PM Modi Praises Sai Praneeth On Mann Ki Baat :
వాన రాకడ, ప్రాణం పోకడ అని పెద్దలు ఊరకనే చెప్పలేదు. భారీ వర్షం కురుస్తుందని ఆకాశం వైపు దిగులుగా చూస్తే.. చుక్క నీరైనా కురవదు. ఎండలు దంచికొడుతున్నాయ్.. ఈ టైంలో వర్షం పడే చాన్సే లేదని భావిస్తే.. భారీ వర్షం కురవొచ్చు. వాతావరణ పరిస్థితుల కారణంగా ఎప్పుడు వర్షం కురుస్తుందో, ఎప్పుడు పడదో తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ తిరుపతికి చెందిన సాయి ప్రణీత్ ను ఆలోచింపజేశాయి. వర్షాల వల్ల రైతులు తమ విలువైన పంట కోల్పోతుండటం, పిడుగుల పాటుకు రైతులు చనిపోతుండటం సాయిని ఎంతగానో బాధించాయి. అందుకే రైతుల కోసం ఏదైనా చేయాలని భావించి ‘వెదర్ మ్యాన్’ పేరుతో వాతావరణ సమాచారం అందించే డివైజ్ తయారుచేశాడు.
వెదర్ మ్యాన్ గా గుర్తింపు
వర్షం కురుస్తుందా.. లేదా.. అనేది కొన్ని నిమిషాల ముందు చెప్పడం ఎవరికైనా చెప్పడం కష్టమే. కానీ సాయిప్రణీత్ తయారుచేసిన ‘వెదర్ మ్యాన్’ యాప్ నిమిషాల్లోనే రిపోర్ట్ చేస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, విశాఖ జిల్లాలోని పలు రైతులకు ఉచితంగా వెదర్ రిపోర్ట్ అందిస్తున్నాడు. ఇందుకోసం సోషల్ మీడియాలో వెదర్ మ్యాన్ ఫేస్ బుక్ పేజీ ని ప్రారంభించి, అందులో వాతావరణ వివరాలను అప్డేట్ చేస్తుంటాడు. ఈ వెదర్ మ్యాన్ అందుబాటులోకి వచ్చాక రైతులు, కూలీలు, కార్మికులు వాతావరణ మార్పులను గ్రహిస్తూ రోజువారి పనులు చేసుకుంటున్నారు.
మోదీ ప్రశంసల జల్లు
తిరుపతికి చెందిన సాయి ప్రణీత్ అనే యువకుడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ రోజు మోదీ మన్ కీ బాత్‌లో మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాల్లో రైతులకు ఏపీ వెదర్ మన్ పేరుతో వాతావరణ సమాచారం అందిస్తూ సాయి ప్రణీత్ మంచి పని చేస్తున్నారని అన్నారు. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న సాయి ప్రణీత్ తాను రైతులకు అందిస్తోన్న సేవలకు గాను ఐక్యరాజ్యసమితి, భారత వాతావరణ శాఖ నుంచి కూడా గతంలో ప్రశంసలు అందుకున్నారు. ఆయన సేవలను మన్ కీ బాత్‌లో మోదీ ప్రస్తావించారు.