జనగ్మోహన రెడ్డి ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఏ స్థాయిలో చెలరేగిపోతున్నాయో.. ప్రతి సందర్భంలోనూ వార్తల రూపంలో బయటకు వస్తూనే ఉన్నాయి. కేవలం దందాలు మాత్రమే కాదు, పేకాట క్లబ్‌లు నిర్వహించడం, బెట్టింగ్‌లు నిర్వహించడం, ఇసుక దందాలు, అడవులను తవ్వేయడం, ఇలాంటి సకల అరాచక కార్యకలాపాల్లో కేవలం పార్టీ శ్రేణులు మాత్రమే కాదు. సాక్షాత్తూ ఎమ్మెల్యేలు కూడా మరీ కక్కుర్తిగా లేకి చీప్ దందాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. అయినా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం- ఇలాంటి ఆరోపణల పట్ల ఒక రకమైన ఉదాసీనత, ఉపేక్ష భావంతోనే మిన్నకుంటోంది. పత్రికల్లో ఎలాంటి నెగటివ్ వార్తలు వచ్చినప్పటికీ.. ‘పచ్చ మీడియా పత్రికలు ఇచ్చమొచ్చినట్టు రాస్తున్నాయనే’ ఒక ట్యాగ్ లైన్ నినాదాన్ని పదేపదే వాడడం ద్వారా తాము సేఫ్ జోన్‌లోనే ఉన్నామని వారు అనుకుంటూ ఉండొచ్చు కూడా.
అయితే ఇప్పుడు రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు ముందస్తుగా వస్తాయనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఒక్క అధికార పార్టీ తప్ప దాదాపుగా అన్ని పార్టీల నాయకులూ ఒకే మాట చెబుతున్నారు. కేంద్రం జమిలిఎన్నికల గురించి ఆలోచిస్తున్న నేపథ్యంలో 2022లోనే ముందస్తు ఎన్నికలు వచ్చేస్తాయని అంటున్నారు.
తనకు ఢిల్లీ నుంచి సమాచారం ఉన్నదని.. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని చంద్రబాబునాయుడు తాజాగా పిలుపు ఇచ్చారు. గతంలో కూడా ఆయన ఒకటి రెండు సందర్భాల్లో ఈ విషయం చెప్పారు. ఇప్పుడు మళ్లీ అది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ నాయకులు కూడా ముందుగా రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయనే మాటలు అడపాదడపా మాట్లాడుతూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకుల్లో అంతర్మధనం ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలుప్రాంతాల్లో చాలావరకు అభాసుపాలవుతున్న సంగతి వారి దృష్టిలో కూడా ఉంది. తమ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు సాగిస్తున్న దందాలకు తక్షణం ఫుల్ స్టాప్ పెట్టకపోతే గనుక.. ముందు ముందు చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని వారు భయపడుతున్నారు.
ఈ మేరకు దందాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా కిందిస్థాయికి సంకేతాలు పంపుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. తమ ప్రభుత్వం వచ్చింది అయిదేళ్ల పాటూ కుమ్మేసుకోవచ్చునని మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి.. చెలరేగుతున్న పార్టీ శ్రేణులు పైనుంచి సంకేతాలు వచ్చినంత మాత్రాన ఒక్కసారిగా తమ చేతులు కట్టేసుకోగలరా? అలాగని, ఇప్పటికీ విశృంఖలంగా వ్యవహరిస్తే.. ఎన్నికలు ఎంత త్వరగా వస్తాయో తెలియదు.. ఆ పరిస్థితి వస్తే.. దెబ్బ తప్పదు కదా.. అనే ఆలోచనతో పార్టీ పెద్దలు మధనపడుతున్నట్లు తెలుస్తోంది. అడుసు తొక్కనేల.. కాలు కడగనేల అన్నసామెత చందంగా పార్టీ పరిస్థితి తయారైందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.











