వైసీపీలో గౌరవప్రదంగా ఇన్నాళ్లు ఉన్న నేతలు కొంత మంది ఇప్పుడు ప్రత్యామ్నాయాలవైపు చూస్తున్నారు. ఎగువ సభలో (మండలి) ఎమ్మెల్సీలుగా ఉన్న కొంత మంది.. చాలా రోజులుగా పార్టీ అధిష్ఠానం విధానాలు నచ్చకపోయినా కొనసాగారు. వైఎస్ జగన్ విధానాలు నచ్చక, ఆయనకు ఎదురు చెప్పే ధైర్యం లేక పలువురు పార్టీలోనే ఉండి కూడా లేనట్లుగానే ఉన్నారు. వైసీపీ హాయాంలో చెడ్డ నోరుతో ప్రత్యర్థులను తిడితేనే మనుగడ అనే విషయం అందరికీ తెలిసిందే. కొడాలి నాని, రోజా, వల్లభనేని, పేర్ని నాని, అంబటి రాంబాబు లాంటి వారే తరచూ హైలైట్ అవుతూ ఉండేవారు.
అలాంటి రాజకీయ విధానం నచ్చని వైసీపీ నేతలు గమ్మునుండేవారు. అలాంటి వారికి పార్టీలో కనీస గౌరవం.. గుర్తింపు లేకుండా ఉండేది. విలువ కూడా ఇచ్చేవారు కాదు. అలాంటి అవమానకర పరిస్థితుల్లో ఇన్నాళ్లూ నెట్టుకొచ్చిన పలువురు ఎమ్మెల్సీలు ఇప్పుడు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు అధికార టీడీపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులను కలిసి తమ ఉద్దేశాలను చెబుతున్నారు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్సీలు టీడీపీ కీలక నేతలు, మంత్రులను కలిసి మాట్లాడగా.. శాసనమండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ జకియా ఖానం కూడా మైనారిటీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ను కలిశారు.
అధికారంలో ఉన్న ఐదేళ్లూ తమకు ఎలాంటి ప్రాధాన్యాన్ని జగన్ మోహన్ రెడ్డి కల్పించలేదని, తమ ఆలోచనలను సభలో లేవనెత్తడానికి అవకాశమే ఉండేది కాదని ఓ ఎమ్మెల్సీ అన్నారు. ఎమ్మెల్సీ ఇచ్చాం కదా.. ఇక నిన్ను మేం ఉద్ధరించినట్లే అన్న చులకన భావంతో అధిష్ఠానం తమను చూసేదని వాపోయారు. సీఎంగా జగన్ ఉన్నన్ని రోజులు ఒక్కసారి కూడా ఆయన్ని కలిసే అవకాశం కానీ, ఎదురుపడితే మాట్లాడే అవకాశం కానీ ఎక్కడా రాలేదని.. అసంతృప్త ఎమ్మెల్సీలు చెబుతున్నారు.
ఇప్పుడు అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్షహోదా గల్లంతు అయింది. కానీ, మండలిలో మాత్రం సంఖ్యాబలం ఉంది. అందువల్లే ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి పార్టీ ఎమ్మెల్సీలందరినీ పిలిచి జగన్ మాట్లాడారని అంటున్నారు. వారు చేజారకుండా జగన్ ఈ జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు. గతంలో ఎప్పుడూ తమను పిలవని జగన్.. ఇప్పుడు తమ అవసరం వచ్చింది కాబట్టే పిలిచారని.. ఎమ్మెల్సీలు వాపోయారు. మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ ఎం.జకియా ఖానం కూడా మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ను కలిసినప్పుడు.. ఇన్నాళ్లూ వైసీపీలో తాను ఎదుర్కొన్న అవమానకర పరిస్థితులను ఆమె మంత్రికి చెప్పినట్లు సమాచారం. వైసీపీలో ఉండడం తమకు ఇష్టం లేదని చెప్పినట్లు సమాచారం. ఇంకా ఎంతో మంది వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక మండలిలో వైసీపీ మొత్తం టీడీపీలో కలిసిపోవడం ఖాయం అని చెబుతున్నారు.