన్ నిర్ణయాలు శాపంగా మారబోతున్నాయన్న
వాదన బలంగా వినిపిస్తోంది. గతంలో జగన్ రెడ్డి నిర్ణయాలతో ఇప్పటికీ శిక్ష అనుభవిస్తూ మింగలేక కక్కలేక అన్నట్టు పార్టీలో ఉన్న నేతలంతా ఇప్పుడు తలో దిక్కూ చూస్తున్నారన్న వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి ఎదురైన ఛీత్కారాలు, విమర్శలతో వచ్చే ఎన్నికల్లో ఎలా గట్టెక్కాలా అని కోటి దేవుళ్లకు మొక్కుకుని దిక్కుతోచని స్థితిలో ఉన్న చాలా మంది వైసీపీ నేతలకు చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం అసలు మింగుడుపడటం లేదు.
జగన్ సైకో మెంటాలిటీ ఇలా తమను చిక్కుల్లో పడేస్తుందని అసలు ఊహించని నేతలు చంద్రబాబు అరెస్ట్ తర్వాత కొత్త దారులు వెతుక్కుంటున్నారట. చంద్రబాబు అరెస్ట్ తర్వాత జగన్ సర్కార్‌పై జనంలో తీవ్ర వ్యతిరేకత మొదలైందన్నది అక్షర సత్యం. ఏపీ ప్రజలంతా జగన్ నుతిట్టిపోస్తున్నారన్నదిఅంత కంటే కఠోరమైన నిజం అనుకుంటున్నది అందరికీ తెలిసిందే. ఇలాంటి తరుణంలో 2024 ఎన్నికల్లో175 సీట్లంటూ పగటి కలలుకంటోన్న జగన్ కు అసలు గ్రౌండ్ రియాలిటీ తెలియటం లేదని చాలా మంది నేతలు లబోదిబోమంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత వైసీపీ నేతల్లో మొదలైన ఈ అంతర్మథనం బలపడింది.
అయితే ఇలాంటి ప్రయత్నాలు గతంలోనే చాలా జరిగాయని, జగన్ ఎవరి మాటా వినేరకం కాదన్న అభిప్రాయంతో ఉన్న చాలా మంది నేతలు ఇప్పుడు ఆల్టర్నేటివ్‌వైపు అడుగులేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని మించిన ప్రత్యామ్నాయం లేదని చాలా మంది నేతలను నిర్ణయం తీసేసుకున్నారు. చాలా మంది నేతలు రకరకాల మార్గాల ద్వారా చంద్రబాబుకు చేరువై టిక్కెట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. జగన్ తో సంబంధం లేకుండానే బైరెడ్డి లాంటి నేతలు చంద్రబాబుకు పక్షాన బహిరంగంగా చేరిపోతున్నారు. రాయలసీమకు చెందిన మరో ప్రముఖనేత కూడా తెలుగుదేశం జెండా పట్టుకోవటం ఖాయమని వినిపిస్తోంది.
గతంలో తెలుగుదేశంలో క్రియాశీలకంగా పనిచేసిన నేతలు కూడా మళ్లీ ఆ పార్టీ పంచన చేరేందుకు వీలుగా రూట్ క్లియర్ చేసుకుంటున్నారు.
చంద్రబాబును జైల్లో పెట్టించేసి ఏదో చేద్దామనుకుంటే ఇలా సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదురవడం జగన్ పార్టీకి అసలు మింగుడుపడని అంశం. అందుకే ఈ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచి సమస్యను సద్దుమణిచే ప్రయత్నం చేసినప్పటికీ అది కూడా రివర్సయింది. ఒకరి నుంచి ఒకరికి వైరస్ లా పాకిన అసంతృప్తి సెగలు హైదరాబాద్ దాకా చేరాయి. పలువురు వైసీపీ నేతలు పనిగట్టుకుని హైదరాబాద్ వచ్చి తెలుదేశం పార్టీకి మద్దతుగా నిలిచే మీడియా ఛానెళ్ల ద్వారా తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యి.. టిక్కెట్లు ఖరారు చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారన్న వార్తలుకూడా వైసీని కంగారెత్తిస్తున్నాయి.
అనుకున్నదొకటయితే.. జరుగుతోంది మరొకటని భావించిన వైసీపి ఇప్పుడేం చేయాలో అర్థకాక అయోమయంలో పడినట్టే కనిపిస్తోంది. అందుకే మహాకుట్రను చంద్రబాబు అరెస్ట్ వరకే పరిమితం చేసి…లోకేశ్ కు నోటీసులతో సరిపెట్టింది. సత్యమేవ జయతే అన్న నినాదంతో చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ తెలుదేశం పార్టీ నేతలు, శ్రేణులు జరిపిన దీక్షలకు లభించిన మద్దతుతో మరికొంత మంది వైసీపీ నేతలూ ఫ్యూచర్ ప్లాన్స్‌పై పునరాలోచనలో పడ్డారట.